ఆంధ్రా ‘ప్రకాశం’ ఏపార్టీది?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాజకీయ సయ్యాటలకు పెట్టింది పేరు. జిల్లాలో రెండు పార్టీలదే హవా. ఎనిమిది నియోకవర్గాలున్న జిల్లాలో సీఎం బంధువులే చక్రం తిప్పుతారు


ఆంధ్రా ‘ప్రకాశం’ ఏపార్టీది?
x
ఒంగోలు గిత్త

ప్రకాశం జిల్లాలో పార్టీల బలాలపై రాజకీయ పరిశీలకులు అంచనాలు మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ పాతకాపులనే రంగంలోకి దించింది. వైఎస్సార్సీపీ అటు ఇటు మార్చినా ఒక్కరు మినహా మిగిలిన వారు ప్రకాశం జిల్లాకు చెందిన వారే. జిల్లా నివాసి కాని వ్యక్తి మేరుగు నాగార్జున ఒక్కరే. అయితే ఇద్దరు మాత్రం రాజకీయాలకు కొత్త కావడం విశేషం.

జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు. మిగిలిన ఐదు నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. రిజర్వుడు నియోజకవర్గాల్లో రెండు స్థానాల నుంచి వైఎస్సార్సీపీ మంత్రులను రంగంలోకి దించింది. ఒక నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలకు కొత్త వ్యక్తిని పార్టీ తీసుకొచ్చింది.

తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పాతవారికే సీట్లు కేటాయించింది. ఒక్కో నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఎవరిబలం ఎంతో తేలిపోతుంది. పైగా టీడీపీ నుంచి పోటీకి దిగుతున్న ఎరిక్సన్ బాబు రెండేళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన వారిలో నలుగురు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే. కొండపి నియోజకవర్గం నుంచి రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచి మూడోసారి సీటు సాధించారు.

ఎర్రగొండపాలెం ఏలేదెవరు?

ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానం. ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న గూడూరి ఎరిక్సన్ బాబు కనిగిరి నియోజకవర్గానికి చెందిన వారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తాటిపర్తి చంద్రశేఖర్ సింగరాయకొండకు చెందిన వారు. ఇద్దరూ నియోజకవర్గానికి కొత్తవారే. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలకు అభ్యర్థులు దొరకలేదు. అంటే భారీస్థాయిలో ఆర్థికంగా స్థితిమంతులు లేరు. అందువల్ల వేరే వారికి అవకాశం ఇచ్చారు.

మొదటి నుంచీ ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు అనుకూలమైనది. ఆ తరువాత వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. తెలుగుదేశం పార్టీ వారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. రిజర్వు సీటు కావడం వల్ల ఇతర కులాలకు చెందిన వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీలో బాగా పట్టున్న నాయకుడు డాక్టర్ మన్నె రవీంద్ర, వైద్యునిగా జనంలో మంచి పేరు సంపాదించారు. ఆయన మాట ఈ నియోజకవర్గంలో చాలా మంది ఓటర్లకు వేదంలా పనిచేస్తుంది. ప్రస్తుతం అభ్యర్థిగా వచ్చిన ఎరిక్ సన్ బాబుకు, డాక్టర్ రవీంద్రకు పొంతన లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

వైఎస్సార్సీపీ చంద్రశేఖర్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్సార్సీపీలో గ్రూపులు లేవు. అంతా కలిసికట్టుగా చంద్రశేఖర్ ను బలపరుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మిగిలిన పార్టీలు నామినల్ గా చెప్పొచ్చు.

కని‘గిరి’ ఎవరిది?

కనిగిరి నియోజకవర్గంలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఐదేళ్లుగా తనవరకు తాను టీడీపీ తరపున పనిచేస్తున్నారు. ఈయన డాక్టర్. నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. ఎలాగైనా గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్ల పెత్తనం ఎక్కువని చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో యాదవ్ ను రంగంలోకి దించి వైఎస్సార్సీపీ గెలిపించుకుంది. తిరిగి ఆయనకే సీటు ఇస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మరో మండలానికి చెందిన యాదవ్ దద్దాల నారాయణను వైఎస్సార్సీపీ రంగంలోకి దించింది. ఆయన నియోజకవర్గంలోని హనుమంతునిపాడు మండలానికి జడ్పీటీసీగా ఉన్నారు. సంపన్నుడిగా ఉండటంతో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగారు. పోటీ హోరాహోరీగా వుంటుందని స్థానికులు చెబుతున్నారు. నారాయణ చట్టసభకు పోటీ చేయడం కొత్తైనా రాజకీయాలకు కొత్తకాకపోవడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ తామే గెలుస్తామనే ధీమాలో వైసీపీ వారు ఉన్నారు. అయితే ప్రజలు మాకు అనుకూలంగా వున్నారని, గెలుపు తమదేననే ధీమాలో టీడీపీ వారు వున్నారు. ఉగ్ర ఉగ్రరూపం చూపిస్తారా? నారాయణుడు తాండవిస్తాడా చూడాల్సిందే.

సంతనూతలపాడులో గెలిచేదెవరు?

సంతనూతలపాడు నుంచి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన విజయ్ అదే నియోజకవర్గంలో తన వర్గాన్ని పోగొట్టుకోకుండా అడుగులు వేస్తున్నారు. స్థానికంగా వుంటూ స్థానికులకు కావాల్సిన సాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యక్తుల పరంగా చూస్తే విజయకుమార్ విన్ కావడం గ్యారెంటీ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరు జిల్లాకు చెందిన వారు. ఈ నియోజకవర్గానికి కొత్తనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ నాగార్జునకు పార్టీ బలమే తన బలమని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబును వేమూరుకు పంపించి ఇక్కడికి నాగార్జునను తీసుకొచ్చారు. కేవలం పార్టీ బలంతోనే గట్టెక్కాల్సి వుంటుంది.

మూడోసారి పోటీలో టీడీపీ అభ్యర్థి

కొండపి నియోజకవర్గంలో మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వైసీపీ తరపున రంగంలోకి దిగగా టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మూడోసారి పోటీ చేయబోతున్నారు. ఈయనకు ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ రావు సహకారం పూర్తి స్థాయిలో వుంది. ఈ నియోజకవర్గంలో దామచర్ల కుటుంబీకులకు మొదటి నుంచీ మంచి బలం వుంది. ఎస్సీ రిజర్వుడు స్థానం అయినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా స్వామికి మద్దతు పలుకుతూ వస్తున్నారు. దీనిని బట్టి చూస్తే సురేశ్ కు గెలుపు నల్లేరు మీద నడక కాదనే విషయం గమనించాల్సి వుంటుంది. సురేశ్ కు ఇక్కడ పార్టీ బలమే ప్రధానం. వ్యక్తిగత ఓటింగ్ ఈయనకు లేదని చెప్పొచ్చు. బాల వీరాంజనేయ స్వామికి మాత్రం వ్యక్తిగత ఓటింగ్ కూడా వుంది.

ఒం‘గోల్’ ఎవరిది?

జిల్లా కేంద్రమైన ఒంగోలులో పోటీ రసవత్తరంగా వుంటుంది. తెలుగుదేశం, వైసీపీలు పోటా పోటీగా రంగంలోకి దిగాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ రావు గెలుపొందారు. ఒంగోలు నగరంలో రోడ్లు ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టారనే పేరు వుంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, వైసీపీ తరపున ఎక్కువ సార్లు గెలిచారు. వైఎస్సార్ హయాంలో, రోశయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పనిచేశారు. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివ్రుద్దిపనులు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే రెండు రోజుల క్రితం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సభ ఏర్పాటు చేసి 21వేల మందికి ఇంటిస్థలం పట్టాలు పంపిణీ చేయించారు. అదే కాకుండా ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా జగన్ ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. ఈ పనులతో కొంత ఊపు వైసీపీకి వచ్చిందని చెప్పొచ్చు. ఒంగోలులో గెలుపు ఓటములు రాజకీయ పరిశీలకులు అంచనాలకు కూడా అందటం లేదు. సర్వేలు కూడా ఇక్కడ సక్రమంగా పనిచేసే అవకాశం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఒంగోలు ఎంపీని కూడా పక్కన బెట్టింది. మాగుంట శ్రీనివాసులురెడ్డికి సీటు ఇవ్వలేదు. కారణాలు చెప్పేందుకు సీఎం అంగీకరించకపోవడంతో అటు మాగుంట, ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిలు దిక్కుతోచని స్థితికి వెళ్లారు. మాగుంట తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం అంతకు మించిన అవకాశం కూడా లేదనే వాదన వుంది. ఒంగోలు రాజకీయాల్లో ఎవరి బలం ఎంతో అంచనా వేయలేని స్థితిలో ఉందని పరిశీలకులు అంటున్నారు.

టీడీపీ మొదటి జాబితాలో గిద్దలూరు, మార్కాపురం మాజీలకు చోటివ్వలేదు

మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డి, గిద్దలూరుకు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులను మార్కాపురానికి మార్చారు. అయినా ఈ రెండు నియోజకవర్గాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయనే భావనలో వారు ఉన్నారు. మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్ రెడ్డిలు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇరువురూ గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఓడిపోయిన వారే. అయితే వీరిద్దరికీ టీడీపీ మొదటి జాబితాలో చోటు దక్కలేదు.

దర్శి నియోజకవర్గం జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నందున టీడీపీ వారు అభ్యర్థిని ప్రకటించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ వారు మాత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన గ్రానైట్ వ్యాపారి. శివప్రసాద్ రెడ్డి తల్లి ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేనల అభ్యర్థి ఎవరనేది ప్రకటించిన తరువాత మత్రమే దర్శి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. డబ్బు బలంతోనే ఎన్నికలు జరుగుతాయనేదే నిజమైతే శివప్రసాద్ రెడ్డి గెలుపు ఖాయమని, లేకుంటే ఓటమి కూడా అలాగే వుంటుందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

Next Story