శ్రీకాకుళం మార్పు ఎటువైపు

శ్రీకాకుళం జిల్లా ఓటర్లలో చాలా మార్పు వచ్చింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీని ఏదృష్టితో చూస్తున్నారో చూద్దాం


శ్రీకాకుళం మార్పు ఎటువైపు
x
Srikakulam Town view

శ్రీకాకుళం జిల్లా ఓటర్లలో మార్పు వచ్చింది. గత ఎన్నికల్లో ఔట్‌ట్రేట్‌గా వైఎస్సార్‌సీపీని బలపరిచిన ఓటర్లు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు ఉంటారో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. నేతలు కూడా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్‌సీపీ, టీడీపీలు కసరత్తు చేస్తున్నాయి.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా రెండు నియోజకవర్గాలు వేరే జిల్లాల్లోకి వెళ్లాయి. ఈ రెండు నియోజకవర్గాలు రిజర్వుడు నియోజకవర్గాలు కావడం విశేషం. పాలకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడి నుంచి రెండో సారి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా విశ్వసరాయి కళావతి గెలుపొందారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోకి వెళ్లిది. రెండవది రాజాం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఇక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా కంభాల జోగులు గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో కలిసింది. దీంతో శ్రీకాకులం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలతో ఉంది.
మళ్లీ ధర్మానకే టికెట్‌..
శ్రీకాకుళం జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దర్మాన ప్రసాదరావు గత ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తునాన్నారు. ఈయన నాయత్వంపట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నమ్మకం ఉంది. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాజకీయ జీవితంపై ఒక పుస్తకాన్ని రాసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఇటీవల క్యాంపు కార్యాలయంలో అందించారు. మంచి వాక్చాతుర్యం ఉన్న వారిలో ధర్మాన ఒకరు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
టీడీపీలో పోటాపోటీ..
తెలుగుదేశం పార్టీ నుంచి గుండు లక్ష్మీదేవి, గుండు శంకర్‌రావులు టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నారు. లక్ష్మీదేవికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సపోర్టు ఉంది. అందువల్ల టిక్కెట్‌ లక్ష్మీదేవికి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే గుండు శంకర్‌రావు వర్గం వ్యతిరేకంగా చేసే అవకాశం ఉందని టీడీపీ వారే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరికి టిక్కెట్‌ దక్కినా కలిసి ఎన్నికలను ఎదుర్కొంటే ధర్మాన గెలుపు అంత సులువు కాదనే వాదన కూడా ఉంది.
తమ్మినేనికి ఎదురు గాలి..
ఆముదాల వలస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారామ్‌ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తమ్మినేనికి టిక్కెట్‌ ఇస్తారా? లేదా?అనే సందేహాలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సర్వేల్లో తమ్మినేనికి ఎదురు గాలి వీస్తున్నట్లు రావడంతో టిక్కెట్‌ ఇవ్వకపోవడమే మంచిదనే ఆలోచనలో వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఉంది. పైగా తమ్మినేని భార్య, కుమారుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులను వారే నడిపిస్తున్నారని, ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తమ్మినేనికే సీటు ఇస్తారా? వేరే వారిని ఆలోచిస్తారా వేచి చూడాల్సిందే.
టీడీపీ నుంచి కూన రవికుమార్‌ అభ్యర్థిగా ఉంటారు. తమ్మినేనికి స్వయానా బంధువు కావడం విశేషం. తమ్మినేని సీతారామ్‌కు రవికుమార్‌ బావమరిది. గత ఎన్నికల్లో రవికుమార్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కృష్ణదాస్‌కు ఇంటిపొగ..
నర్సన్నపేట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్‌ ఉన్నారు. గత రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. అయితే తన కుమారుడు కృష్ణచైతన్య, భార్య పద్మప్రియలు నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తున్నారని, వారి వల్ల నియోజకవర్గంలోని ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కృష్ణదాస్‌ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బగ్గు రమణమూర్తికి టిడీపీ టిక్కెట్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయనకు కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.
గొర్లెకు ఎదరు గాలి..
ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు ఎదురుగాలి వీస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కిరణ్‌పై అవినీతి ఆరోపణలుతో అనేకసార్లు వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధిష్టానం కిరణ్‌కుమార్‌ నాయకత్వంపై పునరాలోచన చేస్తున్నది. రానున్న ఎన్నికల్లో కిరణ్‌కు కాకుండా మగ్గి శ్రీనివాసరావు (చిన్నశ్రీను)కు టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థిని మార్పు చేయడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుందా? రాదా? అనేది ఆలోచించాల్సి ఉంది.
రెడ్డి శాంతికి టిక్కెట్‌ నో..
పాతపట్నం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఈమెకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కే అవకాశం లేదని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు చేరువ కాలేకపోయారని పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉండి తెలుగుదేశం పార్టీలో చేరిన కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు పోటీగా మామిడి గోవిందరావు కూడా టీడీపీ టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్‌ దక్కుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీలో వర్గపోరు వైఎస్సార్‌సీపీకి లాభిస్తుందనే ఆలోచనలో వైఎస్సార్‌సీపీ వారు ఉన్నా బలమైన అభ్యర్థి ఉంటే తప్ప వైఎస్సార్‌సీపీ గెలుపు సాధ్యం కాదనే వాదన కూడా ఉంది.
కిడ్నీ సెంటర్‌ ప్రారంభంతో చీదిరికి సానుకూలత..
పలాస నియోజకవర్గం నుంచి మంత్రి చీదిరి అప్పలరాజుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు పనిచేస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలతో మమేకమై ముందుకు సాగటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కావడం వల్ల ఎంతో కొంత నియోజకవర్గ ప్రజలకు పనులు చేసే అవకాశం దక్కింది. పలాస మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీకి అనుకూల నియోజకవర్గమనే వాదన ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కిడ్నీ సెంటర్‌ ప్రారంభించడం అప్పలరాజుకు వరంగా చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థి విషయం ఇంకా ఖరారు కాలేదు.
అచ్చెన్నకు ఎదురు లేదు..
టెక్కలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన టీడీపీ ఏపీ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు. జగన్‌పై నిప్పులు చెరుగుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడుకు అనుకూల పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడుపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. తిరిగి టెక్కలి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
ఇచ్చాపురంలో పోటాపోటీ..
ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ చేతుల్లో ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా దండాళం అశోక్‌ ఉన్నారు. టీడీపీ టిక్కెట్‌ అశోక్‌కు దక్కే అవకాశం ఉంది. రెండు సార్లు వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పిరియా సాయిరాజ్‌కు తిరిగి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇస్తుందా? లేదా అనేది ఆలోచించాల్సి ఉంది. పిరియా సాయిరాజ్‌ భార్య విజయ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అందువల్ల సాయిరాజ్‌కు టిక్కెట్‌ ఇస్తారా? వేరెవరికైనా ఇస్తారా అనే చర్చ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీలకు పోటీ ప్రతిష్టాత్మకంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Next Story