
హిడ్మా చిత్రం
ఎవరీ మద్వి హిడ్మా, ఎలా దొరికిపోయాడు?
మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మద్వీ హిడ్వాను పోలీసులు ఇవాళ ఎన్కౌంటర్ చేశారు. ఇంతకీ ఎవరీ హిడ్మా..
ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మద్వి హిడ్మా మృతి చెందినట్టు ఏపీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం హిడ్మాతో పాటు ఆయన భార్య, అనుచరులతో కలిపి మొత్తం ఆరుగురు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
ఇంతకీ ఎవరీ హిడ్మా..
హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పర్వతి గ్రామానికి చెందిన స్థానిక మూరియా తెగకు చెందిన వ్యక్తి (Maoist commander Hidma). మావోయిస్టు పార్టీలో పని చేసి వచ్చిన ఓ కార్యకర్త చెప్పిన దాని ప్రకారం హిడ్మా పెద్ద మిలిటరీ ఆర్గనైజరు. అతన్ని చేరుకోవడం పోలీసులకు, భద్రతా దళాలకు కష్టసాధ్యమని భావిస్తున్న దశలో ఆయన్ని, ఆయన సహచరి రాజీ ని ఎన్‌కౌంటర్ చేశారు.
1981లో జన్మించిన హిడ్మా 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 2000 ప్రారంభంలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరి, క్రమంగా అగ్రస్థానానికి ఎదిగాడు. ప్రస్తుతం సీపీఐ (మావోయిస్ట్), పీఎల్‌జీఏ బెటాలియన్–1 కమాండర్‌గా దండకారణ్య ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్, బీజాపూర్, దంతేవాడ ప్రాంతాలు) పనిచేస్తున్నాడు. 2010లో 76 మంది సీర్పీఎఫ్ సిబ్బంది మృతికి కారణమైన దంతేవాడ దాడికి హిడ్మా బాధ్యుడని పోలీసుల ఆరోపణ. 2013 జీరామ్ ఘాటి దాడి వంటి పలు దాడుల్లో ప్రధాన సూత్రధారి హిడ్మా అనే ఆరోపణలూ ఉన్నాయి.
ఈ ఏడాది హిడ్మా సీపీఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) సెక్రటరీగా పదోన్నతి పొందినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. హిడ్మాను పట్టుకోవడం కోసం పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి క్యాష్ రివార్డులు కూడా ప్రకటించారు.
అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్‌వర్క్‌లను ఉపయోగించడంలో హిడ్మా సిద్ధహస్తుడని, అందువల్లే భద్రతా దళాలు చాలా కాలం పట్టుకోలేకపోయాయని విజయవాడలోని ఏపీసీఎల్సీ నాయకుడొకరు చెప్పారు.
2004 నుంచి ఇప్పటివరకు 20కి పైగా ప్రధాన దాడుల్లో హిడ్మా పాల్గొన్నట్లు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వేలాది మంది సిబ్బందితో పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లు కూడా హిడ్మాను పట్టుకోలేకపోయాయి.
సరిగ్గా ఈనేపథ్యంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో హిడ్మా, అతడి అనుచరులు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దాంతో మూడు రోజులుగా ఇక్కడ మకాం వేసిన భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో హిడ్మాతో సహా ఆరుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story

