మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోరాట బాట పడతారా? వేరే ఏదైనా ప్రణాళిక ఉందా? ఇంతకూ ఆయన వ్యూహం రానున్న ఐదేళ్లలో ఎలా ఉంటుందో?


నూతన ప్రభుత్వం ఏర్పడి పది నెలలైంది. ప్రజలతో మమేకమై పనిచేసే కార్యక్రమం ఒక్కటి కూడా వైఎస్సార్ సీపీ చేపట్టలేదు. విజయసాయిరెడ్డి పార్టీ వీడిన తరువాత కోటరీల గురించి మొదటి సారి మాట్లాడారు. ఆ కోటరీల చెప్పుడు మాటలు జగన్ వినటం వల్లే వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్ కు దూరమైనట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితులు పార్టీలో ఎందుకు వచ్చాయి? కోటరీ చెప్పుడు మాటలు జగన్ నిజంగా వింటున్నరా? అసలు వైఎస్ జగన్ కార్యాచరణ ఏమిటి? పార్టీలోని ముఖ్యులతో ఎవరితోనైనా పార్టీ కార్యాచరణ గురించి చర్చించారా? అధికార పక్షం పెడుతున్న ఇబ్బందుల నుంచి తప్పించుకొనేందుకే కాలం గడుపుతున్నరా? ఇదీ ప్రస్తుతం ఆంధ్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ.

కనిపించని ఓదార్పు యాత్ర నాటి ఓర్పు

తండ్రి వైఎస్సార్ మరణం తరువాత మొదటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఓదార్పు యాత్ర’ పేరుతో ప్రజల మధ్యకు వచ్చారు. ఆ తరువాత కొంతకాలం జైత్ర యాత్రలా ఓదార్పు కొనసాగింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేకనా మరణించిన కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి వారిని ఓదార్చి, వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం కూడా అందించారు. చుట్టూ జనం మధ్యలో జగన్ ఉంటూ వచ్చారు. వారు బాధలు విన్నారు. తండ్రి నుంచి ఆ కుటుంబాలు పొందిన సాయం గురించి కూడా విన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాలను ప్రతి గ్రామంలోనూ ఆవిష్కరించారు. ఒక్కో గ్రామంలో ఒకటికి రెండు చోట్ల కూడా విగ్రహావిష్కరణలు జరిగాయి. దేశంలో ఏ నాయకుడికి కూడా ఈ స్థాయిలో విగ్రహాలు పెట్టిన సందర్భం లేదు. అలా నిత్యం జగన్ ఓదార్పు యాత్రలో జనం మధ్యనే ఉన్నారు.

ప్రజా సంకల్ప యాత్రలోనూ అంతే...

నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన తరువాత ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి ఊరూరా ప్రజల వద్దకు వెళ్లారు. రోడ్ల వెంట ఎంతో మంది ప్రజలు ఆయనకు స్వాగతాలు పలికారు. పూలు జల్లి ఆహ్వానించారు. ఆ యాత్ర కూడా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా చెప్పొచ్చు. యాత్ర సమయంలో పార్టీలో చేరాలని భావించిన వారంతా చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజలు మాత్రం జగన్ ను అభిమానిస్తూనే వచ్చారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించారు. ఆయన ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టినా ప్రజలు గెలిపించారు.

సీఎం అయ్యాక...

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చే వారి నుంచి అర్జీలు తీసుకునేందుకు ఒక షెడ్డు ఏర్పాటు చేసినా రాను రాను అక్కడ అర్జీలు అధికారులు తీసుకున్నారు. సీఎం మాత్రం తీసుకోలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లే టప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడైనా అక్కడి వచ్చిన ప్రజలకు కనిపిస్తారని భావించారు. అది కూడా జరగలేదు. పథకాల అమలు తీరు గురించి ప్రజల వద్దకు వస్తారని అందరూ భావించారు. కానీ జరగలేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన సందర్భాల్లోనూ పోలీసులు వలయంగా ఏర్పడి ప్రజలను దగ్గరకు రాకుండా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జగన్ ను కలిసేందుకు సకాలంలో అపాయింట్ మెంట్ లభించేది కాని పార్టీలోని వారే చెప్పేవారు.

ఎందుకు ఇంతటి మార్పు

నిత్యం ప్రజల మధ్య తిరిగిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకు వచ్చిందనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. జగన్ ప్రాణాకు ముప్పు ఉందని పోలీసులు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రజల మధ్యకు జగన్ రాలేక పోయారనే వాదన ఉంది. అయినా జగన్ ప్రజల మధ్యకు రావాలనుకుంటే అది అడ్డంకి కాదని చెప్పొచ్చు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం చేశారు. కానీ అభివృద్ధి పనులు చేయించే విషయంలో కాస్త వెనుకబడ్డారు.

పార్టీ ఓటమి తరువాత..

2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం కల్పోయింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం చేపట్టి పది నెలలైంది. పది నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు హజరై తరువాత వెళ్లలేదు. మాకు మాట్లాడే అవకాశం అధికార పక్షం ఇవ్వదని భావించి తాము అసెంబ్లీకి వెళ్లటం లేదని చెప్పారు. సీట్లు రాకపోయినా తెలుగుదేశం పార్టీ తరువాత అత్యధికంగా ఓట్లు సంపాదించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. కనీసం తమ పార్టీకి ఓట్లు వేసిన వారిని సంతృప్తి పరిచేందుకు కూడా జగన్ ప్రయత్నించలేదనే విమర్శలు ఉన్నాయి.

చెప్పటం తప్ప.. చెప్పేది వినటం లేదనే చర్చ...

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. అందులోకి సామాన్యం జనం వెళ్లే అవకాశం నేటికీ లేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లాలన్నా ప్రజలు పోలీసుల అనుమతులు తీసుకోవాలి. పోలీసులకు ఎవరో ఒక నాయకుడు చెప్పాలి. ఏ నాయకుడిని సంప్రదించి పార్టీ ఆఫీసులో ఎంట్రీ సంపాదించాలో ప్రజలకు తెలిసే అవకాశాలు లేకుండా పోయాయి. అప్పుడప్పుడూ జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి తను చెప్పదలుచుకున్నది చెప్పి పంపిస్తున్నారు. సమీక్ష పేరుకు మాత్రమే ఉంటుంది. నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం కానీ, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నాలు కానీ ఈ సమావేశాల్లో జరగలేదు. ఇదంతా ప్లీనరీ సమావేశాల్లో మాత్రమే చర్చిస్తారేమోననే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

సాదాసీదాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు

వైఎస్సార్ సీపీ ఆవిర్బావ దినోత్సవాలు అట్టహాసంగా జరిగిన సందర్భాలు లేవు. మార్చి 12న ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు సాదాసీదాగానే జరిపాయి. పార్టీ నుంచి కూడా ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సందర్భాలు లేవు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి వైఎస్సార్ సీపీ అడుగు పెట్టింది.

తిరుగు బాట్లు..

వైఎస్సార్సీపీలో తిరుగుబాట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయిరెడ్డి పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. నాపై పార్టీ అధినేతకు విశ్వాసం లేనప్పుడు నేను ఆ పార్టీలో ఉండటం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. పైగా జగన్ మోహన్ చుట్టూ ద్వితీయ శ్రేణి కోటరీ ఏర్పడిందని, ఆ కోటరీని దాటి ఆయన బయటకు రావటం లేదని, వారు చెప్పే చాడీలు వింటున్నారని, అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పి సంచలనం సృష్టించారు. జగన్ చెల్లెలు షర్మిల కూడా అన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

పార్టీ క్యాడర్ ను ఎలా కాపాడు కుంటారు...

జగన్ కార్యాచరణ ఏమిటి? పార్టీ క్యాడర్ ను ఎలా కాపాడుకుంటారనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ షోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే వందల మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ లు చేశారు. సోషల్ మీడియానే కాకుండా తెలుగుదేశం, మిత్ర పక్షాలపై గతంలో దుర్బాసలాడారని, అటువంటి వారిని వదిలేది లేదని అంటూ పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్ట లు చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్ సీపీ క్యాడర్ రానురాను చల్లా చెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ వారు భావిస్తున్నారు.

ఉగాది నుంచిైనా వైఎస్సార్ సీపీ సమావేశాలు జిల్లాల వారీగా ఉంటాయా?

ఈ సంవత్సరం జనవరి నుంచే వైఎస్సార్ సీపీ జిల్లాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ అవేమీ జరగలేదు. సంక్రాంతి నుంచి అన్నారు. ఇప్పుడు ఉగాది నుంచి అంటున్నారు. ఉగాది నుంచిైనా పార్టీ సమావేశాలు జరుపుతుందా? లోటు పాట్లు గుర్తిస్తుందా.. లేదా? అనే సందేహాలు పలువురు వైఎస్సార్సీపీ నాయకుల్లో ఉన్నాయి. జగన్ వైపు నుంచి మాత్రం ఇంతవరకు సరైన ప్రకటన వెలువడలేదు.

Next Story