కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి. చంద్రబాబు ఎవరి పేర్లు ప్రస్తావిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.


ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో మంత్రి పదవులు అనుకున్న స్థాయిలో దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది ఎంపీలు గెలిచినా వారిలో బిజెపి, జనసేన వారు ఉన్నారు. జనసేన వారు కూడా బిజెపిని బలపరుస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధాని పక్కనే కూర్చోబెట్టుకుని ముందుకు సాగారు.

తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్రంలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయనేది పెద్ద చర్చగా మారింది. చంద్రబాబునాయుడు గురువారం పార్టీ ఎంపీలను పిలిపించి మాట్లాడారు. భవిష్యత్ లో మారిన చంద్రబాబును చూస్తారని, కష్టపడి పని చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమకు పదవులు కావాలనే వారు కూడా నోరు మెదపలేదు. దీనిని బట్టి చంద్రబాబు ఎవరిపేరు చెబితే వారే కేంద్ర క్యాబినెట్లో కూర్చొనే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బాపట్ల నుంచి ఎంపీ తెన్నీటి కష్ణ ప్రసాద్, (ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం) నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు (ఎస్సీ రిజర్వుడు) అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ లిద్దరిలో ఒకరికి గాయరెంటీ అనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఒకరు ఐపీఎస్ అధికారి కాగా, మరొకరు ఐఆర్ఎస్ అధికారి కావడం విశేషం. పార్టీ కోసం పనిచేసిన వారిలో వీరు ముఖ్యులైనందున వారికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి కుటుంబానికి మంచి ఆదరణ ఉండటం వల్ల ఆయనకు రెడ్డి సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. వరుసగా మూడో సారి ఎంపీగా గెలుపొందారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆయనకు ప్రజల నుంచి మద్దతు ఉంది. పార్టీ తరపున ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంలో ముందున్నారే వాదన ఉంది. పైగా చిన్నాన్నతో పాటు పలువురు నాయకులు శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడుకు బంధువులు కూడా ఉన్నారు. ఇవన్నీ కలిపితే రామ్మోహన్ నాయుడుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

శుక్రవారం సాయంత్రం జరిగే మంత్రి వర్గ ఎంపికలో చంద్రబాబు కూడా పాల్గొంటారని, అందువల్ల తమ గళం గట్టిగానే వినిపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీల్లో కొత్తవారు ఉన్నప్పటికీ ఆ కోటాలో వేమిరెడ్డికి అవకాశం వెళుతుందనే చర్చ జరుగుతోంది. ఎస్సీ, రెడ్డి, బీసీ వర్గాలకు అవకాశం కల్పించినట్లవుతుందని పలువురు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననే దానిపై ఎక్కువ చర్చ సాగుతోంది. శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్నికల ప్రచారంలో విశ్రాంతిలేకుండా పొల్గొన్నారని, మూడు సభలు, ఒక ర్యాలీలో పాల్గొనడం ద్వారా ముందుకు సాగారన్నారు. విజనరీ నాయకుడైనందున అభివ్రుద్ధిలో ముందడుగు వేశారని, భారత్ అభివ్రుద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.

Next Story