
హిడ్మా ఫైల్ ఫోటో
మావోయిస్టు హిడ్మాను పట్టించిన ఈ 'ద్రోహులు' ఎవరు?
మావోయిస్టు పార్టీలో లుకలుకలు, ముఠాత్వం, వరుసగా జరుగుతున్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు వంటివే హిడ్మా మరణానికి కారణం అయ్యాయా...
మావోయిస్టు అగ్రనేత మద్వీ హిడ్మా (Madvi Hidma) మృతితో మావోయిస్టుల ఎరివేత దాదాపు పూర్తి కావొచ్చినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నిర్దేశించిన గడువులోకా మావోయిస్టుల ఏరివేత పూర్తి అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ హిడ్మాను ఇంటి దొంగలే పట్టించారన్న వదంతులు షికార్ చేస్తున్నాయి. అత్యంత కీలక మావోయిస్ట్ కమాండర్లలో ఒకరిగా ఉన్న Hidma ఎన్‌కౌంటర్ కి పార్టీలోని ద్రోహులే కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు పార్టీలో లుకలుకలు, ముఠాత్వం, వరుసగా జరుగుతున్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు వంటివే హిడ్మా మరణానికి కారణం అయ్యాయన్నది ఈ వర్గాల ఆవేదన.
Madvi Hidma ను దండకారణ్య–దక్షిణ బస్తర్ జోన్‌లో అత్యంత సమర్ధుడైన మావోయిస్ట్ కమాండర్లలో ఒకరిగా భావించేవారు. మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు కమాండర్లలో హిడ్మా ఒకరు. ఆయన్ను పట్టుకుంటే ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టుల ఉనికిని రూపుమాపినట్టేనన్నది భద్రతా దళాల అంచనా కూడా. ఈ నేపథ్యంలో హిడ్మా మరణం మావోయిస్టులకు పెద్ద దెబ్బ. మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చనిపోవడం, అక్టోబర్‌లో మల్లోజుల వేణుగోపాల్ రావు (ఎలియాస్ భూపతి) లొంగిపోయారు. ఇవి జరిగిన కొద్ది నెలల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
హిడ్మాతో పాటు అతని భార్య రాజే, కొంతమంది అనుచరులు కూడా చనిపోయినట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ అల్లూరి సీతారామ రాజు జిల్లాకు సమీపంలోని సుక్మా అటవీ ప్రాంతంలో జరిగింది.
భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం క్షీణ దశ 2021లోనే ప్రారంభమైంది. CPI (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు మిలింద్ తేల్ తుమ్డే హత్యతో ప్రారంభమైంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన “నక్సల్-ముక్త్ భారత్” లక్ష్యంతో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.
దీంతో కేంద్ర బలగాలు చంపుతాయన్న భయంతోనే కాకుండా, ఇక విప్లవం రాదన్న ఆవేదన, బాధతోనూ వందలాది మంది మావోయిస్టులు ఈ ఆపరేషన్ల మధ్యలో లొంగిపోతున్నారు.
ఛత్తీస్‌గఢ్–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు చేసిన ఈ పెద్ద ఆపరేషన్ కూడా అదే ప్యాటర్న్‌ను కొనసాగించింది.
లొంగిపోయిన నేతల పనేనా?
ఇటీవలి లొంగుబాట్లతో CPI (మావోయిస్ట్)లో నాయకత్వ సంక్షోభం బాగా ముదిరింది. మాజీ జనరల్ సెక్రటరీ బసవరాజ్ కాల్చివేత దీనికి నాందీ పలికింది. తర్వాత అక్టోబర్ 14న మహారాష్ట్ర గడ్చిరోలిలో 60 మందికి పైగా క్యాడర్లతో కలిసి పొలిట్‌బ్యూరో సభ్యుడు భూపతి లొంగిపోవడం విభేదాలను మరింత తీవ్రతరం చేసింది.
భూపతి పార్టీ సిద్ధాంతర్తల్లో ఒకరు. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని, ఆయుధాలను పక్కనబెట్టాలని పిలుపునిచ్చాడు. CPI (మావోయిస్ట్) లోని అంతర్గత కుట్రలు, కుతంత్రాలు బయటపెట్టారు. పార్టీ పట్ల ప్రజాభిమానం తగ్గుతోందని చెబుతూనే తెలంగాణలో కొంతమంది మావోయిస్ట్ నేతల రాజకీయ సంబంధాలను కూడా బయటపెట్టాడు.
భూపతి కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు లొంగిపోయిన వారికి గుణపాఠం తప్పదన్న సంకేతాలు పంపింది. చివరకి ఇలాంటి హెచ్చరికలే హిడ్మా మరణానికి దారి తీసి ఉంటాయన్న వాదనలు బయల్దేరాయి.
హిడ్మా కదలికలను ఎలా ట్రాక్ చేశారు?
హిడ్మాకు అత్యంత సన్నిహితుడైన PLGA బెటాలియన్ నెంబర్ 1 సభ్యుడు ఓయామ్ లఖ్ము అక్టోబర్‌లో లొంగిపోయాడు. అతను విచారణలో హిడ్మా కదలికలను పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన భారీ ఆపరేషన్ నుంచి తప్పించుకుని, దాదాపు 250 మంది నమ్మకస్తులతో కలిసి హిడ్మా తెలంగాణ వైపు వెళ్లినట్టు పోలీసులకు చెప్పాడు.
ఈ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు పెద్దఎత్తున గాలింపు చేపట్టాయి. Hidma తన సన్నిహితులతో సరిహద్దు ప్రాంతంలో తలదాచుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. భద్రతా దళాలు ఊహించినట్టే మారేడుమిల్లి అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున హిడ్మా దళాన్ని గుర్తించాయి. కాల్పులు జరిపాయి. హిడ్మాను, మరో ఐదుగుర్నీ చంపాయనేది ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం.
సుక్మా SP కిరణ్ చవాన్ గతంలో చెప్పిన దాని ప్రకారం హిడ్మా దండకారణ్య–దక్షిణ బస్తర్ జోన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఫీల్డ్ కమాండర్. అటువంటి హిడ్మా మరణం CPI (మావోయిస్ట్)కి భారీ దెబ్బ. PLGA బెటాలియన్ నం.1 మావోయిస్టులకున్న ఆయుధ బలగంలో ప్రధానమైంది. దక్షిణ బస్తర్‌కు చెందిన హిడ్మాపై పలు రాష్ట్రాలన్నీ కలిపి ₹1 కోటి కంటే ఎక్కువ బహుమతిని ప్రకటించాయి.
2010 దంతేవాడ హత్యాకాండ (76 మంది CRPF సిబ్బంది మరణం), 2013 జిరమ్ ఘాటి దాడి (27 మంది, అందులో పలువురు కాంగ్రెస్ నేతలు), 2021 సుక్మా–బీజాపూర్ పేలుడు (22 మంది సిబ్బంది మరణం)— ఈ దాడులకు హిడ్మానే ప్రధాన సూత్రధారి అని ఛత్తీస్‌ఘడ్ పోలీసులు చెప్పారు.
CoBRA కమాండోలు చేసిన నిరంతర ఆపరేషన్లతో మావోయిస్టు నాయకత్వం మనోధైర్యం సడలింది. ఒక్క ఈ ఏడాదిలో (2025లో) ఇప్పటికే 1,300 మందికి పైగా లొంగిపోయిన నేపథ్యంలో Hidma ఎన్ కౌంటర్ మావోయిస్టు తీవ్రవాదానికి తీరని విఘాతం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఇవాళ కూడా చెప్పారు. ఒకప్పుడు 180 జిల్లాలకు పైగా విస్తరించిన మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు 11 జిల్లాలకు పరిమితమైందని చెబుతున్నా అత్యంత ప్రభావిత జిల్లాలు కేవలం మూడేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించడం గమనార్హం.
Next Story

