విజయవాడ టిడిపి ఎంపి అభ్యర్థి ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో విజయవాడ పాలిటిక్స్‌ కాస్త డిఫరెంట్‌. రాష్ట్రంలోనే విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గానికి ప్రత్యేక స్థానం ఉంది.


విజయవాడ టిడిపి ఎంపి అభ్యర్థి ఎవరు?
x
విజయవాడ దుర్గమ్మ ఫ్లై ఓవర్

జి. విజయ కుమార్

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌కు టిడిపి–జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్‌ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ను వైసిపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు–జనసేన కూటమి అభ్యర్థిని ఖరారు చేయక పోవడంతో ఆసక్తి నెలకొంది. సిట్టింగ్‌ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ నానిగా ప్రసిద్ధి. అందరూ ఆయనను నాని అని పిలుస్తుంటారు. ఆయన 2014,2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఇటీవల ఆయన పార్టీ మారారు. ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. నాని టిడిపి నుంచి వైసిపిలోకి చేరడంలో వైసిపి ఎంపి అయోధ్యరామిరెడ్డి కీలక పాత్ర పోషించారని నాని సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
నాని సోదరుడు
ఇటీవల కాలంలో ఎంపి కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్‌(చిన్నీ) తెరపైకి వచ్చారు. అంతకు ముందు తెర వెనుక రాజకీయాలు చేసిన చిన్నీ గత రెండేళ్ల నుంచి టిడిపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన టిడిపి కేడర్‌కు, దగ్గరయ్యే ప్రయత్నాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలు, రాజకీయ కారణాల వల్ల తలెత్తిన గొడవల నేపథ్యంలో సోదరులిద్దరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. టిడిపి తరఫున అతనే ఎంపి అభ్యర్థి అని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన టిడిపి పెద్దలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ను కూడా కలిశారు. నానిని ఎదుర్కొవాలంటే టిడిపి నుంచి చిన్నీనే కరెక్ట్‌ అభ్యర్థి అని, చిన్నీకే సీటు ఖరారు చేస్తారనే టాక్‌ నడుస్తోంది.
చిన్నీకి రాకపోవచ్చు
అయితే చిన్నీకి రాక పోవచ్చని టిపిలోని కొంత మంది నేతలు అభ్రిపాయ పడుతున్నారు. నానిని ఎదుర్కోవాలంటే చిన్నీ కంటే బలమైన నేతను రంగంలోకి దింపాలని టిడిపి, జనసేన పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు. పలుకుబడి పరంగా, డబ్బు పరంగా మంచి స్థాయిలో ఉన్న వారి వైపు చూస్తున్నారు. దీంతో ఎన్‌ఆర్‌ఐల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సుజనా చౌదరి
విజయవాడ ఎంపి అభ్యర్థిగా సుజనా చౌదరిని రంగంలోకి దింపొచ్చనే టాక్‌ నడుస్తోంది. ఆయన మాజీ రాజ్య సభ సభ్యులు. మోడీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పని చేశారు. దీనికి తోడు సుజనా చౌదరి స్థానికుడు కావడం, స్థితిమంతుడు కావడం, ఎనీఆర్‌ జిల్లానే వాసే కావడం తదితర అంశాలు కలిసొస్తాయని భావిస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇది వరకే ఆయన ప్రకటించారు. టిడిపి, జనసేన కూటమితో బిజెపికి పొత్తులు ఖరారైతే సుజనా చౌదరినే రంగంలోకి దింపనున్నారు.
పురందేశ్వరి
మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్‌ కుమార్తె పురందరేశ్వరీ పేరు కూడా వినిపిస్తోంది. బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. విజయవాడ ఎంపి సీటు కోసం ఆమె పట్టు బడుతున్నారు. ఒక వేళ పురందేరేశ్వరి అభ్యర్థి కాని పక్షంలో సుజనా చౌదరిని ఉమ్మడి ఎంపి అభ్యర్థిగా ఖరారు చేసే చాన్స్‌ ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
టిడిపి హవా
ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు పర్యాయాలు టిడిపి విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి విజయం సాదించింది. 11 సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. టిడిపి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే తొలి బోణీ కొట్టింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు టిడిపి జెండాను ఎగుర వేశారు. ఆయనే 1991లోను గెలుపొందారు. తర్వాత గద్దె రామ్మోహన్‌రావు ఎంపిగా గెలిచారు. 2014, 2019లో కేశినేని నాని టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు.
Next Story