Vijaya Sai Reddy
x
విజయసాయి రెడ్డి

ఉత్తరాంధ్రపై ఆధిపత్యంలో విజయసాయిది అందెవేసిన చేయి!

రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రకటనపై సర్వత్రా ఆశ్చర్యం. ఉన్నట్టుండి బాంబు పేల్చడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం.

విజయసాయిరెడ్డి.. రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తర్వాత రెండు స్థానంలో నిలిచిన వ్యక్తి. వైఎస్ జగన్కు అన్ని రకాలుగా అండగా నిలిచిన నాయకుడు. ఇటు రాజకీయాల్లోనూ, అటు పార్టీలోనూ తిరుగులేని నేతగా చలామణి అయ్యారు. ఉత్తరాంధ్రలో అయితే అన్నీ ఒంటి చేత్తో చక్రం తిప్పారు. అనేక ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. స్వపక్షంలో సీనియర్లకు మింగుడు పడకుండా వ్యవహరించారు. ఇప్పుడు ఆకస్మికంగా రాజకీయాలకు గుడ్బై చెప్పినట్టు ప్రకటించడం ఉత్తరాంధ్ర వైసీపీ సహా ఇతర రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర పగ్గాలు విజయసాయిరెడ్డే ఎక్కువ రోజులు చేపట్టారు. అధికారంలోకి రాకముందే తన హవాను కొనసాగించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత జోరు పెంచారు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి కరడుగట్టిన సీనియర్లను కాదని అంతా తానై వ్యవహరించారు. అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు కావడం, 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరు విజయసాయిరెడ్డిపై జగన్కు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. అయితే తమ అసంతృప్తిని వీరు అనుచరుల వద్ద వ్యక్తం చేసేవారు.

ఆనోటా, ఈనోటా వీరి అసంతృప్తి జగన్కు చేరినా ఆయనేమీ పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో వీరు మిన్నకుండి పోయారు. ఉత్తరాంధ్రలో ఆ పార్టీ నాయకులంతా తెల్లారిలేస్తే విజయ సాయి చుట్టూనే ప్రదక్షిణలు చేసేవారు. తమకు కావలసిన పనులన్నీ ఆయనతోనే జరుగుతాయనే నమ్మేవారు. విశాఖ సీతమ్మధారలోని ఆయన కార్యాలయం/క్యాంప్ ఆఫీసు కార్యకర్తలు, నాయకులతో కిటకిటలాడుతూ కనిపించేది. రాజ్యసభ సభ్యునిగాను, పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ హోదాలోనూ ఆయన ఎక్కువ రోజులు విశాఖలోనే గడిపేవారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనకున్న పట్టు, పలుకుబడి ఎరిగిన అధికారులు సైతం విజయసాయి అంటేనే గడగడలాడే వారని చెప్పుకుంటారు.

వివాదాలు.. ఆరోపణలు..

విజయసాయిరెడ్డిపై విశాఖలో ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. ప్రధానంగా భూముల వివాదాలు ఆయన్ను ఎక్కువగా చుట్టుముట్టాయి. విశాఖలోని దసపల్లా భూముల వ్యవహారం, భీమిలి తీరప్రాంతంలో ఆయన కుమార్తె పేరిట కొనుగోలు చేసిన భూముల్లో నిర్మాణాలకు సీఆరెజెడ్ నిబంధనల అతిక్రమణ, ప్రైవేటు వ్యక్తుల నుంచి బలవంతంగా భూములను కొనుగోలు చేయడం, మరికొన్ని ఆస్తులను బినామీల పేరిట కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ ఆమె భర్త చేసిన ఆరోపణలు కూడా విజయసాయి ఇమేజిని దెబ్బతీశాయి.

ఇక రాజకీయంగా ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రులుగా పేరున్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణల ప్రాధాన్యతను తగ్గించారన్న విమర్శలను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో గ్రూపులను ప్రోత్సహించారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. తాజాగా ఇటీవల వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయికి అధినేత జగన్ మరోసారి అవకాశం ఇచ్చారు. పార్టీ అధికారాన్ని కోల్పోయాక ఆ బాధ్యతలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. కానీ విజయసాయి తనకే కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నారన్న ప్రచారం ఆ పార్టీ నాయకుల్లో ఉంది. చాన్నాళ్లుగా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు విజయసాయిరెడ్డితో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు.

విజయసాయి వైసీపీని ఎందుకు వీడారో?

విజయసాయిరెడ్డి వైసీపీని వీడతారని అందరితో పాటు ఉత్తరాంధ్ర వాసులూ ఊహించలేదు. శుక్రవారం సాయంత్రం ప్రసార మాధ్యమాల్లో ఆయన వైసీపీకి గుడ్బై చెబుతున్నట్టు వార్తలు వెలువడడంతో వైసీపీతో పాటు ఇతర పార్టీల్లో కలకలం రేగింది. ఆ వార్త నిజమేనా? అంటూ ఫోన్ల ద్వారా వాకబు చేసుకున్నారు. చివరకు నిజమేనని నిర్ధారించుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఆకస్మికంగా పార్టీకి గుడ్బై చెప్పడానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయంటూ తలో రకంగా చర్చించుకుంటున్నారు. ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని చెప్పుకుంటున్నారు. పార్టీలో అవమానకర పరిస్థితులైనా ఎదురై ఉండాలి.. లేదా ఎన్డీయే, కూటమి ప్రభుత్వాలు కేసుల్లో ఇరికిస్తారన్న భయంతోనైనా వైసీపీని వీడి ఉంటారని ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు.

Read More
Next Story