మండలిలో ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. ఇది మంచి సంప్రదాయం కాదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలలో శాసన సభ కంటే శాసన మండలే ప్రాధాన్యత సంతరించుకుంది. శాసన సభలో ప్రతిపక్షం లేక పోవడం, శాసన మండలిలో బలమైన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండటంతో అటు కూటమి ప్రభుత్వం దృష్టి, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దృష్టి శాసన మండలి మీద పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన చర్చలు కూడా శాసన సభలో కంటే శాసన మండలిలోనే వాడీ వేడీగా జరుగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం చేస్తుండగా.. తాము అధికారంలో ఉన్నామనే దర్పాన్ని ప్రదర్శించేందుకు, ఈ నేపథ్యంలో ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెట్టేందుకు అధికార పక్షం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో సారి చర్చలు పక్క దారి పట్టి రాజకీయాల వైపునకు మళ్లుతున్నాయి. దీంతో చర్చలు ఫలించడం లేదు. పరస్పరం విమర్శలు చేసుకోవడం, వాగ్వాదాలకు చేసుకోవడానికే సభా సమయం సరిపోతోంది.

ఈ నేపథ్యంలో శాసన మండలిలో చర్చలు సరిగా జరగడం లేదని, చర్చల్లో అధికార పక్షం వ్యవహార శైలి సరిగా లేదని, శాసన మండలి ప్రతిపక్ష నేత(ఎల్వోపీ), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పోయింట్‌లో మాట్లాడుతూ ప్రతిపక్షం, ఇతర పక్షాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం సరిగా సమాధానాలు చెప్పడం లేదని మండిపడ్డారు. అడిగిన వాటికి మంత్రలు సరిగా సమాధానాలు చెప్పకుండా చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆక్షేపించారు. చర్చల పట్ల కానీ, పాలన పట్ల కానీ, ప్రజల పట్ల కానీ కూటమి ప్రభుత్వానికి ఒక నిర్థష్టమైన ఆలోచన సరళి లేదని, తాము అధికారంలో ఉన్నామనే దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య కాలంలో స్కామ్‌లు ఏమైనా జరిగితే వాటి మీద విచారణ చేసుకోమని తాము చెప్పామని, అయితే తాము 2014 నుంచి చర్చించాలని కోరామని కానీ దీనికి అధికార పక్షం ముందుకు రావడం లేదని అన్నారు. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతూ సభా గౌరవాన్ని, మర్యాదలను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు.
మండలిలో జరిగిన చర్చల్లో వైజాగ్‌ భూముల సిట్‌ రిపోర్టును బయట పెట్టమని ప్రతిపక్షంగా తాము కూటమి ప్రభుత్వాన్ని అడిగామని, అయితే దీనికి అధికార పక్షం సరిగా స్పందించకుండా ప్రతిపక్ష, వైసీపీ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సభలో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదన్నారు. ప్రత్యేకించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రస్తావించడాన్ని తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, తమ మీద, తమ నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. డిజిటల్‌ కరెన్సీ అనేది మ్యాండేట్‌ కాదని, కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న లిక్కర్‌ సేల్స్‌ డిజిటల్‌ కరెన్నీలోనే సాగుతున్నాయా? అని ప్రశ్నించారు.
Next Story