ఆ ఆక్వా కంపెనీ యజమాని ఎవరు? టీడీపీ, వైసీపీ పెద్దలకు డ్రగ్స్ మురికేంటీ?
x

ఆ ఆక్వా కంపెనీ యజమాని ఎవరు? టీడీపీ, వైసీపీ పెద్దలకు డ్రగ్స్ మురికేంటీ?

ఆంధ్రప్రదేశ్ అంతటా డ్రగ్స్ కంటైనర్ మోత మోగుతోంది. రాజకీయ పార్టీలు ప్రత్యేకించి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎందుకంటే..


ఆంధ్రప్రదేశ్ అంతటా డ్రగ్స్ కంటైనర్ మోత మోగుతోంది. రాజకీయ పార్టీలు ప్రత్యేకించి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నువ్వు దొంగంటే నువ్వు దొంగన్నట్టుగా ఆరోపణలు చేసుకుంటున్నాయి. విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్‌- కొకైన్, హెరాయిన్- కంటైనర్ వెనక ఎవరున్నారు, ఎవరి అండతో అవి విశాఖపట్నం చేరాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కంటైనర్ దొరకడంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇది కచ్చితంగా వైసీపీ నాయకులు, సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు ఈ కంటైనర్ వచ్చిన సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు, పురందేశ్వరి, లోకేశ్, బాలకృష్ణ చుట్టాలదేనంటూ ఆరోపించారు. మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సంధ్య కంపెనీ యజమాని వీరభద్రరావు, సీపీ రవిశంకర్ నాయక్ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదన్నారు.

అసలింతకీ ఈ కంపెనీ కథేమిటంటే..


విశాఖపట్నంలోని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ ఉంది. ఆ కంపెనీకి పామర్రు, విశాఖపట్నం, కాకినాడలో బ్రాంచీలు ఉన్నాయి. ఆ కంపెనీ యజమాని కూనం వీరభద్రరావుది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆయన తండ్రి కోటయ్య చౌదరి. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కూనం కోటయ్య. ఈదుమూడికి చెందిన కూనం కోటయ్య, సుబ్బాయమ్మ దంపతులకు ఆరుగురు పిల్లలు. వీరిలో ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. వీరభద్రరావు, రమణ ఆక్వా వ్యాపారం చేస్తున్నారు. 1998 నుంచి ఆక్వా వ్యాపారంలో ఉన్నారు. 25 ఏళ్లుగా సొంతూరికి దూరంగా ఉంటున్నారు. కాకినాడ, పామర్రు, వైజాగ్‌ ప్రాంతాల్లో ఆక్వా కంపెనీలున్నాయి. మరో కుమారుడు పూర్ణచంద్రరావు స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మొదటి నుంచీ కూనం కోటయ్య కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. ఆయన కుమారుడు పూర్ణచంద్రరావు స్థానికంగా ఉంటూ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో గతంలో సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆయన భార్య కూనం విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా చేశారు. ఆ తర్వాత వీరు వైసీపీలో చేరారు. సంక్రాంతి, దసరా వంటి పండుగల సందర్భంలో సొంతూరికి వచ్చి గ్రామస్థులతో సరదాగా గడిపివెళుతుంటారు.

చాలా కాలం కిందటే ప్రకాశం జిల్లా నుంచి వలస పోయి విశాఖపట్నంలో ఆక్వా వ్యాపారం పెట్టి బాగా స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. ఇండియాలో ఉంటున్న వీరభద్రరావు ఆక్వా వ్యాపారం చేస్తున్నారు. 2005కి ముందు వరకు భాగస్వాములతో కలిసి రొయ్యలు, చేపల వ్యాపారం చేసిన వీరభద్రరావు 2005 తర్వాత సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగంపై 2016లో యూఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

తన సంస్థ అవసరాల కోసం విదేశాల నుంచి ఆక్వా మందుల్ని తెప్పిస్తుంటారు. అందులో డ్రైడ్ ఈస్ట్ ఒకటి. బ్రెజిల్ లో ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందడంతో అక్కడి నుంచి ఆక్వా మందుల కోసం ఆర్డరు చేస్తే ఆ కంటైనర్ లో ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ వచ్చాయి. ఇంటర్ పోల్ ద్వారా ఈ సమాచారంతో అందడంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఈ కంటైనర్ ను పట్టుకున్నారు. బ్రెజిల్ నుంచి ఆర్డర్‌ బుక్‌ చేయడం ఇదే మొదటిసారి అని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. యూరోపియన్‌ దేశాల నుంచి విశాఖకు డ్రైడ్‌ ఈస్ట్‌ దిగుమతి అవుతుంది. రొయ్యల చెరువుల కోసం డ్రైడ్‌ ఈస్ట్‌ ను వాడతారు.

రూ. 50వేల కోట్ల విలువైన డ్రగ్స్..

బ్రెజిల్ నుంచి చైనాకు చెందిన ఓడలో ఈ కంటైనర్ వచ్చింది. వాస్తవానికి ఈ నౌక ఫిబ్రవరి చివరి నాటికే విశాఖ చేరుకోవాలి. అనివార్య కారణాలతో ఎన్నికల కోడ్‌ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరింది. ముందే వచ్చి ఉంటే సీబీఐ పట్టుకున్నా ఇంకెవరైనా ప్రభుత్వ పెద్దల జోక్యంతో దీన్ని కూడా అటకెక్కించే వారని తెలుగుదేశం అనుకూలురు ఆరోపిస్తున్నా.. సీబీఐ మాత్రం ఈకేసును వదిలిపెట్టబోమని, పూర్తి వివరాలు బయటపెడతామని చెబుతోంది. పట్టుకున్న కంటెయినర్‌లోని కొకైన్‌ నిల్వలను సీబీఐ జడ్జి పరిశీలించారు. జడ్జి సమక్షంలో కంటెయినర్‌లోని వేయి బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్‌ నమూనాలు సేకరించారు. నమూనాల సేకరణ సమయంలో సీబీఐ అధికారులతోపాటు సంధ్య ఆక్వా ప్రతినిధులు ఉన్నారు. వీటిని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ)కు తరలించి కేజీ ఈస్ట్‌లో కొకైన్‌ వంటి డ్రగ్స్‌ పరిమాణం ఎంత ఉందనేది నిర్ధారణ చేస్తారు. దీనికి 10,15 రోజులు పట్టవచ్చు. బ్రెజిల్‌లో ఆర్డర్‌ బుక్‌ చేసిన ఏజెన్సీ వివరాలు, ఫోన్‌ కాల్‌ డేటా, నగదు లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. పట్టుకున్న ఈడ్రగ్స్ విలువ దాదాపు యాబై వేల కోట్ల రూాపాయల వరకు ఉండవచ్చునని అంచనా.

అన్ని తెలిసినా నౌకను ఎలా పోనిచ్చారు

బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి డ్రైడ్‌ ఈస్ట్‌తో ఉన్న కంటెయినర్‌ ఈ ఏడాది జనవరి 14న చైనా నౌకలో బయలుదేరింది. ఫిబ్రవరి చివరి నాటికే విశాఖ చేరాలి. కాని ఈనెల 16న విశాఖకు వచ్చింది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో సీబీఐ రంగప్రవేశం చేసి కూపీ లాగింది. పూర్తిస్థాయిలో ఆరా తీసేసరికే ఆ నౌక తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. అక్కడ కస్టమ్స్‌ అధికారుల సమన్వయంతో నౌక అధికారులను ప్రశ్నించారు. ఈస్ట్‌తో ఉన్న కంటెయినర్‌ను విశాఖ పోర్టులో జేఎం భక్షి గ్రూప్‌ బెర్త్‌లో దించామని, అంతవరకే తమకు తెలుసని చెప్పారు. నౌకను స్వదేశానికి తీసుకువెళ్లారు. సమాచారం అందిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు నేరుగా 18వ తేదీ విశాఖకు చేరుకుని పరిశీలించారు. ఇందులో డ్రగ్స్ ఉన్నాయని తెలిసి గతుక్కుమన్నారు.

డాగ్‌ స్క్వాడ్‌ అడిగితే సీపీ ఎందుకెళ్లారు?

‘ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల విచారణ జాప్యమైంది’ అని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అయితే దీన్ని సాంకేతిక పదమని విశాఖ సీపీ రవిశంకర్ హడావుడిగా పెట్టిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. విశాఖ అధికారుల వల్ల విచారణ జాప్యమైందనే ప్రచారం అవాస్తవమన్నారు. ‘సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వాడిన పదం టెక్నికల్‌ టర్మ్‌ కోసం రాశారు తప్ప ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోలేదు’ అని స్పష్టత ఇవ్వడానికి ప్రెస్‌మీట్‌ పెట్టామన్నారు. అసలు డాగ్‌స్క్వాడ్‌ ఎందుకు కావాలన్నారు? ఎందుకు వద్దన్నారు? డాగ్‌స్క్వాడ్‌ను పంపమంటే.. సీపీ స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా రాలేదు.

డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్‌ అవశేషాలు ఎందుకుంటాయి?

డ్రైడ్‌ ఈస్ట్‌లో కొకైన్‌, హెరాయిన్‌ తదితర నిషేధిత డ్రగ్స్‌ అవశేషాలు ఉండవు. నిషేధిత డ్రగ్స్‌ అవశేషాలు ఉండాలంటే కచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించే ఉండాలి. బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రైడ్‌ ఈస్ట్‌లో కొకైన్‌ వంటి డ్రగ్స్‌ పెట్టి, రవాణా చేసి ఉండొచ్చు. సీబీఐ నాట్కో పరీక్షల్లో గుర్తించిన ఆరు డ్రగ్స్‌.. అత్యంత ప్రమాదకరమైనవని. ఇవి తీసుకుంటే శరీరంలోని నాడీవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎవరెవరిపై ఆరోపణలు వస్తున్నాయంటే...


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబాలకు సంధ్య ఆక్వా కంపెనీ యజమానికి చుట్టాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి కూడా ఇందులో వాటా ఉందన్నది వైసీపీ నేతలు ఆరోపణ. దీనికి సంబంధించి వైసీపీ నేత పేర్ని నాని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ కూడా కొందరి పేర్లను బయటపెట్టింది. వారిలో ప్రధమునిగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్ సభ వైసీపీ ప్రస్తుత అభ్యర్థి విజయసాయిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చింది.

సంధ్య ఆక్వా సంస్థ, వైసీపీ నేతల మధ్య సంబంధాలు ఉన్నాయనే దానికి రుజువులుగా కొన్ని ఫోటోలను కూడా టీడీపీ షేర్ చేసింది. విజయసాయిరెడ్డికి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ ఎండీ కూనం వీరభద్రరావు సన్నిహితుడంటూ ఆరోపణలు చేశారు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన వీరభద్రరావు కుటుంబం వైసీపీలో ఉంది. సహకార పరపతి సంఘం త్రీమెన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆయన సోదరుడు పూర్ణచంద్రరావు ఉన్నారు. పూర్ణచంద్రరావు కుమారుడైన హరికృష్ణ.. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. సంధ్య ఆక్వా నుంచి కాలుష్యం వెలువడుతోందని మూడేళ్ల కిందట ఫిర్యాదులు వచ్చినప్పుడు తనిఖీలు జరిగాయి. ఆ తర్వాత ఏమి చర్య తీసుకున్నారనేది తెలియదు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త మెలిక...

ఈ డ్రగ్స్ వ్యవహారంలో రఘురామకృష్ణం రాజు కొత్త కోణాన్ని వెలికితీశారు. ‘బ్రెజిల్‌లో ఎలాంటి కార్యకలాపాలు నడపకపోతే అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికయినవారు ఎవరో విజయసాయికి ఎలా తెలుస్తుంది?


విజయసాయి, జగన్‌మోహన్‌రెడ్డిలకు బ్రెజిల్‌తో వ్యాపార సంబంధాలు లేకపోతే ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనవారికి ఎందుకు శుభాకాంక్షలు చెబుతారు? భవిష్యత్తులో కంటెయినర్‌ దొరికిపోతుందని బహుశా అంచనా వేసి ఉండరు. అందుకే తొందరపాటుతో ట్వీట్‌ చేసి తప్పులో కాలు వేశారు. ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ డీల్‌ ప్రభుత్వ పెద్దలతోనే సాధ్యమవుతుంది. నైజీరియన్లు చిన్న మొత్తంలో డ్రగ్స్‌ తెచ్చి విక్రయిస్తేనే వారిని అదుపులోకి తీసుకుంటారు. మలేషియా, సింగపూర్‌ దేశాలలో ఒక్క గ్రాము మాదకద్రవ్యం లభించినా ఉరిశిక్ష విధిస్తారు. అలాంటిది టన్నుల్లో మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకున్నవారికి ఏ శిక్ష విధించాలి?’ అని ఎంపీ ప్రశ్నించారు.

పురందేశ్వరికి ఈ కంపెనీకి సంబంధం ఏమిటీ?

సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీతో డాక్టర్‌ కేవీ ప్రసాద్‌, ఆయన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ‘డాక్టర్‌ కె.వి.ప్రసాద్‌ కుమారుడుకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుమార్తెకు 14 ఏళ్ల కిందటే పెళ్లయింది. మాదకద్రవ్యాలు దిగుమతయిన కంపెనీ పురందేశ్వరి బంధువులదని ఎలా అంటారు’ అని ప్రశ్నించారు. ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీలో పురందేశ్వరి అల్లుడికి రూపాయి విలువ షేర్‌ లేదు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ వేరు. సంధ్యా ఆక్వాటెక్‌ కంపెనీ వేరు. సంధ్యా ఆక్వాటెక్‌ మధ్యస్థాయి కంపెనీ. అదే సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు పెద్దది’ అంటున్నారు రఘురామకృష్ణం రాజు.

Read More
Next Story