గంటా మాకేంటీ తలనొప్పి!
x
గంటా శ్రీనివాస రావు

'గంటా' మాకేంటీ తలనొప్పి!

టిడిపి కూటమి పార్టీలు దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ఇంకా ప్రకటించలేదెందుకు...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన జరిగినప్పటికీ విశాఖ జిల్లాలో రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు ఇంకా జరగలేదు. విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఇంకా ప్రకటించకపోవడంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు తప్ప విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు.

వంశీకి గ్యారంటీ ఉందా...?

తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి విశాఖ దక్షిణ నియోజకవర్గం కేటాయింపు కాగా… తెలుగుదేశం పార్టీకి భీమిలి సీటు కేటాయించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వంశీకృష్ణ యాదవ్‌‌ను జనసేన అనధికరింగా ప్రకటించారు. స్వయంగా పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధిగా ప్రచారం సైతం ప్రారంభించేశారు. స్థానిక నేతల వ్యతిరేకత ఉండడం, వంశీ సామాజిక వర్గ ఓటర్లు ఆ నియోజకవర్గంలో పెద్దగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆ స్థానం ఇంకా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ ప్రారంభం నుంచి ఉన్నటువంటి టి శివశంకర్‌ను దక్షిణంలో నిలబెట్టే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తనకు టికెట్ ఇస్తే సత్తా చాటుతానంటూ వైసీపీకి రాజీనామా చేసిన సీతంరాజు సుధాకర్ సైతం జనసేన పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ టికెట్ మార్చడం అంటూ జరిగితే వంశీ పరిస్థితి అగమ్యగోచరంగా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ పార్టీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్న వంశీ కృష్ణ.. దక్షిణ నియోజకవర్గం స్థానం ఆశించారు. పొత్తుల్లో భాగంగా ఈ నియోజకవర్గం జనసేనకి కేటాయించారు. వంశీపై దక్షిణంలో వ్యతిరేకత రావడం, నియోజకవర్గం ప్రచార కార్యక్రమాల్లో స్థానిక నేతలను కలపుకోలేకపోవడం వంటి కారణాలు అభ్యర్థిని మార్చే స్థాయికి తీసుకొస్తున్నాయనే చర్చ సాగుతోంది. అయితే ఈ నియోజకవర్గ టికెట్‌ వంశీకే ఉంటుందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని వంశీ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకొని వచ్చిన ఆయనకు జనసేన పార్టీ అధినేత పవణ్‌ కళ్యాణ్‌ అన్యాయం చెయ్యరని చెబుతున్నారు. అయినప్పటికీ ఆశావహుల కుమ్ములాట నేపథ్యంలో జనసేన ఈ సీటును పెండింగ్ పెట్టింది.

భీమిలి పరిస్థితి ఏంటి...

మరో వైపు భీమిలి నియోజకవర్గం ఆశించిన గంటా శ్రీనివాసరావుని తొలి నుంచి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీకి దిగాలని టీడీపీ అధిష్టానం కోరినా, విశాఖ జిల్లా వదిలి వెళ్లడానికి నిరాకరించడంతో భీమిలి విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోవలేదు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు యోచిస్తూ, అన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలనే పోటీకి దింపాలని భావిస్తున్నారు. దీంతో అభ్యర్ధుల ఖరారు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. భీమిలిలో ఇప్పటికే అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ కూడా బలంగానే ఉంది. భీమిలి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేనకు కేటాయించడంతో అక్కడ సీనియర్ నేత కరోతి బంగారు రాజు భీమిలిలో తనకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం సీనియర్ నేత కళా వెంకటరావు కూడా భీమిలి కోసం పోటీ పడటంతో టిడిపి అధిష్టానానికి భీమిలి అభ్యర్థి ఖరారు తలనొప్పిగా మారింది. ఈ కారణాలవల్లే ఇప్పటి వరకు టిక్కెట్ ప్రకటించలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఆశావహుల పేర్లు పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం త్వరలో అభ్యర్థిని ప్రకటించనుందని చెబుతున్నారు.

Read More
Next Story