సమస్య ఏపీ మంత్రి వర్గానికి మల్లబడింది. బుర్రలకు ఎంత పదును పెట్టినా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రూ. 600 కోట్లతో కొన్న రాళ్లు ఏమి చేయాలో అర్థం కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాళ్ల సమస్య వచ్చింది. ఆ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. అలాగే వదిలేద్దామంటే రూ. 600 కోట్లు పెట్టి గత ప్రభుత్వం కొనుగోలు చేసిన రాళ్లు అవి. ఉపయోగిద్దామంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ పథకమే వద్దనుకుని రద్దు చేసింది. కొనుగోలు చేసినవి గ్రానైట్ రాళ్లు. ఇంతకీ ఈ రాళ్ల కథేంటి? ఎందుకు రాళ్ల సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతలా కుదిపేస్తోంది.
జగన్ బొమ్మలు, పేర్లు... ఏమిటిది?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చాలా పథకాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పెట్టింది. విద్య, రెవెన్యూ, వ్యవసాయం, రిజిస్ట్రేషన్‌ల శాఖలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ శాఖలే కాకుండా సంక్షేమ శాఖల్లోని పలు పథకాలకు కూడా జగన్ పేరు పెట్టారు. ప్రజల డబ్బుతో జగన్ పేరు పెట్టుకోవడం, బొమ్మలు వేసుకోవడం ఏమిటని తెలుగుదేశం ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. విద్యాశాఖలో పథకాల పేర్లు పూర్తిగా మార్చేశారు. రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్లపై వేసిన జగన్ బొమ్మలు ఇకపై ఇచ్చే కొత్త డాక్యుమెంట్లకు రాకుండా చర్యలు చేపట్టారు. పట్టాదార్ పాస్ పుస్తకాల వంటివాటిపై జగన్ బొమ్మ లేకుండా ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండే విధంగా కొత్త పాస్‌పుస్తకాల విడుదలకు శ్రీకారం చుట్టింది. రూ. 22.95 కోట్ల ఖర్చుతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో కొత్త సర్వే పత్రాలు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ భూ హక్కు పత్రాల జారీకి ఎంత మొత్తం ఖర్చు చేసిందో అంతే మొత్తం మళ్లీ ఖర్చుకానుంది. ఈ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్, ప్రభుత్వ రాజముద్ర వేసి ఇస్తారు. విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లపై కూడా ఎటువంటి బొమ్మలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది.
జగన్ బొమ్మ రాళ్లను ఏమి చేద్దాం
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. ఈ సర్వేలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని, భారీ స్థాయిలో ఒకరి భూములు ఒకరు లాక్కునే కార్యక్రమం మొదలైందని, ఈ రీ సర్వేను రద్దు చేస్తున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. రీ సర్వే సందర్భంగా భూముల మధ్య హద్దు రాళ్లు పాతేందుకు గ్రానైట్ రాళ్లను కొనుగోలు చేసింది. ఈ రాళ్లపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మను ముద్రించారు. సుమారు ఏడు వేల గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే పూర్తయింది. నూతన తెలుగుదేశం ప్రభుత్వం రీ సర్వేను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. అయితే రీ సర్వేకోసం తెచ్చిన హద్దు రాళ్లపై జగన్ బొమ్మ ఉండటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.
మంత్రివర్గంలో చర్చ
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూముల హద్దురాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మ వేయడంపై చర్చ జరిగింది. ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలు పలు రకాలుగా సాగాయి. కొందరు మంత్రులు ఈ రాళ్లను గుడులు, బడులు నిర్మించేటప్పుడు పునాది రాళ్లుగా ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రులు చేసిన సూచనల్లో ఒక్కటి కూడా ముఖ్యమంత్రికి నచ్చలేదు. రాళ్లను అలాగే వదిలేద్దామా? అంటే రూ. 600 కోట్లు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఉపయోగిద్దామా అంటే ప్రత్యర్థి వైఎస్ జగన్ బొమ్మ కళ్లకు కనిపిస్తోంది. తుడిపేస్తే పోయేది కాదు. గ్రానైట్ రాళ్లపై చెక్కిన బొమ్మ. రాళ్లపై వేసిన బొమ్మను తుడిపించే కార్యక్రమం చేపడదామని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. అయితే ఇందకోసం ఎన్నికోట్లు ఖర్చవుతుందో అంచనా వేయాల్సి ఉంది. జగన్ చేసింది ఒక తప్పయితే ఆ తప్పును సరిదిద్దేందుకు మరో తప్పు చేసి వందల కోట్లు తగలేయడాన్ని ప్రజలు జీర్ణించుకుంటారా? లేదా? అనే అనుమానాలు కూడా ముఖ్య మంత్రి మదిలో మెదిలాయి.
ఈ విషయంలో సరైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేక తర్జన భర్జన పడుతోంది. ఈ రాళ్లను ప్రభుత్వం దేనికోసం వినియోగిస్తుందో, ఎలా సమస్యను పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.
Next Story