శ్రీకాకుళం నుంచి డబుల్ హ్యాట్రిక్ సాధించిందెవరో తెలుసా?
x
Source: Twitter

శ్రీకాకుళం నుంచి డబుల్ హ్యాట్రిక్ సాధించిందెవరో తెలుసా?

శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఎంతో మంది గొప్ప నాయకులు ఇక్కడి నుంచే వచ్చారు. ఆ నియోజకవర్గం చరిత్ర..


ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలలో శ్రీకాకుళం ఒకటి. ఒడిశా, ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన 1952లోని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి. బీసీ పార్లమెంట్ స్థానంగా కొనసాగుతున్న శ్రీకాకుళంలో ఈ ఏడు అసెంబ్లీ సీట్లు కూడా బీసీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.

పోరాటాల్లో పుట్టి పెరిగిన శ్రీకాకుళం పార్లమెంటు సీటుకు బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 1952 నుంచి 1984 వరకు ఈ సీట్ నుంచి తొమ్మిది సార్లు పోటీ చేసిన బొడ్డేపల్లి రాజగోపాల్ రావు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో వీరిలా డబుల్ హ్యాట్రిక్ అంటే రెండు విడతల్లో ఆరుసార్లు వరుసగా విజయం సాధించిన నాయకుడు మరో ఒకరు లేరు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన బోడ్డేపల్లి రాజగోపాలరావు అటు తరువాత ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా, రెండుసార్లు ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీకి దిగారు. శ్రీకాకుళంలోనే మూడుసార్లు పరాజయం పొందారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శాసనసభ స్థానం నుంచి 1991 నాటి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రావు ఓటమి పాలయ్యారు. వీరి కోడలు బొడ్డేపల్లి సత్యవతి ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థినిగా విజయం సాధించారు. ఆమె 1999లో ఓడిపోయారు. 1994లో ఆముదాలవలస నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన బొడ్డేపల్లి చిట్టిబాబు రాజగోపాల్ రావు తనయుడు.


బొడ్డేపల్లి కుటుంబానికి మరో చరిత్ర కూడా ఉంది. వరుస విజయాలతో పాటు వరుస ఓటముల చరిత్ర కూడా ఈ కుటుంబానికి ఉంది. 1991 ఉప ఎన్నికలలో రాజగోపాల్ రావు, 1994 ఎన్నికల్లో చిట్టిబాబు, 1999 ఎన్నికల్లో సత్యవతి ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి 1967లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా సోంపేట శాసనసభ స్థానం నుంచి 1952, 1955 ఎన్నికల్లో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా 1962, 1967లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1972లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 1983లో అభ్యర్థిగా పోటీ చేసిన లచ్చన్న ఓటమిపాలయ్యారు.

సోంపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999, 2004లోనూ 2014లోనూ పలాస నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గౌతు శ్యామసుందర శివాజీ.. లచ్చన్న కుమారుడు. 2019లో పలాస నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన గౌతు శిరీష.. శివాజీ కుమార్తె. ఒకసారి పార్లమెంటుకు, మరోసారి శాసనసభకు పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించిన ఘనత గౌతు లచ్చన్నది. 1967 ఉప ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా సోంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా లచ్చన్న విజయం సాధించారు. శాసనసభ్యుడిగా కొనసాగి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009 నాటికి సోంపేట నియోజకవర్గంలో పలాస నియోజకవర్గంగా కొనసాగుతుంది.

ఎన్జీ రంగా కూడా ఇక్కడి నుంచే...

శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 1967 లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గోగినేని రంగనాయకులు ఎలియాస్ ఎన్జీ రంగా పోటీ చేసి గెలుపొందారు. ఆ చరిత్ర కూడా ఒక్క ఎన్జీ రంగాకే దక్కింది. 1957లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రంగా 1964లో నాటి చిత్తూరు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. గుంటూరు నియోజకవర్గం నుంచి 1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రంగా 1971లో శ్రీకాకుళంలో స్వతంత్ర అభ్యర్థిగా ఓడిపోయారు. అదేవిధంగా 1991లో గుంటూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలయ్యారు.

రామ్మోహననాయుడిదే రికార్డు…

వీళ్లందరి తర్వాత శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసిన వారిలో ఎర్రంనాయుడొకరు. ఇక్కడి నుంచి నాలుగు సార్లు వరుస విజయాలు సాధించిన ఎర్రం నాయుడు, ఒకేసారి గెలిచిన కిల్లి కృపారాణి కేంద్ర మంత్రులుగా పని చేసిన చరిత్ర ఉంది.

శ్రీకాకుళానికి 18 సార్లు ఎన్నికలు జరిగితే 2019లో టిడిపి అభ్యర్థిగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడు ది అత్యధిక మెజారిటీ. 2014లో ఆయన 127692 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గెలుపొందిన కింజారపు రామ్మోహన్ నాయుడు- వరుసగా (1996, 1998, 1999, 2004లో) శ్రీకాకుళం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన కింజారపు ఎర్రన్నాయుడి కుమారుడు.


శ్రీకాకుళం జిల్లాలో 2009 నాటికి రద్దయిన హరిచంద్రపురం శాసనసభ స్థానం నుంచి 1983, 1985లో టిడిపి అభ్యర్థిగా 1989లో స్వతంత్ర అభ్యర్థిగా 1994లో టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. శాసనసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఎర్రన్నాయుడు 1996లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొంది శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1999 వరకు శాసనసభ విప్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో టిడిపి అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ఎర్ర నాయుడు టిడిఎల్పి అభ్యర్థిగా శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన నందమూరి తారక రామారావు తనయుడు జయకృష్ణను ఓడించారు.

1996లో ఎర్రన్నాయుడు హరిచంద్రపురం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్రం నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి 2014, 2019లో టెక్కలి శాసనసభ స్థానం నుంచి అచ్చెన్నాయుడు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన భవాని ఎర్రం నాయుడు కుమార్తె.

జర్నలిస్టుకు కాంగ్రెస్ టికెట్..

ప్రస్తుతం జరుగుతున్న (2024 సార్వత్రిక) ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి ఎర్రన్నాయుడి కుమారుడు, సిట్టింగ్ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్ పోటీకి దిగారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓ జర్నలిస్టు పేడాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. పరమేశ్వరరావు గతంలో వివిధ పత్రికలకు పని చేశారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఓ ఛానల్ కూడా నడుపుతున్నారు. జర్నలిస్టు సంఘం నాయకుడుగా ఉన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పరమేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గానికి మే 13న ఎన్నిక జరుగనుంది.

Read More
Next Story