వైఎస్‌ఆర్ కుటుంబంలో ఆస్తుల మధ్య గొడవలు రచ్చకెక్కడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేది చర్చగా మారింది.
ఆస్తుల గురించి జగన్‌పై వైఎస్ షర్మిల మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. జగన్ తనకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనేది ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అన్నారు. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం, అనుబంధాలను మార్చారని విమర్శించారు. ఆస్తుల గొడవల పేరుతో కుటుంబ విషయాలను జగన్ రోడ్డు మీదకు తీసుకొచ్చారని, అంతటితో ఆగని జగన్ కోర్టుల వరకు కూడా తీసుకెళ్లారని విమర్శించారు. ఆస్తులను లాక్కోవడానికి జగన్ కారణంగా బెబుతున్నారని, కానీ అది వాస్తవం కాదన్నారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదన్నారు. రూ. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని ఈడీ అటాచ్ చేసిందని, కంపెనీ షేర్లను ఎప్పుడూ అటాచ్ చేయలేదని పేర్కొన్నారు. ఏ సమయంలో అయినా షేర్లను బదిలీ చేసుకోవచ్చుని, ఏ కంపెనీ ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేసినా, ఆ షేర్లను ఆపలేదని పేర్కొన్నారు. షేర్లు బదిల చేస్తే బెయిల్ రద్దవుతుందని వాదిస్తున్నారని,
2019లో 100 శాతం షేర్లు బదలాయిస్తూ ఎంఓయుపైన ఎలా సంతకం చేశారని ప్రశ్నించారు. అది చేసిన నాడు జగన్‌కు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. 2021లో క్లాసిక్, సండూరు షేర్ల కొనుగోలుకు అనుమతులు ఎలా ఇచ్చారని, షేర్లను రూ. 42 కోట్లకు కొనుగోలు చేసేందుకు అమ్మకు ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించారు. నాడు కూడా బెయిల్ విషయం గుర్తుకు రాలేదా అని జగన్‌ను ప్రశ్నించారు. 2021లో జగన్, అతని సతీమణి షేర్లను ఎలా తల్లి గిఫ్ట్‌డీడ్ ఇచ్చారని నిలదీశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓటమి పాలైన తర్వాత ఈ ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేదని, భారతీ సిమెంట్స్ బ్యానర్ కింద సరస్వతి సిమెంట్ చేపట్టాలని జగన్ ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈడీ అటాచ్ అంశాన్ని జగన్ లేవనెత్తారని, అందులో బాగంగా షేర్లు బదిలీ చేయలమేని జగన్ చెబుతున్నారని, కంపెనీ భూమి తప్ప షేర్లు అటాచ్ చేయనందు వల్ల షేర్లు బదిలీ చేయొచ్చని షర్మిల పేర్కొన్నారు.