ఒకప్పుడు కలిసికట్టుగా పోరాటం, ఇప్పుడు వైఎస్సార్ బిడ్డలది చెరోదోవ. ఇంతకూ నిజమైన రాజకీయ వారసులెవరు?
వైఎస్సార్ బిడ్డల్లో వైఎస్సార్‌కు నిజమైన రాజకీయ వారసులెవరు? ఇప్పుడు ప్రజలందరినీ పురుగులా తొలుస్తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. వైఎస్సార్ మరణానంతరం ఇటీవలి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే చరిష్మా ఉన్న నాయకుడెవరూ లేరు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో మరిచిపోయారు. ఉన్నట్లుండి ఊహించని రీతిలో నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డను. వైఎస్ రాజకీయ వారసురాలును, పులి కడుపున పులే పుడుతుంది. నేను పులివెందుల పులిబిడ్డ వైఎస్‌ఆర్ కూతురును. వైఎస్‌ఆర్ ఆశయాలు సాధించేందుకు, అమలు చేసి ప్రజలకు చేరువ చేసేందుకు వచ్చానంటున్నారు వైఎస్ షర్మిల.
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసింది. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముఖగా నిలిచిన వైఎస్‌ఆర్ మరణం తరువాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మరిచి పోయింది. కనీసం ఆయన విగ్రహాలు ఆంధ్రరాష్ట్రంలో పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే వైఎస్‌ఆర్ పార్టీని స్థాపించా. మీరంతా నావెంట నిలిచారు. వైఎస్సార్ కలలు కన్న రాజ్యం స్థాపించా, ప్రతి అక్కా చెల్లి, అవ్వా తాత, అన్నా తమ్ముడు సుఖంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నా అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
వైఎస్సార్ అర్థాంగిగా ఆయన చనిపోగానే అదే పులివెందుల స్థానం నుంచి పోటీ చేసి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి, పేదల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా, వైఎస్సార్ కలలు కన్న రాజ్య భాగస్వామిగా గళం విప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆమెను పక్కన బెట్టారు కొడుకూ, కూతురు. ఆమే వైఎస్ విజయమ్మ. ఇప్పుడు ఎవరు నిజమైన వైఎస్ రాజకీయ వారసులో ఓటర్లే నిర్ణయించాలి. ఎవరి చరిష్మా ఎంత ఉందో, ఎవరు వైఎస్సార్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
వైఎస్సార్ ఆశయ సాధనలో జగన్ అడుగులు ఎంతవరకు...
వైఎస్సార్ పేరుతో పార్టీ పెట్టి మొదటి సారి ఓడినా రెండో సారి అధికారంలోకి వచ్చారు. సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. పేదవారికి డబ్బు వర్షం కురిపిస్తున్నారు. మిగిలిన పథకాల మాటేమిటి? ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన సబ్సిడీ పథకాలు ఏమయ్యాయి. ఇన్‌కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టలేకపోయారు. తన, మన అనే తేడాలు ఎందుకు చూపిస్తున్నారు. కుల ప్రస్తావనలు ఈ ప్రభుత్వంలోనే ఎందుకు ఎక్కవ ప్రచారంలోకి వచ్చాయి. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను ఎందుకు మరిచిపోయారు. కేంద్రం ప్రైవేటీకరణవైపు మొగ్గు చూపుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోయారు. కేంద్రం నుంచి కేంద్ర ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు రాబట్టడంతో ఎందుకు విఫలమయ్యారు. పీఠాధిపతులకు ఎక్కడలేని ప్రాధాన్యత ఎందుకిచ్చారు. ఎమ్మెల్యేలను ఎందుకు ఆప్యాయంగా పలకరించటం లేదు. ప్రతిపక్షంలోని వారిని కూడా ప్రేమించే వైఎస్సార్ మనస్తత్వం ఎందుకు రాలేదు. తల్లిని పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంచారు. ఎన్నోఏళ్లు రాజ్య సేవలో ఉన్న తల్లిని ఒక్కసారిగా కొడుకు ఎందుకు దూరం చేసుకున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యపాత్ర పోషించిన వైఎస్ షర్మిల పార్టీని వీడి, వేరే పార్టీ పెట్టి, తిరిగి అన్నపైనే యుద్ధం చేసేందుకు ఎందుకు రావాల్సి వచ్చింది. ఇవన్నీ ఆంధ్ర ప్రజల మనసుల్లో నుంచి ఉప్పెనలా వస్తున్న ప్రశ్నలు.
నేను వైఎస్సార్ ఆశయ సాధన కోసం వచ్చానంటే జనం నమ్ముతారా...
వైఎస్సార్ పులివెందుల పులి. ఆ పులికడుపున పుట్టిన బిడ్డను. నేను పులిబిడ్డను అంటూ వైఎస్ జగన్ పాలనలో వైఎస్సార్ ఆశయాలు మచ్చుకైనా కనిపించడం లేదు. నేను ఆయన ఆశయాలు సాధిస్తా. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దాకా పట్టువదలను అంటున్న వైఎస్ షర్మిల ప్రాజెక్టులు నిర్వీర్యమౌతున్న తీరును, రైతులు పడుతున్న కష్టాలను, తాగునీరు లేక నోరెళ్లబెట్టిన రాయలసీమ స్థితిగతులను, వైఎస్సార్ బతికుండగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ సీనియర్ల రాజకీయ వైరాగ్యాలను తెరపైకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ వారు కూడా ప్రశ్నించని ఎన్నో ప్రశ్నలను వైఎస్ షర్మిల ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెబుతున్నారు.
వైఎస్సార్ వారసత్వంగా ఏదైనా బిడ్డలకు ఇచ్చాడా?
తన ఇద్దరు బిడ్డలకు కానీ, భార్య విజయమ్మకు కానీ వారసత్వం గురించి ఎప్పుడైనా వైఎస్సార్ చెప్పాడా. నా బిడ్డలు నా రాజకీయ వారసులుగా రావాలని, అందుకోసం మనం ఎందాకైనా పోవాలని ఎప్పుడైనా తన సతీమణి వద్ద అన్నాడా అంటే అటువంటి వేవీ వెతికినా కనిపించవు.
ఎవరికి వారే రాజశేఖరుని వారసులుగా చెప్పుకుంటూ...
రాజ్యాధికారం అంటే ఎవరికీ చేదు కాదు. అధికారం చేపట్టిన వారికి ఆ విషయాలు బాగా తెలుస్తాయి. అధికారం ఉంటే ఎవ్వరూ గుర్తుకు రారు. బంధువులు, మిత్రులు అప్పుడు పెద్దగా కనిపించరు. ఒక వేళ కనిపించినా నా బిజీలో గుర్తించలేకపోయానని ఒక్క మాటతో అధికారంలో ఉన్న వారు చెప్పి తప్పించుకుంటారు. అన్న అధికారంలో ఉన్నారు. చెల్లి అధికారంలో లేకపోయినా ఒక జాతీయ పార్టీ, అందులోనూ దేశంలో ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర నాయకురాలు. వీరిరువురూ ఎవరికి వారే వైఎస్సార్ రాజకీయ వారసులుగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కొందరు పెద్దలు షర్మిలే నిజమైన వైఎస్సార్ వారసురాలంటున్నారు. జగన్‌ను అభిమానించే వారు నిజమైన వారసుడు వైఎస్ జగన్ మాత్రమే నంటున్నారు.
నిజానికి వీరు ఇరువురూ ఆస్తులు పంచుకోవడంలో మాత్రమే వైఎస్‌ఆర్ వారసులు. అంతే కాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పంచుకోవడానికి మాత్రం కాదు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తోందంటే ఒకరు అధికారం చేపట్టారు. రెండో వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. అంతే తేడా. అదే అధికారంలో భాగస్వామ్యం కల్పించి ఉంటే ఇంతటి రాద్దాంతం జరిగేది కాదు. ఈ గొడవలు వచ్చేవి కావు. ఒకరిపై ఒకరు పోరుకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావు. నిజంగా వీరిలో వైఎస్ వారసులు ఎవరు? ఎందులో వీరు వారసులు అనేది రానున్న ఎన్నికల్లో తప్పకుండా తేల్చేస్తారు.
Next Story