ఎవరా ఐదుగురు రెడ్లు!  పవన్ ఎందుకామాట అన్నారు?
x
జెండా పోస్టర్

ఎవరా ఐదుగురు రెడ్లు! పవన్ ఎందుకామాట అన్నారు?

ఐదుగురు రెడ్లను రాష్ట్రంపై వదిలారు. వారి ఇష్టానుసారం దోచుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన కొట్టే దెబ్బకు ముక్కలు ముక్కలు అవుతారు.


'ఐదుగురు రెడ్లను రాష్ట్రంపై వదిలారు. వారి ఇష్టానుసారం దోచుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన కొట్టే దెబ్బకు ముక్కలు ముక్కలు అవుతారు. రాష్ట్రంలో ఐదుగురు రెడ్లు దోచుకుంటున్నారు. పంచాయతీలు చేస్తున్నారు. వారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. గురువారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన జెండా సభలో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం లేపాయి. తల్లినీ, చెల్లినీ కూడా ఇబ్బందులపాలు చేస్తున్న సీఎం జగన్‌ ను సైకో అనక ఏమంటారని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు.

సభ ఆద్యంతం వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించింది. తాము ఏమి చేస్తామనేది చంద్రబాబునాయుడుతో పాటు పవన్‌ కళ్యాణ్‌ కూడా వివరించారు. త్వరలోనే ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని వేదికపై చంద్రబాబునాయుడు చెప్పారు.

అవినీతి సెంట్రలైజ్‌డ్‌..

ఎందుకు ఈ ఐదుగురిని అవినీతి పరులుగా పేర్కొన్నారు. ఏమి జరిగింది. నిజంగా అవినీతికి వీరు పాల్పడుతున్నారా? ఈ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాల గురించి మాట్లాడేకంటే అవినీతి సెంట్రలైజ్‌ అయిందనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఏ టెండరు ప్రకటించాలన్నా సీఎంవో వేదికగా బయటకు వస్తోంది. రాష్ట్ర కార్యాలయాల నుంచే టెండర్లు పిలవడం పరిపాటిగా మారింది. కోట్లలో పిలిచే టెండర్లన్నీ సెంట్రలైజ్‌ అయ్యాయని, అందులో పర్సెంటేజీలు తారాస్థాయిలో ఉంటున్నాయనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

జిల్లాల స్థాయిలో ఎందుకు టెండర్లు పిలవడం లేదు..

ఉదాహరణకు విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్‌లు, షూలు, ట్యాబ్‌లు, స్కూళ్లలో బల్లలు, బ్లాక్‌ బోర్డులు, కంప్యూటర్లు వంటివి కొనుగోలు చేసేందుకు సెంట్రలైజ్‌డ్‌ టెండర్లు పిలిచారు. గతంలో కొన్ని గైడ్‌లైన్స్‌ ఇచ్చి వాటిని అధిగమించకుండా ఆయా జిల్లాల వారీగా కలెక్టర్‌లు టెండర్లు పిలిచి జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపిక చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రాజకీయ అవినీతి రాష్ట్ర కేంద్రం స్థాయిలో పెరిగిందని, ఈ ఐదుగురు నేతలు దోపిడీని కొనసాగిస్తున్నారని టీడీపీ, జనసేన కూటమి నిప్పులు చెరుగుతోంది. ప్రధానంగా విశాఖపట్నంలో కొండలు, చెరువులు ఆక్రమించి కొనుగోళ్ల పేరుతో అమ్ముకోవడం, దోచుకోవడం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఇందులో భాగస్వామి కాకుండా ఉంటారా అంటూ స్థానికులు సైతం వ్యాఖ్యానించడం విశేషం.

తూర్పు గోదావరి జిల్లాలో ఒక మంత్రి ఏమి చేశారంటే..

తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంత్రి కాకినాడ పోర్టులో ఒక పంచాయతీ చేసి సుమారు రూ. 50కోట్లు తీసుకొని వస్తుండగా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేరుగా ఆ మంత్రికే ఫోన్‌చేసి మీరు వస్తున్న వరుస మూడో కారులో రూ. 50 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బును నేరుగా తాడేపల్లి పంపిచాలని ఆదేశించినట్లు సమాచారం. ఇది నమ్మశక్యంగా లేదని కొందరంటే పోర్టులో జరిగిన వ్యవహారం చూసిన వారు మాత్రం నిజం కాకుండా ఎలా పోతుందని మాట్లాడుకోవడం విశేషం. జెండా సభలో చేసిన ఆరోపణలు ఊరికే చేసినవి కాదని, తారాస్థాయిలో అవినీతి చోటు చేసుకోవడం వల్లనే చేశారనేది రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

పది రూపాయలు ఇచ్చి వంద గుంజుతున్నాడు..

ఉదయం రూ. 10 ఇస్తాడు, సాయంత్రం రూ. 100లు గుంజుతాడు. ఇది దోపిడీ కాదా? కాదని ఎవరైనా అంటే చర్చించడానికి సిద్ధమంటూ సభలో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించడం కూడా చర్చకు తావివచ్చింది. నిజానికి మద్యం అమ్మకాలు తీసుకుంటే సగానికి పైన ధరలు పెంచారు. గతంలో వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇందులో డిజిటల్‌ ట్రాన్సాక్సన్స్‌ ఎందుకు జరపడం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటే లెక్కలు వారి ఇష్టమొచ్చినట్లు చెప్పుకోవచ్చు. డిజిటల్‌ లావాదేవీలు జరిపితే ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందే. అంటే దోపిడీ కూడా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారనే ఆరోపణలు సైతం రాష్ట్రంలో హల్‌చెల్‌ చేస్తున్నాయి.

బటన్‌ నొక్కుడు ప్రజల సొమ్ము కాదా..

ఇక బటన్‌ నొక్కుడులోనే నొక్కుడుందనే విషయం జనం ఆలస్యంగా తెలుసుకుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ బటన్‌ నొక్కినా రాష్ట్రం ఆర్థికంగా స్థిరపడాల్సి ఉంటుంది. అయితే కేవలం తలసరి ఆదాయం లెక్కలు తీసుకుని రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే సరిపోదనే వాదన ఆర్థిక వేత్తల్లో నుంచి వ్యక్తమవుతోంది. బటన్‌ నొక్కడం అనేది సీఎం అబ్బ సొమ్ము కాదుకదా.. అది ప్రజల సొమ్ము.. ఏ సొమ్మునైనా ఇన్‌కం జనరేషన్‌ ప్రోగ్రామ్స్‌కు వాడితే ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తుంది కానీ అటువంటివేమీ లేకుండా తీసుకొచ్చిన పథకాల వల్ల రాష్ట్రం నష్టపోక తప్పదని మేధావి వర్గం చెబుతోంది. నేషనల్‌ మీడియా కూడా ఇదే చర్చను లేవనెత్తడం విశేషం. రాష్ట్రం మరో శ్రీలంకగా మారే అవకాశం ఉందనే వాదనను కూడా తీసుకుంది.

సూపర్‌ సిక్స్‌ తీసుకొస్తాం..

సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని తీసుకున్నాం. బీసీ, ఎస్సీ డిక్లరేషన్‌లు తీసుకొస్తున్నాం. ఎస్టీలు, మైనార్టీలు, రైతులు గురించి ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నాం. మేము తీసుకునే నిర్ణయాలు జగన్‌కు దిమ్మతిరిగేలా చేస్తాయని నారా చంద్రబాబునాయుడు పభలో అన్నారు. సభలో చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు మాట్లాడుతున్నంతసేపు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. యువతీ యువకులు సభలో ఎక్కువ మంది పాల్గొన్నారు. కోరుకున్న వాళ్లందరికీ సీట్లు ఇవ్వలేకపోతున్నాం. పనిచేసే కార్యకర్తకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చంద్రబాబు సభలో చెప్పడం విశేషం. మనకు ఇగో వద్దు మంచిని ప్రోత్సహిద్దాం. చెడును తుడిచేద్దాం అంటూ బాబు సభలోని వారిని ఉత్తేజపరిచారు.

Read More
Next Story