హంగామా.. ఆర్భాటాలు తప్ప ఆచరణలో ఉచిత గ్యాస్ పథకం అమలు సరిగా లేదు. కారణాలు ఎన్ని చెప్పినా ప్రజలు వినేందుకు సిద్ధంగా లేరు.


ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ పథకం అమలు తీరుపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ లు బుక్ చేసుకున్న వారిలో చాలా మందికి ఇంకా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడలేదు. గ్యాస్ డెలివరీ జరిగిన 48 గంటల్లో సబ్సిడీ మొత్తం బ్యాంక్ అకౌంట్ లో పడతాయని ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లు జరగటం లేదు. ఉచిత గ్యాస్ పథకానికి ఎంత మంది అర్హులు ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 1.54 కోట్ల గ్యాస్ కనెక్షన్ లు రాష్ట్రంలో ఉంటే రేషన్ కార్డులు ఉన్న వారు 1.48 కోట్లు ఉన్నారు. వీరందరికీ ఉచిత గ్యాస్ శాంక్షన్ అయిందనే మెసేజ్ లు రాలేదు. దీంతో ఎంత మందికి ఉచిత గ్యాస్ ఇస్తారో, ఎంత మంది అనర్హులుగా మిగులుతారో అర్థం కావడం లేదని చాలా మంది పేదలు అంటున్నారు.

ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కు మీరు ఎంపికయ్యారని చాలా మందికి ఫోన్ లో మెసేజ్ లు వచ్చాయి. ఇటీవల చాలా మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు మాత్రం అకౌంట్ లో పడలేదు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుంచి అందిస్తున్న గ్యాస్ సిలెండర్ల దీపం 2 పథకంలో నమోదు కాబడి నందున 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతా నందు జమ అవుతుందని తెలియజేస్తున్నాం.’ అంటూ అక్టోబరు 29న చాలా మందికి మెసేజ్ లు వచ్చాయి. డి రాజగోపాల్ అనే వ్యక్తి ఈనెల 4న గ్యాస్ సిలెండర్ డెలివరీ తీసుకున్నారు. ఇవ్వాల్టికి 5 రోజులైంది. ఇంత వరకు ఆయన అకౌంట్ లో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడలేదు. ఆయన విజయవాడ పడమట లంకలో నివాసం ఉంటున్నారు. పడమటలోని హెచ్ పి గ్యాస్ డెలివరీ ఇచ్చిన గ్యాస్ వారిని అడిగితే మార్చి వరకు టైం ఉంది కదా సార్, ఈలోపు ఎప్పుడైనా అకౌంట్ లో పడొచ్చని సెలవిచ్చారు. గ్యాస్ డెలివరీ తీసుకున్న రాజగోపాల్ క్యాష్ మెమో నంబరు 1313900 గా ఉంది. కేవైసీ చేయించుకోవాలని చెబితే గ్యాస్ డీలర్ వద్దకు వెళ్లి కేవైసీ కూడా పూర్తి చేసుకున్నారు. అయినా ఉచిత గ్యాస్ అనేది గ్యాస్ గానే మిగిలిపోతుందా? అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి.

పథకం ప్రారంభించే ముందు గ్యాస్ కంపెనీల వారికి ముందుగానే డబ్బలు కూడా ఇచ్చామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఎందుకు ఆలస్యం అవుతున్నాయనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. గ్యాస్ కంపెనీల వారికి ఇస్తామని చెప్పిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందనే అనుమానాలు పలువురిలో వస్తున్నాయి. గ్యాస్ కంపెనీల వారు డబ్బులు తీసుకుని లబ్ధిదారుల అకౌంట్లలో వెయ్యక పోతే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనేది కూడా చర్చగా మారింది. విజయవాడ నగరంలోని చాలా మంది ఉచిత గ్యాస్ పథకం వినియోగ దారుల పరిస్థితి ఇలాగే ఉంది.

Next Story