ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తరపున మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం ఉత్కంఠగా మారింది. కొత్త, పాతల కలయికగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.


చంద్రబాబు మంత్రి వర్గంలో ఎవరెవరు మంత్రులుగా ఉంటారనే విషయంలో చర్చ మొదలైంది. మిత్ర పక్ష పార్టీలైన జనసేన, బిజెపిలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయి. అసలు వారు మంత్రి మండలిలో చేరుతారా.. చేరరా.. అనే అంశపై కూడా చర్చ కొనసాగుతోంది. కేంద్రంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాతనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 9న ప్రమాణ స్వీకార కార్యక్రమం మందడం గ్రామానికి సమీపంలో జరుగుతుందని పార్టీ వర్గాల వారు చెప్పినా తేదీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలక పాత్ర పోషించిన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీపరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైనా చర్చ సాగుతోంది. అసాధారణ భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకూ పోకుండా మచ్చలేని నాయకుల వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
యువతరానికీ ప్రాధాన్యం
తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీనవర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలోకన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో కడప నుంచి మాధవీరెడ్డి, పుట్టపర్తి నుంచి సింధూరరెడ్డి, పెనుకొండ నుంచి సవిత లాంటి వారు మొదటిసారి పోటీచేసిన గెలుపొందిన మహిళలు ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాలైన శింగనమల నుంచి బండారు శ్రావణిశ్రీ, శింగనమల నుంచి నెలవల విజయశ్రీ, ఎస్టీల్లో రంపచోడవరం నుంచి శిరీషాదేవి, కురుపాం నుంచి జగదీశ్వరి విజయం సాధించారు. బీసీల్లో గుంటూరు పశ్చిమ నుంచి గల్లా మాధవి, తుని నుంచి యనమల దివ్య, పెనుగొండ సవిత వంటి వారున్నారు. వీరిలో వర్గానికి ఒకరికి అవకాశం లభించ వచ్చనే చర్చ మొదలైంది.
వీరందరూ రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులు. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసన సభ్యులుగా గెలిచిన వారికి అవకాశమివ్వాలనుకుంటే.. ఎస్సీ వర్గానికి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు. పార్టీలో అత్యంత సీనియర్‌ నేత అశోకగజపతిరాజు కుమార్తె, విజయనగరం నుంచి గెలుపొందిన అదితి గజపతిరాజుకూ అవకాశం దక్కొచ్చు.
సీనియర్లలో ఎవరికి మంత్రి పదవి దక్కే అవకాశం?
తెదేపాలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్‌విఎస్‌కె రంగారావు, కిమిడి కళా వెంకటరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణంరాజు, కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, శ్రీరాం తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది.
ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్‌ విజయ్‌కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డిల పేర్లు పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్‌ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిల పేర్లు కూడా పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పుచేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో తెదేపా చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశమొస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ఛాన్సు దక్కొచ్చు.
మైనారిటీల నుంచి నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్, గుంటూరు తూర్పు నుంచి నసీర్, మదనపల్లి నుంచి షాజహాన్‌ బాషాలు ఉన్నారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే అభ్యర్థులు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో వీరిలో ఒకరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
పవన్‌ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా?
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రితో పాటు హోం శాఖ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని జనసేన పార్టీ భావిస్తోంది. జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్ఠంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్‌ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలినవాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బిజెపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచారు. సీనియర్‌ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. జనసేన, భాజపాల నుంచి ఏ జిల్లాలో, ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్నిబట్టి తెదేపా ఎమ్మెల్యేల అవకాశాలూ ప్రభావితమవుతాయి.
Next Story