మద్యం కొనుగోళ్లలో వేల కోట్లు చేతులు మారాయని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ పెద్దలు ఈ పనులు చేశారని, అందుకే వారిని వదిలేది లేదని చెబుతోంది. ఇంతకూ ఎవరు వారు?


వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని, అందులో అప్పటి ప్రభుత్వ పెద్దలే నిందితులని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తం ఉందని, ఆయన ఆదేశాల మేరకే ఈ దోపిడీ జరిగిందనే అనుమానంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ వారు సకాలంలో కేసు విచారణ చేయటం లేదని భావించిన ప్రభుత్వం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నెల రోజులైంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట వాగ్మూలాలు నమోదు చేసే కార్యక్రమం జరుగుతోంది.

సీఐడీని ఎందుకు తప్పించారు...

సీఐడీ నమోదు చేసిన కేసు నీరు గారిందని, అందుకే సిట్ వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. సిట్ అధిపతిగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ను ప్రభుత్వం నియమించింది. ఇందులో మరో ఐపీఎస్ అధికారి ఎల్ సుబ్బరాయుడు, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, ఒంగోలు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, డోన్ డీఎస్పీ పి శ్రీనివాసరావు, సీఐ లు కే శివాజీ, సీహెచ్ నాగశ్రీనివాస్ లు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుత ప్రభుత్వానికి వీర విధేయులనే ప్రచారం ఉంది. సిట్ కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. అంటే వారే కేసు దర్యాప్తు చేసి కోర్టుకు పంపించవచ్చు. అరెస్ట్ లు కూడా వారే స్వయంగా చేసి కోర్టుకు హాజరు పెట్ట వచ్చు. సిట్ కు ఇన్ని అధికారాలు గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు.

కుంభకోణంలో పెద్దలు ఎవరు ఉన్నారు?

మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా టార్గెటెడ్ వ్యక్తులు ఉన్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రభుత్వ టార్గెట్ లో ఉన్నారని చెప్పొచ్చు. అధికారంలోకి కూటమి రాగానే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్దం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా దర్యాప్తు సాగినా పెద్దిరెడ్డి కారకుడని పోలీసులు నిర్థారించలేక పోయారు. చిత్తూరు జిల్లా అడవిలో భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టారని ఆరోపణలు రావడంతో అటవీ భూములు ఎంత ఆక్రమించారో తేల్చాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఒకపక్క దర్యాప్తు జరుగుతుండానే మద్యం కుంభకోణం అంటూ మరో అంశం తెరపైకి వచ్చిది. మద్యం కొనుగోళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని, లావాదేవీలన్నీ వీరు, వీరి బినామీలతోనే జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యసభ మాజీ సభ్యులు వి విజయసాయిరెడ్డి ఇటీవల సీఐడీ పోలీసుల వద్ద కాకినాడ పోర్టు కేసులో వాగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం విషయంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందన్నారు. అప్పటి వరకు ఆ పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా రాజ్ కసిరెడ్డి పనిచేశారు.

కొత్త బ్రాండ్స్ కొనుగోళ్లలోనే అవినీతి

మద్యాన్ని కంపెనీల నుంచి కొనుగోలు చేసే విషయంలోనే అవినీతి జరిగిందని, గత ప్రభుత్వానికి అనుకూలమైన కంపెనీల వారే ఇందులో ప్రధానంగా ఉన్నారని పోలీసులు భావించడంలో తప్పు లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్ర నాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసినందున నిందితులను గుర్తించడం కష్టంగానే ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసినందున ప్రభుత్వ పెద్దల పాత్రే ఉంటుందనే అనుమానాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే బాబు వ్యక్తం చేశారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో దోషులను పట్టుకోవాలంటే బలయ్యేది అధికారులేనన్నారు. ప్రభుత్వ మద్యం డిపోల్లో పనిచేస్తున్న వారే రికార్డెడ్ గా దొరుకు తారు తప్ప ప్రభుత్వ పెద్దలు దొరికే అవకాశం లేదన్నారు.

అధికారులే పాత్ర దారులా?

ఇటీవల విజయవాడ కోర్టులో ఇద్దరు అధికారులు, ఇద్దరు ఉద్యోగులు న్యాయాధికారి ఎదుట వాగ్మూలం ఇచ్చారు. వారిలో అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, రమేశ్ కుమార్ రెడ్డి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూష న్యాయమూర్తికి వాగ్మూలం ఇచ్చిన వారిలో ఉన్నారు. పాలకులు చెప్పినట్లు వీరు పనిచేశారని, నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణల నేపథ్యంలో వీరిని సిట్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట విచారణకు పిలిపించారు. సాధారణంగా సూపర్ వైజర్లు మద్యం ఏ దుకాణానికి ఎంత కావాలనే విషయంలో ఆర్డర్ పెడతారని, అయితే వారి అనుమతులతో సంబంధం లేకుండా గోడౌన్ నుంచి నేరుగా ఏ షాప్ కు ఎంత పంపిస్తున్నారో చెప్పి పంపిచే వారని వీరు తమ వాగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ దుకాణమే కాబట్టి ఇది కావాలి, ఇది వద్దు అనే అవకాశం ఉండదు. ప్రభుత్వ అధికారులు పంపించిన మద్యాన్ని షాపుల్లో ఉద్యోగులు విక్రయించే వారు.

విజయ సాయి రెడ్డి మద్యం కుంభకోణం అంటూ ఎందుకు స్పందించారు?

రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కూడా మద్యం కుంభ కోణంలో ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆయనను కూడా విచారించి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అల్లుడి ద్వారా మద్యం వ్యాపారంలో విజయసాయి పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం అమ్మకాలు జరిగాయని, అందుకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలు కావాల్సి వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పటం విశేషం. ఇక మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ను కూడా మద్యం కుంభ కోణంలో బాధ్యుడిని చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈయన కూడా తనకు అనుకూలురైన వారి నుంచి మద్యం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ని కూడా టార్గెట్ చేసినట్లు తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ముందస్తు బెయిల్ కు మిథున్ రెడ్డి హైకోర్టులో పిటీషన్

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హవాలా కేసులో అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ వైఎస్సార్సీపీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మద్యం కుంభ కోణానికి సంబంధించి జరిగిన లావాదేవీల్లో హవాలా కూడా జరిగిందని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. ఈ కథ నడిపింది మిథున్ రెడ్డిగా ప్రభుత్వం భావిస్తోంది. సిట్ విచారణలో కొన్ని విషయాలు తెలిసాయని, హవాలా నెట్ వర్క్ ద్వారానే మాజీ సీఎం వైఎస్ జగన్ కు మిథున్ రెడ్డి డబ్బు చేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. తనను ఎలాగైనా మద్యం కేసులో అరెస్ట్ చేయాలనే ఆలోచనలో సిట్ పోలీసు అధికారులు ఉన్నారని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు పైనా చర్చ జరుగుతూనే ఉంది. సీఐడీ పోలీసులు 2024 సెప్టెంబరు 23న నమోదు చేసిన కేసులో మిథున్ రెడ్డిని నిందితునిగా పేర్కొన్నారు.

పాత బ్రాండ్స్ కాదని కొత్త బ్రాండ్స్

జగన్ ప్రభుత్వంలో అప్పటి వరకు ఉన్న పాత బ్రాండెడ్ మద్యం కంపెనీల నుంచి కాకుండా కొత్తగా ఏర్పాటైన మద్యం కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఎన్జే, అదాన్, లీలా, ఎన్వీ, బీ9, సోనా, మూనక్ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు గత ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం రూ. 15,843 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపింది. అదాన్ కంపెనీ 2019 డిసెంబరులో ఏర్పాటైంది. గ్రేసన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ 2020లో ఏర్పాటైనట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తం 26 కంపెనీలు కొత్తగా ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ కు రూ. 20,356 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఏడు కంపెనీలకు చెందిన 38 మద్యం బ్రాండ్స్ కు కొత్తగా అనుమతులు ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది.

మద్యం కుంభ కోణానికి సంబంధించి ప్రస్తుత ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా 2024 సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీఐడీ వారు దర్యాప్తును నత్తనడకన సాగిస్తున్నారనే కారణాలు చెప్పి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

Next Story