కూటమిలో టీడీపీ, బిజెపీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాయి. పవన్‌ కల్యాణ్‌ మాత్రం మూడింటిని పెండింగ్‌లో పెట్టి కూర్చున్నారు.


జి విజయ కుమార్


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇదో పెద్ద ప్రశ్న. పొత్తు భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అన్ని నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బిజెపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ పవన్‌ కల్యాణ్‌ 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఆ మూడు నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించడానికి మాత్రం నానా తంటాలు పడుతున్నారు. ఎందుకీ తంటాలు?. ఇప్పటికే నేను చెప్పిందే మీరు వినాలి. చెప్పినట్లు మీరు చేయాలి అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ అల్టిమేటం ప్రకటించారు. అయినా సందిగ్ధంలోనే ఉన్నారు. ఈ సందిగ్ధం నుంచి ఎప్పుడు భయటపడుతారు. ఆ మూడు నియోజక వర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు. ఇది జనసైనికుల్లో ఉన్న ప్రశ్న.

తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల జాబితాను పూర్తి స్థాయిలో శుక్రవారం సాయంత్రం ప్రకటించడం, చిన్నా చితకా సమస్యలుంటే వాటిని సర్ధుబాటు చేసుకోవడం కూడా పూర్తయ్యాయి. బిజెపీలో అలాంటి సమస్యలేమీ తలెత్త లేదు. అభ్యర్థులు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. కానీ జనసేనలో కేవలం ముగ్గురు అభ్యర్థుల ప్రకటన వెలువడక పోవడంతో ఒక వైపు కాపు సామాజిక వర్గం, మరో వైపు ఇతర సామాజిక వర్గాలు ఎవరికి అవకాశం వస్తుందో తెలియక ఎదురు చూస్తున్నాయి.
పాలకొండ అసెంబ్లీ నియోజక వర్గం
పాలకొండ అసెంబ్లీ నియోజ వర్గం ఎస్టీ రిజర్వుడు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోను ఎస్టీలకే సీటివ్వాలి. ఇక్కడ గిర్బాన సత్యబాబు, కోరంగి నాగేశ్వరరావు టికెట్‌ కోసం మొదటి నుంచి ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సత్యబాబు చినమంగళాపురం నివాసి. రిటైర్డ్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ నాగేశ్వరరావు కూడా ఈ సీటుపై కన్నేశారు. అంటే వీరికి సీటు రావాలని కాదు. వారు చెప్పిన వారికి సీటు దక్కించుకోవాలనేదే వారి ధ్యేయం. ఒకరు కోరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌ను తమ నాయకుడిగా ప్రకటించగా మరొకరు నిమ్మల నిబ్బరం అనే వ్యక్తిని ప్రకటించారు. ఇదిలా ఉండగా నిమ్మక జయకృష్ణ, కొడాలి భూదేవీ ఇరువురూ రంగంలోకి దిగి సీటు కోసం ప్రయత్నం చేసుకోవడం విశేషం. వంగర గ్రామంలో మరొక మహిళా టీచర్‌ తేజోవతి కూడా ఈ సీటుకు పోటీ పడ్డారు. పవన్‌ కల్యాణ్‌ వీరందరిపైనా ఐవీఆర్‌ఎస్‌సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జయకృష్ణ, భూదేవీలకు అనుకూల ఫలితాలు వచ్చాయి. వీరిద్దరిలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటిద్దామనే విషయం పవన్‌ కల్యాణ్‌ ఇంకా నిర్థారించుకోలేదు.
విశాఖ సౌత్‌
విశాఖ సౌత్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో చాలా మంది జనసేన నేతలు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. వాళ్లల్లో ప్రధానంగా సిహెచ్‌ వంశీ కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ ఒకరు. వంశీకృష్ణ గతంలో విశాఖ తూర్పు నుంచి 2014లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే వంశీకృష్ణకు టికెట్‌ ఇస్తే బాగుంటుందని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీటుకు ముగ్గురు యాస్పిరెంట్స్‌ ఉన్నారనీ, అయినా వంశీకృష్ణనే ఎందుకు పవన్‌ కల్యాణ్‌ తీసుకొని రావాలనుకుంటున్నారని జనసేన వర్గాల్లో ప్రశ్నలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి వంశీకృష్ణ విశాఖ సౌత్‌లో పవన్‌ కల్యాణ్‌ సూచన మేరకు ప్రచారం ప్రారంభించారు. అయితే అధికారికంగా ఆయన పేరు ప్రకటించ లేదు. వంశీకృష్ణకు ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఉంది. విశాఖ తూర్పు నుంచి విశాఖ సౌత్‌కు మకాం మార్చడంతో విశాఖ సౌత్‌కు చెందిన నేతలు వంశీకృష్ణను వ్యతిరేకిస్తున్నారు. వంశీ వద్దు పవన్‌ ముద్దు అంటూ గతంలో వ్యతిరేకించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గం జనసేన ఇన్‌చార్జ్‌ మూగి శ్రీనివాస్, కార్పొరేటర్‌ మహమ్మద్‌ సాధిక్‌ వర్గాలు వంశీకృష్ణను తీవ్రంగా వ్యతరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీకృష్ణకు సీటును అధికారికంగా ప్రకటిస్తే ఆయనను వ్యతిరేకిస్తున్న వర్గాలను పవన్‌ కల్యాణ్‌ ఎలా కూల్‌ చేస్తారనేది జనసైనికుల్లో ప్రశ్నార్థకంగా మారింది.
మూడోది అవనిగడ్డ
ఇక్కడ టీడీపీ నుంచి అభ్యర్థి రంగంలో ఉంటాడనే ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. జనసేన పార్టీ నుంచే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. పోటీ పడుతున్న వారిలో సిట్టింగ్‌ ఎంపి బాలశౌరీ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్‌ ఉన్నారు. వారితో పవన్‌ కల్యాణ్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి జనసేనను భుజంపై ఎత్తుకొని మోసే వారికి టికెట్‌ ఇస్తారా లేదా చంద్రబాబు చెప్పిన వారికే టికెట్‌ ఇస్తారా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.
Next Story