ఎన్టీఆర్, గుంటూరు (అమరావతి ప్రాంతం) జిల్లాల్లోని ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 14 సీట్లలో ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది.


అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతుల ఉద్యమం, ఎన్నికల ఎజెండాలో ముఖ్య భూమిక పోషించిన అమరావతి వ్యవహారంపై ఓటర్లు ఏ విధమైన తీర్పు చెప్పారనేది ప్రస్తుతం అమరావతిలో చర్చగా మారింది. అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ చెబుతుంటే, అమరావతి రైతుల జీవితాల్లో వెలుగు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీయేనని వైఎస్సార్సీపీ వారు అంటున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు పట్టినంతగా అమరావతి రాజధాని విషయం ఓటర్లకు పట్టినట్లు లేదు. సాధారణ ఓటర్లు పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు ఎటువంటి సాయం చేయగలిగిందనే దానికి చెప్పుకునేందుకు ఒక్కటి కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కనిపించలేదు. కేవలం ఆర్థిక సాయం పేదలకు అందించామని మాత్రం చెప్పుకునేందుకు అవకాశం లభించింది.

ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డాయి. జిల్లాల విభజన జరిగిన తరువాత ఎన్టీఆర్ జిల్లా పూర్తి మెట్ట ప్రాంతం వరకు మిగిలింది. డెల్టా ప్రాంతమంతా క్రిష్ణా జిల్లాకు వెళ్లి పోయింది. విజయవాడలో మూడు నియోజకవర్గాలు ఉండగా పడమట ప్రాంతంలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ప్రజలు వ్యాపారాలు, కూలిపనులపై ఆధారపడాల్సిందే. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో చెప్పుకునే పరిశ్రమలు కూడా లేవు. వ్యవసాయమే ప్రధాన జీవనం. అందులోనూ ఈ నాలుగు నియోజకవర్గాల్లో సాగర్ నీరు కూడా ఉండదు. కేవలం బోర్లపై ఆధారపడి జీవించాల్సిందే.

ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలోని నూజివీడును ముందుగా అందరూ రాజధానిగా ఊహించుకున్నారు. కానీ అది జరగలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరుకు మారింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట క్రిష్ణప్రసాద్ వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచే పోటీ చేశారు. విజయవాడ నగరంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి అక్కడి నుంచే వైఎస్సార్సీపీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. విజయవాడ వెస్ట్ నుంచి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. పొత్తులో రెండు సీట్లు బిజెపి, జనసేనకు ఇవ్వగా మిగిలిన 12 సీట్లలో టీడీపీ పోటీలో ఉంది.

విజయవాడలో వెస్ట్ లో ఎవరు గెలుస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. బిజెపితో టీడీపీ పొత్తు పెట్టుకున్నందున సుజనాచౌదరి ఓడిపోతారని, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసీఫ్ గెలుపు సులువవుతుందని వైఎస్సార్సీపీ వారు అంటుంటే ముస్లిమ్ ల మనోభావాలు మాకు తెలిసినంతగా వైఎస్సార్సీపీకి తెలియవని టీడీపీ వారు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములు సునాయాశంగా చెప్పే అవకాశాలు పరిశీలకులకు కూడా కనిపించడం లేదు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమామహేశ్వరావు గెలుపు ఖాయమని పలువురు పరిశీలకులు చెప్పడం విశేషం. ఇక్కడి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో కూడా గెలుపు ఎవరిని వరిస్తుందనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటింగ్ రోజు జరిగిన పరిణామాలు, ఓటర్లు అక్కడక్కడ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వైపు మొగ్గు చూపాయని కొన్ని సర్వే సంస్థల వారు చెబుతున్నారు.

ఇక జగ్గయ్య పేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల శ్రీరామ్ (తాతయ్య) గెలుపు సులువుగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే ఉదయభాను సామినేనికి వ్యతిరేకత కనిపించినా చివర్లో అనుకూలంగా మారిందని పలువురు పరిశీలకులు చెప్పడం విశేషం. మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణప్రసాద్ వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. ఆయనకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది స్థానికుల మాట. సర్నాల తిరుపతిరావును వైఎస్సార్సీపీ కొత్తగా రంగంలోకి దించింది. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు ఎదురు గాలి వీస్తోందని సొంత పార్టీ అయిన వైఎస్సార్సీపీ వారే చెబుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన తంగిరాల సౌమ్యకు అనుకూల వాతావరణం ఉన్నట్లు సమాచారం. తిరువూరు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణనిధిని పక్కన బెట్టి నల్లగట్ల స్వామిదాస్ ను వైఎస్సార్సీపీ పోటీకి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమరావతి దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు పోటీకి దిగారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకే అనుకూల వాతావరణం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఏడు నియోజకవర్గాల్లో నాలుగు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని, రెండు నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒక నియోజక వర్గం నుంచి వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారు చెబుతున్న సమాచారం.

గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా అందులో మూడు తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉందని, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోటీ నువ్వా, నేనా అన్నట్లు ఉన్నందున ఎవరు విజయం సాధిస్తారో చెప్పడం కష్టంగా ఉందని పలువురు పరిశీలకులు చెబుతున్నారు. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్, ఈస్ట్, ప్రత్తిపాడు ఉన్నట్లు పరిశీలకులు చెప్పడం విశేషం. గుంటూరు ఈస్ట్ నుంచి నూరిఫాతిమా షేక్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె తండ్రి ముస్తఫా రెండు సార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై అసంత్రుప్తి ఉన్నదని భావించిన వైఎస్సార్సీపీ కుమార్తెకు సీటు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నసీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. పార్టీలో మంచి పట్టున్న వ్యక్తి. ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంటుందని, ఎవరు గెలిచినా తక్కువ ఓట్ల తేడా మాత్రమే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక గుంటూరు వెస్ట్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రజిని విడదల పోటీలో ఉన్నారు. ఈమె మంత్రి కావడం వల్ల కొంత అనుకూల వాతావరణం ఉన్నట్లు వైఎస్సార్సీపీ వారు భావిస్తున్నారు. అయితే చిలకలూరిపేట నుంచి గుంటూరుకు మార్చడం వల్ల ఒరిగిందేమీ లేదని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి కూడా గట్టి పోటీని ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారనే విషయంలో ఎవరిలోనూ స్పష్టత కనిపించడం లేదు. రజిని డబ్బులు బాగా ఖర్చు చేసింది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది.

తాడికొండ నియోజకవర్గం పూర్తిగా అమరావతి ప్రాంతంలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణకుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీమంత్రి మేకతోటి సుచరిత వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే టాక్ ఉంది. మంగళగిరి నుంచి నారా లోకేష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నియోజకవర్గంలో స్థానికులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావణ్య స్థానికురాలైనప్పటికీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి, భర్త కుటుంబాల వారు రాజకీయ వారసులుగా చెప్పుకున్నప్పటికీ ఆమెను అంతగా ఓటర్లు ఆదరించలేదనే టాక్ నియోజకవర్గంలో ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బి రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న బాలసాని కిరణ్ కుమార్ లు కొత్తగా రంగంలోకి దిగిన వారే కావడం విశేషం. ఇక్కడ గెలుపు ఓటములు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక పొన్నూరు నుంచి టీడీపీ తరపున ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేయగా, వైఎస్సార్సీపీ తరపున అంబటి మురళి రంగంలోకి దిగారు. ధూళిపాళ్ల నరేంద్ర గెలుపు నల్లేరుపై నడకేనని స్థానికులు చెబుతున్నారు. తెనాలి పొత్తులో భాగంగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు. సిట్టింగ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తిరిగి పోటీ చేశారు. నాదెండ్ల మనోహర్ కు ముందు నుంచీ సానుకూల వాతావరణం ఉండగా ఎన్నికల రోజు ఓటరుపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీ వారు వెళ్లికిలా పడ్డట్టైంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

మొత్తం మీద అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎనిమిది సీట్లలో సునాయాసంగా గెలుస్తుందని, వైఎస్సార్సీపీ ఒకచోట గెలుస్తుందని, ఐదు చోట్ల గెలుపు ఓటములు చెప్పగలిగే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెప్పడం విశేషం. తెలుగుదేశం పార్టీకి అభివ్రుద్ధి నినాదం కలిసొచ్చేది కాగా వైఎస్సార్సీపీకి సంక్షేమ నినాదం కలిసి రావడం లేదనేది పరిశీలకుల మాట.

Next Story