బోడె ప్రసాద్ ను వెన్నుపోటు పొడిచిందెవరు?

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను టీడీపీలోని నాయకులే వెన్నుపోటు పొడిచారని ఆయన గురువారం ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు.


బోడె ప్రసాద్ ను వెన్నుపోటు పొడిచిందెవరు?
x
బోడె ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే

పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను వెన్నుపోటు పొడిచిందెవరనే దానిపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. తన నియోజకవర్గంలోని వారితో పాటు పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు తనకు టిక్కెట్ రాకుండా చేశారని ఆయన వాపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు మారారనేదానిపై చర్చ మొదలైంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన బోడె ప్రసాద్ 2019లో ఓటమి చెందారు.

అప్పటి నుంచీ టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో ముందు వరుసలోనే ఉన్నారు. అయినా రెండు రోజుల క్రితం బోడె ప్రసాద్ కు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఈ సారి నీకు టిక్కెట్ ఇవ్వడం లేదని పార్టీ స్పష్టం చేసింది. రెండు రోజులుగా మీడియాతో మాట్లాడటం, నియోజకవర్గంలో తిరగటం చేస్తూనే ఉన్నారు. ఎంత మంది నన్ను వెన్నుపోటు పడిచినా నాకేమీ కాదని కార్యకర్తల వద్ద చెబుతున్నాడు. చివరి వరకు వేచి చూస్తానంటున్నారు. తనకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఇంకా ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూనే తనకు సీటు రాకుండా చేసిన వారికి నేను ఎటువంటి అన్యాయం చేయలేదని సన్నిహితుల వద్ద చెబుతున్నారు.

వైఎస్సార్సీపీలోని కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని), వల్లభనేని శంశీ మోహన్ లతో బోడె ప్రసాద్ సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అంశాన్ని దష్టిలో పెట్టుకుని చంద్రబాబు టీడీపీ సీటు ఇవ్వలేదని టీడీపీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీరిద్దరితో బోడె ప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే వంశీతో మాత్రం మూడు సార్లు ఫోన్లో మాట్లాడానని, నానీతో ఐదేళ్లలో ఇంత వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఒక చిన్న అవసరం ఉండి ఆ పనిచేసి పెట్టాల్సిందిగా వంశీని కోరానని, అయితే ఇప్పటికి కూడా ఆ పని శంశీ చేయలేదని ప్రసాద్ స్పష్టం చేశారు.

ఇవే ప్రధాన అడ్డంకులుగా మారి సీటు రాకుండా చేశాయనే ప్రచారం టీడీపీ వర్గాల్లో వుంది. వంశీ భువనేశ్వరిపై నిందలు మోపాడు, అటువంటి వానితో నీ స్నేహం ఇంకా కొనసాగితే ఎలాగనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో నడిచింది. పైగా ఎవరితోనూ సన్నిహితంగా వుండడని, యారగెన్సీ చూపిస్తాడనే ప్రచారం కూడా దీనిపై కూడా బోడె ప్రసాద్ వివరణ ఇచ్చుకోవడం చర్చగా మారింది. నేను ఏదైనా ఒక పనిని చేస్తుంటే నూరు శాతం ఆ పనిలోనే ఉంటాను. అటువంటి సమయంలో మాట్లాడి ఉండకపోవచ్చు. దానిని యారగెన్సీ అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని ఉమా మహేశ్వరరావును టీడీపీ అధిష్టానం దాదాపు ఎంపిక చేసినట్లు సమాచారం. రెండో జాబితాలో దేవినేని ఉమా పేరును టీడీపీ ప్రకటించనుంది. ఉమా మహేశ్వరరావుకు, బోడె ప్రసాద్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బోడె ప్రసాద్ తన క్యాడర్ కు ఉమా మహేశ్వరరావును గెలిపించాలని ప్రచారం చేస్తాడా లేదా? అనే అంశంపై పలు అనుమానాలు ఉన్నాయని టీడీపీ వారు చెబుతున్నారు. ఆ విషయంలో మీడియా వారు ఎన్నిసార్లు అడిగినా ఇంకా నాకు ఆశ వుంది. టిక్కెట్ నాకే ఇస్తారనే నమ్మకం ఉందని మాత్రం చెబుతున్నారు. ఇంతకూ తనను వెన్నుపోటు పొడిచిన నాయకుల పేర్లను మాత్రం బయట పెట్టడం లేదు. నా నియోజకవర్గం వారి నుంచే నాకు ఈ పరిస్థతి వచ్చిందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. ఇక వారు ఎవరనేది పార్టీ క్యాడర్ నిర్ణయిస్తుంది.

Next Story