నిర్మలా సీతారామన్ ఆ మాట అనొచ్చా, అది దేనికి సంకేతం
"నేను ఈ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు లేదు. అందుకే ఎన్నికలకు దూరం," అంటున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలా కేంద్ర మంత్రి అనొచ్చా
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం నిర్మల సీతారామన్ ను కోరింది. దానిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు?
పాలకురాలుగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె అనుకుంటే గెలుపు కూడా సులువేనని చెప్పొచ్చు. ఎందుకు ఈమాట చెప్పాల్సి వస్తోందంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ. చాలా మంది డబ్బులు లేని వారు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ లు కూడా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వారంతా డబ్బుండే పోటీ పడుతున్నారా? రాజకీయాల్లో కొందరు మంచి వారు ఉండటం వల్ల వ్యవస్థను మంచి మార్గంవైపు పయనింప చేయాలంటే ఎన్నికలే ఆయుధం. వారు ఎన్నికల్లో పోటీ చేసి ముందుకు సాగితేనే అనుకున్నది సాధించిన వారు అవుతారు. నిర్మల సీతారామన్ ప్రస్తుతం దేశ ఆర్థిక మంత్రి. ఆమె ఎవరికైనా చెప్పాల్సింది ఏమిటి, విద్యావంతులైన యువకులు రాజకీయాల్లోకి రావాలని, మంచిని ప్రోత్సహించే పనులు ఏవైనా చేయాలని సూచించాలి. ఒకరికి ఆదర్శంగా నిలవాల్సిన నిర్మల సీతారామన్ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే మాటలు మాట్లాడారనేది పలువురు మేధావుల వాదన.
చాలా మంది విద్యావంతులైన యువకులు నేడు రాజకీయాల్లోకి రావడం లేదు. కేవలం డబ్బున్న వారు మాత్రమే వస్తున్నారు. వారిలోనూ ఎక్కువ మంది రాజకీయ నాయకుల కొడుకులు, కూతుళ్లు ఇలా వస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాజకీయ వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే గెలిచిన పార్లమెంట్ సభ్యుల్లో సుమారు 80 శాతం మంది అపర కోటీశ్వరులే ఉన్నారు. డబ్బుతో పాటు పవర్ ను చేతుల్లోకి తసుకోవడం వల్ల దేనినైనా శాశించే స్థాయికి కొందరు పాలకులు వెళుతున్నారు. వీరు పవర్ పాలిటిక్స్ వేదికగా కావాల్సినంత డబ్బును కూడా సమకూర్చుకుంటున్నారు. ఇవి నేటి ఆర్థిక మంత్రి నిర్మలకు తెలియనివి కాదు. విద్యావంతులైన యువను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ప్రోత్సహించాల్సిన మంత్రి వారి ఆశలు నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడారు. ఎందుకు ఇలా జరిగిందనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
బీజేపీ రాజకీయాలు నచ్చలేదా?
భారతీయ జనతా పార్టీ రాజకీయాలు నిర్మల సీతారామన్ కు నచ్చలేదా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నచ్చినా నచ్చకపోయినా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగినందుకు అభినందిస్తున్నారు. ఇందుకు ఆమెను మనమందరం గౌరవించాలి. ఒక మహిళ అయుండి, అందులోనూ బీజేపీలో మంత్రిగా ఉండి, ప్రధానిని సైతం ఏ విషయంలోనైనా ఒప్పించగలిగే సత్తా ఉన్న మంత్రిగా నేటి వ్యవస్థను నిందించే విధంగా మాట్లాడారంటే ఈ పాలన బాగోలేదనే సంకేతాన్ని కూడా ఆమె ఇచ్చారు.
కుల, మతాలను ప్రస్తావించారు
నేటి రాజకీయాలు కులం, మతంలో మగ్గుతున్నాయనే అభిప్రాయాన్ని కూడా వెలుబుచ్చారు. కులాన్ని, మతాన్ని ప్రోత్సహిస్తోంది ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ. అటువంటి పార్టీలో నాయకురాలుగా ఉంటున్నారు. అంటే బీజేపీ కుల, మత చిచ్చులకు కూడా కారణమనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కుల చిచ్చులు రాజుకున్నాయి. మత చిచ్చులకు లెక్కలేదు. ఒక్కోచోట మతం పేరు చెప్పి ప్రజలను ఇష్టం వచ్చినట్లు కొందరు హింసిస్తున్నారు. పాలకులు చూసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల చెప్పినట్లు చేయడం లేదని బీజేపీ అభిమానులు కొందరు కర్రలతో చాలా మందిని చితక బాదిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా వేదికలుగా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం.
ఇన్ని తెలిసిన సీతారామన్ పాలకు రాలుగా ఎలా ఉన్నారనేదే ప్రశ్న. ఆమె ఒక్కటి భావించిన ఉండొచ్చు. నావరకు నేను నీతి, నిజాయితీగా ఉన్నాను. పార్టీ సపోర్టు చేసినంతకాలం పదవిలో ఉంటా. లేదంటే పక్కకు తప్పుకుంటాననే ఆలోచనలో ఆమె ఉన్నట్లు స్పష్టమైంది.
రాజకీయ అవినీతిని చెప్పకనే చెప్పారు
దేశంలో జరుగుతున్న రాజకీయ అవినీతిని చెప్పకనే చెప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. నిర్మల సీతారామన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని నేను భావిస్తున్నాను. ఇప్పుడు డబ్బులేని వారు రాజకీయాల్లో పోటీ చేయలేరు. చేసినా ఉపయోగం వుండదు. అందరూ డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. సాక్షాత్తు ఆర్థిక మంత్రే అంగీకరించారు. కుల మతాలు, భాష వైరుధ్యాలు రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి దిగజారటం వల్ల ఈ ఎన్నికల్లో పోటీలు చేయలేని స్థితి వచ్చిందనే విషయాన్ని ఆమె అంగీకరించారు. పదేళ్ల కాలంలో రాజ్యాంగ ప్రణాళిక అంశాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు. ఈ వైరుధ్యాలన్నీ రాజ్యాంగ పరంగా పరిశీలిస్తే కొంచమైనా తగ్గాలి. కానీ ఎక్కడా తగ్గలేదు. పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆమె అలా మాట్లాడారు. పార్టీలకు చందాల బాండ్ల విషయంలోనూ ఆమె తెగేసి చెప్పారు. అందుకే ఎన్నికలు దామాషా పద్ధతిలో ఉండాలని నేనూ కోరుతున్నాను. అప్పుడు అందరూ పోటీ చేయొచ్చు. పార్లమెంట్ సభ్యుల్లో 350 మంది కోటీశ్వరులు ఉన్నారు. దేశ రాజకీయాలు వ్యాపారం అయ్యాయి. దేశ సంపదను దోచుకున్న వారికి ఈ ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. అందుకే ఆమె అలా మాట్లాడారు.
గాంధీ పోటీ చేసినా డిపాజిట్లు రావు
స్వాతంత్ర్యోద్యమ నాటి మహాత్మా గాంధీ వచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసినా డబ్బు లేకుండా డిపాజిట్లు కూడా రావని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా విభాగం ఇన్చార్జ్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై ఫెడరల్ ప్రశ్నించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆమె చెప్పిన మాటలు అన్నీ నిజాలేన్నారు. పాలించే వారైనా డబ్బులు లేకుండా ఎన్నికల్లో గెలవలేని మాట వాస్తవం. నేను కూడా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు, డబ్బలు లేగనే. అదే వస్తవాన్ని ఆమె చెప్పారు. ఇటువంటి పరిస్థితులు ఎప్పటికైనా వస్తాయనే అప్పట్లో రాజ్యాంగ కర్తలు మేధావుల సభను ఒకదానిని నెలకొల్పారు. అలా కాకుండా ఉండి వుంటే ఇంకా దారుణంగా ఉండేది. రాజ్యసభ ఉండబట్టి మేధావులకు అవకాశం దక్కుతోంది. ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ నుంచి ఎన్నికైన వారే. ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా పాల్గొనడం చేతకాని వారు తప్పకుండా పరోక్ష పద్ధతిలోనే ఎన్నికల్లో గెలుస్తారు. వారు ఎంతో కొంత దేశానికి చేయగలుగుతారు. నిర్మల సీతారామన్ మాటలను నేను గౌరవిస్తున్నానన్నారు తులసిరెడ్డి.