ఏపీ సీఎంఓ టీమ్‌లోకి రాజమౌళి.. పక్కా ప్లాన్‌గా వెళ్తున్న చంద్రబాబు
x

ఏపీ సీఎంఓ టీమ్‌లోకి రాజమౌళి.. పక్కా ప్లాన్‌గా వెళ్తున్న చంద్రబాబు

చంద్రబాబు టీమ్‌లోకి యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి. అసలు ఆయన ఎవరు? గతంలో ఎక్కడ పనిచేశారు? చంద్రబాబుకు ఆయనతో అంత సన్నిహిత్యం ఉందా?


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించినప్పటి నుంచి తమదైన మార్క్ ప్రభుత్వాన్ని నడిపించడానికి కూటమి నేతలంతా ప్రయత్నిస్తున్నారు. వీరిలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. ప్రతి నిర్ణయంలో తన మార్క్ చూపుతున్నారు బాబు. మంత్రులు కూడా తమకు అందించిన శాఖల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ తమ మార్క్‌ను చూపుతున్నారు. ఈ క్రమంలో సీఎంఓలోకి తీసుకునే అధికారులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవరిని పడితే వారిని కాకుండా సీఎంలో ఉండాల్సిన అధికారులను చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అదే విధంగా అధికారుల ఎంపిక కూడా చేపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులను ఓకే చేసిన చంద్రబాబు.. తాజాగా మరో అధికారిని కూడా ఓకే చేశారు.

ఇప్పటికే ఓకే చేసిన ముగ్గురు అధికారుల్లో సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రధ్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ టీమ్‌లోకి ఉత్తర‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళి కూడా చేరనున్నారు. అడుసుమిల్లి వీ రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను ఎలాగైనా తిరిగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని చంద్రబాబు కసరత్తులు చేశారు. అందులో భాగంగానే వారిని ఏపీకి పంపాలంటూ కేంద్రానికి కూడా లేఖలు రాశారు. ఆయన కోరికను కేంద్రం అంగీకరించింది.

డిప్యుటేషన్ కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న కార్తికేయ మిశ్రాను ఇప్పటికే ఆ విధులను రిలీవ్ చేశారు. అదే సమయంలో ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు అదే బాటలో ఉత్తర్‌ప్రుదేశ్ క్యాడెర్ అధికారి రాజమౌళి కూడా ఉన్నారు. ఆయనను కూడా విధుల నుంచి రిలీవ్ చేసి ఏపీకి పంపేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అతి త్వరలోనే ఆయన కూడా ఏపీ సీఎం చంద్రబాబు పేషీలో చేరనున్నారు.

ఎవరీ ఏవీ రాజమౌళి

2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళి. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన సమయంలో ఆయన డిప్యుటేషన్‌పై ఇక్కడ పనిచేశారు. అప్పట్లో కూడా సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న ఆయన సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2019లో అధికారం మారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కొన్నాళ్ల పాటు రాజమౌళికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత కరోనా రావడంతో ఆసుపత్రుల సన్నద్ధత చూడటానికి ప్రత్యేక అధికారిగా రాజమౌళిని నియమించింది వైసీపీ సర్కార్. కొద్దిరోజుల తర్వాత ఆయన డిప్యుటేషన్ ముగియడంతో తిరిగి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అక్కడే పని చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇప్పుడు ఇంటర్‌స్టేట్ క్యాడర్ డిప్యుటేషన్‌పై ఆయనను మరోసారి ఏపీకి పంపాలని చంద్రబాబు సర్కార్ డీఓపీటీకి, యూకే సర్కార్‌కి లేఖ రాసింది. దీనికి కేంద్రం కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో అతి త్వరలోనే మరోసారి బాబు అమ్ములపొదిలోకి రాజమౌళి అస్త్రం వచ్చి చేరనుంది.

Read More
Next Story