ఏపీ రెబల్స్ దారెటు?  ఓటు ఉంటుందా, ఊడుతుందా?
x
రెబల్ ఎమ్మెల్యేలు

ఏపీ రెబల్స్ దారెటు? ఓటు ఉంటుందా, ఊడుతుందా?

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల దారి ఎటు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వీళ్ల పదవులు ఉంటాయా, ఊడతాయా?


రాజ్యసభ ఎన్నికల వేళ.. ఏపీలో రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతపై విచారణ చర్చనీయాంశంగా మారింది. తమకు జారీ చేసిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. మరోవైపు.. స్పీకర్‌ ఎదు విచారణకు హాజరైన కొందరు రెబెల్‌ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. కుట్రపూరితంగానే తమకు నోటీసులు జారీచేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు వారు.

ఏపీలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లంచ్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని ప్రకటించిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. మరోవైపు.. మండలి చైర్మన్‌ నోటీసును ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా హైకోర్టులో సవాల్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి టీడీపీలో చేరగా.. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్‌ టీడీపీ నుంచి వైసీపీలో చేరి రెబల్స్‌గా మారారు. ఇక ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య వైసీపీ నుంచి టీడీపీలోకి, వంశీకృష్ణయాదవ్‌ జనసేనలో చేరారు.

ఈ 8 మంది ఎమ్మెల్యేలకు గతంలో రెండుసార్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇద్దరు రెబల్‌ ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతోపాటు, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ స్పీకర్‌ ఎదుట, ఎమ్మెల్సీ వంశీకృష్ణ మండలి చైర్మన్‌ ముందు తమ వాదనలు వినిపించారు. ఇక టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంతోపాటు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్సీ రామచంద్రయ్య విచారణకు హాజరుకాలేదు.

రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ తమపై అనర్హత వేటు వేసిందన్నారు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి. నాలుగు వారాలు గడువు అడిగినా ఇవ్వలేదని.. అయినా చట్టసభలపై గౌరవంతో విచారణకు వచ్చామన్నారు. తమపై వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు అడిగినా.. స్పీకర్‌, అసెంబ్లీ సెక్రటరీలు సమాధానం చెప్పలేదన్నారు. ఓటమి భయంతోనే సీఎం సీఎం జగన్ ఆడిస్తున్న ఆట అంటూ మండిపడ్డారు రెబల్‌ ఎమ్మెల్యేలు.

పేదవాళ్లకు టీడీపీ అన్యాయం చేస్తోందనే ఆ పార్టీని వీడానన్నారు రెబల్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌. తాను టీడీపీకి నమ్మక ద్రోహం చేశాననే వార్త అవాస్తవమని.. పార్టీ తీరువల్లే రాజీనామా చేసినట్లు చెప్పారు. స్పీకర్‌ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్న ఆయన.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని పేర్కొన్నారు.

రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు ఈ వ్యవహారం కోర్టుకు చేరినా.. ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Read More
Next Story