ఏపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారా? విభజన చట్టం హామీల గురించి లేవనెత్తుతారా? పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు తెస్తారా?


ఈ నెల 24 నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఎన్డీఏ కూటమి ఎంపీలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల వ్యూహం ఏమిటనేది ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్టు చేస్తున్నాయి. బీజేపీ తరుపున ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు ఎలాగూ బీజేపీ లైన్‌ ప్రకారమే వెళ్తారు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సింది ఏమిటంటే .. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నలుగురు ఎంపీల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దదు ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలపై చర్చ మొదలైంది. తమ పార్టీ వారిని చంపుతున్నారని జగన్‌ బహిరంగంగా లెక్కలు వెల్లడించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలియాలని ఈ నెల 22న ఢిల్లీ కేంద్రంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, రాజ్య సభ సభ్యులు, ఎమ్మెల్సీలతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన కార్యాలయంలో జరిగిన ఎంపీలు, రాజ్యసభ సభ్యుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కలిసి వచ్చే అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఢిల్లీలో ధర్నా అనంతరం పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఎంపీలు ప్రసంగించి యావత్‌ భారతదేశ ప్రజల దృష్టికి ఏపీలో జరుగుతున్న దారుణ పరిస్థితులను తీసుకెళ్లాలనేది ప్రధాన నిర్ణయం. రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌ను దేశ వ్యాప్తంగా మారుమోగించాలని జగన్‌ తన ఎంపీలకు దిశా నిర్థేశం చేశారు. హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై లెక్కలతో సహా పార్లమెంట్‌లో గళం విప్పితేనే పార్టీ సభ్యులకు విలువ పెరుగుతుందని ఎంపీలకు గుర్తు చేశారు.
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంట్‌ సభ్యులతో ప్రత్యేకంగా తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టాలి అనే దానిపై పట్టుబట్టాల్సి ఉందని ఎంపీలకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖల్లో పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియేజాయలని అందుకోసం రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకొని పోవాలని సూచించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు రావలసిన నిధులు తప్పనిసరిగా సాధించాలి. ఢిల్లీలో జగన్‌ ఏమి చేస్తారనేది ముఖ్యం కాదని, మనము ఏమి చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలకు ఉద్బోదించినట్లు తెలిసింది.
గత పార్లమెంట్‌ సమావేశాల సందర్భంలోను సీఎం చంద్రబాబు ఇవే అంశాలను తన పార్టీ ఎంపీలకు చెప్పారు. ఆ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు మాట్లాడింది లేదు. ఒక్క రూపాయి నిధులను కేంద్రం నుంచి తెచ్చింది లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్డీఏ కూటమిలో మొదటి నుంచి భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోను విజయం సాధించింది. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేసి మూడు స్థానాలు దక్కించుకుంది. ఏపీలో జనసేన, బీజేపీ దాదాపు ఒకే మాట, ఒకే బాటగానే ఉన్నాయి. టీడీపీ మాదిరిగా వీరు కూడా నిధుల కోసం ప్రత్యేక పోరాటం చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014, 2019 ఎన్నికల్లో ప్రత్యేక నినాదంగా కొనసాగిందే తప్ప కేంద్రం మాత్రం స్పందించ లేదు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదమే లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉండటం, వైఎస్‌ఆర్‌సీపీ అనధికారికంగా ఎన్డీఏ కూటమికి కేంద్రంలో మద్దతునివ్వడం.
ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కొండ ప్రాంతం ఎక్కువుగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది సాకు మాత్రమే. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అప్పట్లో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారం కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా చట్టం చేసి అమల్లోకి తేవడం పక్కన పెట్టేసింది. 2019లో పూర్తి మెజారిటీ సాధించిన వైఎస్‌ జగన్‌ ఏపీ ఎంపీల అవసరం కేంద్రానికి లేకుండా పోయిందంటూ తప్పించుకుని అటు బీజేపీ, ఇటు వైఎస్‌ఆర్‌సీపీ, అలాగే టీడీపీ, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని చేశాయని సీపీఐ రాష్ట్ర నాయకులు కేవీవీ ప్రసాద్‌ అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కానీ, నిధులు రాబట్టి రాష్ట్రాభివృద్ది చేస్తామని చెబుతున్న ఎన్డీఏ కూటమికి కానీ రాష్ట్ర ప్రజలపై ప్రేమాభిమానాలతో ఉన్నారనుకుంటే పొరపాటే అని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 40 రోజలు దాటింది. రెండు సార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. అయినా కేంద్రం నుంచి ఒక శుభవార్త కూడా అందలేదు. కేంద్రంపై ఎవరి పోరాటం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Next Story