సాక్షి అబద్దాలు ఎప్పుడు చెప్ప లేదా?
x

సాక్షి అబద్దాలు ఎప్పుడు చెప్ప లేదా?

సాక్షి అబద్దాలు చెప్పదని వైఎస్‌ భారతిరెడ్డి చెప్పారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో చెప్పినవన్నీ అబద్దాలే అని అంటున్నారు షర్మిల. ఇదే ప్రశ్న పాఠకుల్లోనూ ఉంది.


సాక్షి మీడియా అబద్దాలు ఎప్పుడూ చెప్ప లేదని సాక్షి గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి ఒక యూటూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తప్పు రాయదంటే ఆధారాలు లేకుండా రాయదని అర్థం. గాసిప్‌లు అసలే రాయకూడదు. ఒకరిని కించపరిచే విధంగా రాయడం కూడా పెద్ద నేరమే. ఆధారాలతో ఏమి రాసినా ఆ మీడియా సంస్థకు క్రెడిబులిటీ మరింత పెరుగుతుంది. ప్రజలు కూడా పత్రికపై నమ్మకాన్ని పెంచుకుంటారు. ఒకటికి రెండు సార్లు చదివేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు కొన్ని పత్రికలకు కానీ, ఎలక్ట్రానిక్‌ మిడియాకు కానీ ఆ ఎథిక్స్‌ ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమేనని చెప్పాల్సి వస్తోంది.

వన్‌వేలో వెల్లడం తప్పుకాదా?
సాక్షి పత్రిక, సాక్షి టీవీ స్థాపించిన మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ కోసం రాయడం మొదలు పెట్టింది. ఆ తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రాయడం మొదలు పెట్టింది. నాడు వైఎస్సార్‌ ప్రభుత్వానికి, నేడు జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తుందే తప్ప మిగిలిన పార్టీల వారి మాటలను ఎప్పుడైనా పరిగణలోకి తీసుకుందా? అంటే లేదనే సమాధానం వస్తోంది. సాక్షిలో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. కేవలం వ్యాపారులు, రాజకీయ నాయకుల పెట్టబడులతో వచ్చింది సాక్షి. అయితే ఇప్పుడు వారు ఎక్కడుతున్నారు. వారికి ఈ సంస్థపై హక్కులు ఉన్నాయా? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రాదు. పెట్టబడి పెట్టిన వారు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ మా భాగస్వామ్యం కూడా సాక్షిలో ఉందయ్యా.. అంటుంటారు. సొంత ప్రయోజనాల కోసం స్థాపించిన సాక్షి నిస్వార్థంగా ఎలా రాస్తుందని చెప్పగలుగుతున్నారు? ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల అభ్యర్థుల వివరాలు ఫొటోలతో సహా ప్రచురించారా? కేవలం వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన అభ్యర్థుల వివరాలు, వారి ఫొటోలతో మాత్రమే ప్రచురించారు. ఇది తప్పు కాదా? పత్రిక, ఛానల్‌ అన్న తరువాత అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అలా ఎప్పుడైనా ఈ పదేళ్లలో సాగిందా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా వన్‌వేలోనే అడుగులు వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి వార్తలు, కథనాలు కావాలంటే ఈనాడు పత్రిక లేదా ఈటీవీ ఛానల్‌లో చూడాలి. వైఎస్సార్‌సీపీ వార్తలు, కథనాలు కావాలంటే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌ చూడాలి. ఇలా ఎవరికి వారు విడిపోయి వార్తలు ప్రచురిస్తూ మేము తప్పు రాయమని ఎవరికి వారు ప్రకటించుకుంటే సరిపోతుందా? పాఠకులు చెప్పాలి. నిష్పక్షపాతంగా పలానా పత్రిక, చానల్‌ వార్తలు, కథనాలు అందిస్తోందని. అంతే కాని ఎవరికి వారు మేము తప్పు చేయమని చెప్పుకోవడాన్ని ఎవరూ హర్షించరు.
నాకు సాక్షి పత్రికలో వాటా ఉంది. జగన్‌కు సాక్షిపై ఎన్ని హక్కులున్నాయో అన్నీ హక్కులూ నాకు సాక్షిపై ఉన్నాయి. అయినా నాపై సాక్షిలో దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ బతికుండగా నీకు కూడా సాక్షిలో వాటా ఉందమ్మా అని చెప్పారు. చెల్లినని కూడా చూడకుండా దుర్మార్గంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చెబుతున్నారు. ఆమె మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా ఇందులో కూడా వాస్తవం ఉందని చెప్పాల్సిందే.
ఇక వైఎస్‌ వివేకానందరెడ్డి మరణాన్ని తీసుకుందాం. గుండెపోటుతో మరణించారని రాతలు రాసింది సాక్షి, సాక్షి టీవీలో మొదటిగా స్క్రోలింగ్‌లు కూడా వచ్చాయి. గుండెపోటుతో మృతి చెందారని. ఎందుకు అంత నిర్లజ్జగా తప్పుడు రాతలు రాశారు. తెలియకుంటే తెలియనట్లు ఉండాలి. వాస్తవాలు తెలిసి తప్పనిపించినా హత్యను సాధారణ మరణంగా చెప్పేందుకు ఎందుకంత తాపత్రయ పడాల్సి వచ్చిందనేది ప్రజల ప్రశ్న. పోలీసులు దూకుడుగా దర్యాప్తు ప్రారంభిస్తే దానికి ప్రభుత్వం కళ్లెం వేస్తూ వచ్చింది. మళ్లీ ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరింది. తర్వాత సీబీఐ విచారణ వద్దని కోర్టుకు చెప్పింది. ఇవన్నీ తప్పులని సీబీఐ విచారణలో తేలింది. గొడ్డలి వేట్లకు బలైన వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులు, హంతకులను ప్రోత్సహించిన వారు, హంతకుల గురించి పరిశోధనాత్మక కథనాలు ఎందుకు సాక్షి రాయలేకపోయిందనేది పలువురి వాదన. ఇది సాక్షి చేసిన తప్పుల కిందకు రావా అనేది ప్రజల ప్రశ్న. దీనిని సాక్షి చైర్మన్‌గా భారతి రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్‌సీపీలోని నాయకులు చేసిన తప్పులు ఎత్తిచూపుతూ ఒక్క ఆర్టికల్‌ అయినా వచ్చింది. ప్రజా సమస్యలపై ఒక్క కథనమైనా రాశారా? అంటే రాష్ట్రంలో ప్రజలకు సమస్యలు ఏమీ లేవా? సాక్షి దృష్టిలో రాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉన్నట్లు భావిస్తున్నారా?. మిగిలిన పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవాలనుకుంటున్నారా? చేసింది చెప్పుకోవడంలో తప్పులేదు. అయితే ప్రజా సమస్యలను కూడా పత్రిక, టీవీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీడియపైనే ఉంటుందనే విషయాన్ని భారతిరెడ్డి మరిచినట్లున్నారు.
చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే.. సాక్షి అబద్దాలు ఎప్పుడూ చెప్పదనే మాటను ఉపసంహరించుకుంటే మంచిది. లేదా ఆ మాట అనాల్సిన అవసం లేదు. ప్రజలకు ఏది కావాలో దానిని మా సంస్థ అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారో అదే ప్రజలు కోరుకుంటున్నారని మీరు భావించి ఉండొచ్చు. అందుకే అలా చెప్పొచ్చు. అంతే కాని కళ్ల ముందు కనిపిస్తున్న తప్పులను చూస్తూ కూడా రాయకుండా అబద్దాలు రాయదని చెప్పడం ఎవరికైనా కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది.


Read More
Next Story