పచ్చని పంట పొలాల మధ్య ఆకుపచ్చని ఊరు జల్లుపల్లి నడిపూడి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి దగ్గర. ఈ ఊళ్లో పుట్టి జాతీయ అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించిన ప్రపంచ మేధావి ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా ఎలియాస్ జీఎన్ సాయిబాబా ఎలియాస్ ప్రకాశ్ అక్టోబర్ 12న పర్వదినమైన దసరా రోజు కన్నుమూశారు. ఆయనో మహోన్నత మానవుడు, విశ్వమానవ శ్రేయస్సు కాంక్షించిన వాడు. పచ్చని కోనసీమలో పుట్టినా పుట్టెడు పేదరికాన్ని వెంటతెచ్చుకున్నారు. 90 శాతం వైకల్యంతో పెరిగారు. బతికిన 59 ఏళ్లలో సగం ఆస్పత్రులు చుట్టూ, కోర్టుల చుట్టూ 10 ఏళ్లకు పైగా కారాగారంలో మగ్గారు. నడవలేని, కాళ్లులేని, మూడు చక్రాల కుర్చీలో కూలబడి ఉండే ఈ మనిషి.. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నం చేశాడని ప్రభుత్వం ఆరోపించింది. 3,588 రోజుల కారాగార వాసం, సుదీర్ఘ విచారణలు, ఒకటికి రెండు సార్లు దోషిగా తేలి నిర్దోషిగా బయటపడిన సాయిబాబా భారత దేశంలోని వామపక్ష మేధావుల్లో మొదటి వరసలో నిలబడగలిగిన సత్తా వున్నవాడు. కవి. సాహితీవేత్త. యూరప్ సహా అనేక దేశాల్లో ఇంగ్లీషు సాహిత్యం పై లెక్చర్లు ఇచ్చినవాడు. డిల్లీలో వేలాది మంది యూనివర్శిటీ విద్యార్థుల్ని ఉత్తేజ పరిచినవాడు. పేదవాడి విముక్తి కోసం పరితపించినవాడు. పూనాలోని దుర్భరమైన అండా సెల్ (ఒక చిన్నగదిలో, చక్రాల కుర్చీలో) ఉంచి ఈ ప్రభుత్వం సాయిబాబాని చిత్రహింసలు పెట్టింది. నరకం చూపించింది. సాయిబాబాది సహజ మరణం కాదు. ఇది రాజ్యం చేసిన హత్య అంటోంది పౌరసమాజం.
ఎవరీ సాయిబాబా?
గోకరకొండ సాయిబాబా 1967లో అమలాపురానికి కూతవేటు దూరంలోని జల్లుపల్లి నడిపూడిలో ఓ చిన్నతరహా కాపు కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు సత్యనారాయణ మూర్తి, సూర్యావతి. వ్యవసాయమే జీవనాధారం. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పెద్దోడు సాయిబాబా, చిన్నోడు రాందేవ్. మధ్యలో చెల్లెలు భవానీ (ఈమె ఆ తర్వాత పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయారు). ఐదేళ్లు వచ్చేంత వరకు అందరిలాగే చిన్నతనాన్ని గడిపారు. ఆ తర్వాతే ఆ ఇంట కష్టాలు మొదలయ్యాయి. తండ్రి దూరమయ్యారు. తల్లి సూర్యా వతి పొలం పని చేసేవారు. సాయిబాబా వాళ్ల ఊళ్లోని స్కూల్లోనే ఫస్ట్ క్లాస్ లో చేరారు. ఆ ఏడాది బాగానే ముగియబోతోందనగా సాయిబాబాకి విచిత్రమైన వ్యాధి లక్షణాలు కనిపించాయి. అందరూ అది పోలియో అనుకున్నారు గాని కాదు. కండరాల క్షీణత వ్యాధి. చాలా అరుదైన వ్యాధి. స్కూల్లో చేరిన ఏడాది తర్వాత మరింత ముదిరింది. వాళ్లమ్మ ఈ పిల్లాణ్ణి భుజాన వేసుకుని అమలాపురం మొదలు విశాఖపట్నం వరకు ఎక్కడెక్కడో తిప్పింది. అప్పటికే చేయి దాటిపోయింది. పిల్లవాడి ఆసక్తిని గమనించి వాళ్లమ్మ అమలాపురంలోని సెయింట్ జాన్స్ స్కూల్లో చేర్పించింది.
అక్కడ పని చేసే ఓ సహృదయుడైన ఫాదర్ ఈ పిల్లవాడి పరిస్థితిని గమనించి తనకు తెలిసిన వారందరి దగ్గరకు పంపారు. చివరకు హైదరాబాద్ లో కూడా చూపించారు. ఎక్కడా దీనికి వైద్యం లేకపోయింది. చివరకు ఆనాటి సోవియెట్ యూనియన్ రాజధాని మాస్కోలో చికిత్స ఉందని తెలిసింది. దాంతో ఆ ఫాదర్ ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయానికి లేఖ రాసి పరిస్థితి వివరిస్తారు. వాళ్లు కూడా అంతే స్థాయిలో స్పందించి తిరుగు ఉత్తరం రాశారు. మాస్కోలో వైద్యం ఉందని, ఇక్కడి నుంచి విమానచార్జీలు పెట్టుకుని వెళితే అక్కడ ఉచిత వైద్యం అందించేలా చూస్తామన్నారు. పాపం ఆ ఫాదర్ ఎన్నో ప్రయత్నాలు చేసినా అది సఫలం కాలేదు. ఈలోగా సొంతూళ్లోని పొలం హరించుకుపోయింది. చార్జీలకు డబ్బు సమకూరలేదు. దాంతో కాపురం సమీపంలోని అమలాపురానికి మారింది. పొలం అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి చిన్న ఇంట్లోకి మారారు. అమలాపురంలోని ఆ స్కూల్లోనే ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రయూనివర్శిటీ పరిధిలోనే టాప్ ర్యాంకర్ గా నిలిచారు. చదువుకునే రోజుల్లోనే పిల్లలకు ట్యూషన్లు చెప్పి ఆ వచ్చే దాంతో కాలం గడిపారు.
వసంత కుమారితో పరిచయం...
ఆ సమయంలోనే తన సహధ్యాయి వసంత కుమారితో పరిచయం అయింది. ఆమెది కూడా సాయిబాబా వాళ్ల ఊరే కావడంతో వాళ్ల కుటుంబం గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచే వసంత సాయిబాబా కష్టసుఖాలలో పాలుపంచుకునే వారు. ఆ పరిచయమే చివరకు ఆయన్ను పెళ్లి చేసుకునే దాకా వెళ్లింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏమి చేయాలనే సమస్య వచ్చింది. కాపురం హైదరాబాద్ మారింది. ముగ్గురు పిల్లలతో సూర్యా వతి మహానగరంలో కాపురం పెట్టారు. సాయిబాబాకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సీటొచ్చింది. ఎం.ఏ ఇంగ్లీషులో చేరారు. మిగతా ఇద్దరు వేర్వేరు కళాశాలల్లో చేరారు. సాయిబాబా పాలిటెక్నిక్ కళాశాల సహా పలు చోట్ల పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు.
ఎదురుకాల్పుల్లో సాయిబాబా చెల్లెలు మృతి..
సాయిబాబా చెల్లెలు భవానీ కూడా చాలా చురుకైన వ్యక్తి. కుటుంబ పరిస్థితుల కారణంగా ఏడో తరగతిలోనే చదువు మానేసింది. కుట్టుపని నేర్చుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. సమాజంలోని అసమానలతే వాళ్లింట్లో చర్చోపచర్చలు జరిగేవి. అందరికీ సమానంగా అందాల్సిన అవకాశాలు కొందరికే ఎక్కువగా అందుతున్నాయనే దానిపై విపరీతమైన అసహనం ఉండేది. సాయిబాబా అన్ని రకాల సాహిత్యాన్నీ చదివారు. మార్క్సిజం తన ధోరణికి దగ్గరగా ఉందనుకున్నారు. ఆ ప్రభావమే ఆయన చెల్లెలిపై పడింది. ఆ తర్వాత ఆమె రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్ యూ) వైపు ఆకర్షితురాలయ్యారు. పీపుల్స్ వార్ లో చేరి అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఆనాడు తెలంగాలో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో చనిపోయారు.
సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చేసిన సాయిబాబా పీహెచ్ డీ కోసం ఢిల్లీ యూనివర్శిటీలో చేరారు. 2013లో "Indian Writing in English and Nation Making అనే అంశంపై థీసిస్ సమర్పించారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఖరారయ్యారు.
ఆ తర్వాత ఏడాదికే అరెస్ట్..
వాళ్లమ్మ సూర్యావతి, తమ్ముడు రాందేవ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. సాయిబాబాకి సర్వం తానై చూసుకున్న వసంత కుమారి సాయిబాబాకి అర్ధాంగి అయ్యారు. ఢిల్లీలో మకాం పెట్టారు. 2014 రానే వచ్చింది. ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర గడ్చిరౌలీలో గిరిజనులు తిరగబడేలా పట్టణ ప్రాంతాల్లోని మావోయిస్టులు పురికొల్పుతున్నారనే ఆరోపణపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబా సహా ఆరుగుర్ని అరెస్టు చేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు పదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.
సరిగ్గా ఆ సమయంలోనే 2020 ఆగస్టు 2 సాయిబాబా తల్లి సూర్యావతి మరణించారు. తల్లంటే అత్యంత ఇష్టం సాయిబాబాకి. అయినప్పటికీ హృదయం లేని న్యాయస్థానాలు ఆయన్ను ఆమె భౌతికకాయాన్ని చూసేందుకు అనుమతి నిరాకరించాయని ఆనాడు విమర్శలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు 78 ఏళ్లు. ఆయన నాగపూర్ జైల్లో ఉన్నారు. వాళ్లమ్మ అనారోగ్యంగా ఉన్నప్పటి నుంచే ఆమెను చూసేందుకు తహతహలాడారు. ఐదారు సార్లు కోర్టుకు విన్నవించినా నాగపూర్ బెంచ్ తిరస్కరించింది. ఆయన ఆమధ్య జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ సంఘటనను తలచుకుని కన్నీరు పెట్టుకుంటారు. ఇంతకంటే దారుణం ఏముంటుందంటారు.
వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే కాళ్లు చచ్చుబడిపోయాయి. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వాపోయినా కోర్టులు గాని జైళ్లు గాని పట్టించుకోలేదు.
జీఎన్ సాయిబాబా అరెస్టుల పర్వం ఇలా..
2014 మే 9న తొలి అరెస్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సాయిబాబాను తొలిసారి అరెస్ట్ చేశారు.
2017 మార్చి 3 14న దోషిగా తేల్చారు. ఆయనతో పాటు మరో ఐగుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి సంఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణపై పదేళ్ల జైలు శిక్ష విధించారు.
2022 అక్టోబర్ 14న మహారాష్ట్ర హైకోర్టు ఈ ఆరుగురు నిర్దోషులంటూ తీర్పు ఇచ్చింది. వీళ్లు జైలు నుంచి బయటకు రావడానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2022 అక్టోబర్ 15న మహారాష్ట్ర హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే, మళ్లీ జైల్లోనే.. దీనిపై సాయిబాబా మరికొందరు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
2023 ఏప్రిల్ 19న ముంబై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు షా, సీటీ రవికుమార్ పక్కన బెట్టారు. సాయిబాబా కేసును మళ్లీ వినమని ఆదేశించారు.
2024 మార్చి 5న ముంబై హైకోర్టులోన నాగపూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, వాల్మీకి ఎస్.ఏ. మనెంజెస్ ఈ ఆరుగురిపై మోపిన కేసుల్ని కొట్టివేసింది. దీనిపైన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ తీర్పును సవాల్ చేసింది.
2024 మార్చి 11న జస్టిస్ బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ ను తిరస్కరించింది. ముంబై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రొఫెసర్ సాయిబాబా సహా ఆరుగుర్ని విడుదల చేయడం సరైందేనని తీర్పు ఇచ్చింది. ఒకసారి నిందితులు వాళ్ల నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత పదేపదే కోర్టులకు రావడం అసాధారణమైందని, దీనిపై అంత అర్జంటుగా కోర్టుకు రావాల్సిన పనేముందని వ్యాఖ్యానించింది. సాయిబాబా సహా మరో ఐదుగుర్నీ విడుదల చేయమని ఆదేశించింది.
నిమ్స్ లో తుదిశ్వాస..
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో దాదాపు మూడు వారాల పాటు చికిత్స పొందిన సాయిబాబా శనివారం (2024 అక్టోబర్ 12) రాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంలో ఆయన సహచరులు, మిత్రులు అనేక మంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ సాయిబాబా సన్నిహిత సహచరుడు, ఫోరమ్ ఎగైనెస్ట్ రెప్రెషన్‌కు చెందిన కె. రవిచంద్ర మాటల్లో చెప్పాలంటే "కిడ్నీలోని రాళ్లను తీసేసే ఆపరేషన్ పూర్తయింది. ఆ తర్వాత ఐదు రోజులకు ఇన్ఫెక్షన్ సోకింది. అదీ కూడా నయమవుతుందనుకుంటున్న దశలో ప్రాణమే పోయింది.
మరో మిత్రుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ చెప్పిన దాని ప్రకారం "దీర్ఘకాలిక జైలు జీవితం సాయిబాబా ఆరోగ్యంపై ప్రభావం చూపింది. మూడు నెలల కిందటే జైలు నుండి బయటకు వచ్చాడు. ఒత్తిడి, జైలు శిక్ష ఈ పరిస్థితికి దారితీసింది”
రిజర్వేషన్ల అనుకూల ఉద్యమంలో...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో మండల్ కమిషన్ ఆందోళన ఉధృతంగా సాగుతున్నప్పుడు సాయిబాబా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫ్రంట్‌తో ఉండేవారు. రిజర్వేషన్ల అనుకూల ఉద్యమానికి నాయకత్వం వహించారు. అమలాపురం నుంచి ఎం.ఎ. ఇంగ్లీష్ చదవడానికి సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చిన సాయిబాబా ఆతరువాత CIEFLలో EFLU లో పోస్ట్ డాక్టరల్ స్టడీస్ పూర్తి చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. మానవ హక్కుల సమస్యలపై పోరాడారు. ప్రొఫెసర్ సాయిబాబా సుదీర్ఘ అణచివేత తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారని, తనకు లభించిన స్వేచ్ఛను అనుభవించకుండానే చనిపోయారని మానవహక్కుల వేదిక నాయకుడు జీవన్ కుమార్ అన్నారు. 1993లో హైదరాబాద్‌లోని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 35 రోజుల సుదీర్ఘ నిరాహారదీక్షలో ప్రొఫెసర్ సాయిబాబా పాల్గొన్నారు. “రాజ్యం, మొత్తం వ్యవస్థ ఆయన పట్ల చాలా క్రూరంగా వ్యవహరించాయి” అని ఆయన అన్నారు. ఇది మనువాదుల రాజకీయ హత్య అని మరికొందరు ఆరోపించారు.
కులం కాలమ్ తీసేయమని చెప్పిన ధీరుడు...
మరణంలోనూ ఆయన దేశానికి దిక్సూచీగా మిగిలారు. కులం కుళ్లుతో మగ్గిపోతున్న సమాజంలో చివరకు జైళ్లలోనూ కుల జాఢ్యం ఉందని వెలుగెత్తి చాటారు. సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్లారు. పదేళ్లు జైలు జీవితం గడిపి నిర్దోషిగా విడుదల అయిన సాయిబాబా తన చివరి ఇంటర్వ్యూ లో... జైలులో కుల వివక్ష ఎలా ఉంటుందో, ఏ కులానికి చెందిన ఖైదీతో జైలు అధికారులు ఎలాంటి పనులు చేయిస్తున్నారో ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రిజన్ రిజిస్టర్ డైరీలో కులం కాలం తొలగించాలని ఆదేశించింది.
ఇండియా ఒక విఫల రాజ్యమని ఎందుకన్నారంటే..
శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడు ఎవర్నైనా ఎందుకు అన్యాయంగా జైల్లో పెట్టాలని ప్రశ్నించిన వ్యక్తి సాయిబాబా.
2014లో అరెస్ట్ అయ్యేనాటికి 90 శాతం వైకల్యంతో ఉన్న మనిషిని "శాసనం ద్వారా నిర్మితమైన" భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం పదేళ్లలో ఆయన్ను ప్రాణం లేని మనిషిగా మార్చింది. రాజ్యహింసను వర్ణించ అలవికాని రీతిలో ప్రతిఘటించి, నిలబడిన ఉక్కుమనిషిగా సాయిబాబా భారత చరిత్రలో నిలిచిపోతారు.
"ఆయనకు కాళ్లూ ఇతర శరీరభాగాలు పని చేయకపోయినా మెదడు పని చేస్తోందిగా" అని ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అడిగారంటేనే ఈ దేశ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో ఊహించవచ్చు. ఎటూచూసినా ఆరడుగులు లేని ఒంటరి సెల్ లో ఆయన్ను నిర్బంధించి నిటారుగా కప్పుకోవడానికి కూడా దుప్పటి ఇవ్వని ఈ జైలు అధికారుల తీరు, కులాన్ని బట్టి జైల్లో పనులు చేయించే రీతి రీవాజు ఉన్న దేశం మనది. ఇండియాలో జైళ్ళు ఎలా ఉంటాయో చెప్పిన మొదటి వ్యక్తిగా ఆయన భారత ప్రజలకు గుర్తుండి పోతారు.
ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయేనాటికి 59 ఏళ్లు కూడా నిండలేదు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీర, తమ్ముడు డాక్టర్ రాందేవ్ ఉన్నారు.