టీడీపీకి కంచుకోట ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇక్కడ నుంచి ఎవరిని మంత్రి పదవులు వరించనున్నాయి.


ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయి, ఎవరికి ఇతర పదవులు వరిస్తాయనే అంశాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కృష్ణా జిల్లా కంచుకోట. దీంతో స్థానికంగా మంత్రి పదవులు చర్చ జోరందుకుంది. అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి కేరాఫ్‌గా ఉన్నా.. 2019 ఎన్నికల్లో మాత్రం అది చెదిరి పోయింది. టీడీపీని కాదని వైఎస్‌ఆర్‌సీపీ పాగా వేసింది. రెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకోగా తక్కిన స్థానాలన్నీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ తిరిగి తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుంది. అన్నీ స్థానాలను టీడీపీ తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ఎన్ని మంత్రి పదవులు వరిస్తాయనేది రెండు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట నుంచి గెలిచిన శ్రీరామ్‌ తాతయ్య పేరు వినిపిస్తోంది. ఇప్పటి వరకు మూడు సార్లు గెలిచిన శ్రీరామ్‌ తాతయ్య ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్‌ తాతయ్యకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. సామాజిక సమీకరణాల్లో ఈయనకు బెర్త్‌ ఓకే కావచ్చనే చర్చ నడుస్తోంది.
విజయవాడ తూర్పు నుంచి వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్న గద్దె రామ్మోహన్‌ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో ఎంపీగాను పని చేసిన గద్దె జిల్లాలో సౌమ్యుడుగా పేరుంది. అటు లోకేష్, ఇటు చంద్రబాబు వద్ద గద్దెకు మంచి పేరే ఉంది. దీంతో గద్దెకు ఈ సారి పదవి ఖాయమనే టాక్‌ ఉంది.
మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్‌ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన ఆయన ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తన కుటుంబ నేపథ్యం కూడా మంత్రి పదవి రావడానికి కలిసొస్తందనే టాక్‌ కూడా ఉంది.
విజయవాడ సెంట్రల్‌ నుంచి గెలిచిన బొండా ఉమాకు కూడా మంత్రి పదవి దక్కే చాన్స్‌ ఉందనే టాక్‌ ఉంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కాపు కోటా కింద మంత్రి పదవి దక్కే చాన్స్‌ ఉందనే టాక్‌ ఉంది.
కృష్ణా జిల్లా నుంచి మరో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో వెనిగండ్ల రాము పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగినా గుడివాడ నుంచి కొడాలి నాని ఓడించి టీడీపీ జెండాను ఎగుర వేసిన రాముకి బెర్తు దక్కే చాన్స్‌ ఉందనే టాక్‌ ఉంది. నారా లోకేష్‌కు సన్నిహితుడిగా పేరుండటం వల్ల ఆ కోటా కింద రాముని మంత్రి పదవి వరించే చాన్స్‌ ఉందని టాక్‌ ఉంది. పెనమలూరు నుంచి గెలిచిన బోడే ప్రసాద్‌ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు కూడా ప్రముఖంగానే ఉంది. గతంలో మంత్రిగా ఉండటం, బీసీ కోటా కింద ఈ సారి కూడా కొల్లు రవీంద్రకు మంత్రి పదవి ఖాయమనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది.
వీరు కాకుండా మరో మరో ముగ్గురు నేతల పేర్లు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నాయి. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచిన మండలి బుద్ద ప్రసాద్, కైకలూరు నుంచి బిజెపీ అభ్యర్థిగా గెలిచిన కామినేని శ్రీనివాస్, విజయవాడ పశ్చమ నుంచి గెలుపొందిన సుజనా చౌదరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 2014లో కామినేని శ్రీనివాస్‌ మంత్రిగా పని చేయగా మండలి బుద్ద ప్రసాద్‌ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ఇద్దరూ సీనియర్‌ నేతలే. అయితే సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, బొబే ప్రసాద్, వెనిగండ్ల రాము అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ఎవరికి చాన్స్‌ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది. ఇక బొండా ఉమా, మండలి బుద్ద ప్రసాద్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరిలో ఎవరికి ప్లేస్‌ ఉంటుందనేది కూడా చర్చగా మారింది. వీరు కాకుండా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు కూడా వినిపిస్తోంది. దేవినేని ఉమాను ఎమ్మెల్సీగా చేసి, తర్వాత మంత్రిగా తీసుకొనే అవకాశం కూడా ఉందని టాక్‌ నడుస్తోంది.
ఎస్సీ కేటగిరీ కింద తిరువూరు నుంచి తొలిసారి గెలుపొందిన కొలికపూడి శ్రీనివాసలు, నందిగామ నుంచి రెండో సారి గెలుపొందిన తంగిరాల సౌమ్యలలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే టాక్‌ నడుస్తోంది.
Next Story