పెట్టెలో శవాన్ని పెట్టి ఓ ఇంటికి పార్సిల్ పంపించి వారం రోజులైంది. ఆ యింటి వారు గజగజ వణికి పోతున్నారు. ఈ కేసులో పోలీసుల పాత్ర ఎలా ఉంది?
ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఎప్పుడు హత్య జరిగిందో తెలియదు. శవం కుళ్లి కంపు కొడుతోంది. నల్లగా మారిపోయింది. శవాన్ని గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. రంగురంగుల చెక్క పెట్టెలో కాళ్లు, చేతులు మడిచి వత్తిపెట్టి పార్సిల్ చేశారు. వాసన బయటకు రాకుండా పార్సిల్ ఉంది. మధ్యాహ్నం పార్సిల్ వస్తే పక్కన పెట్టిన ఇంటి వారు రాత్రి 10.30 గంటల సమయంలో వచ్చిన పార్సిల్ ను తెరిచి చూశారు. పైన చుట్టిన పాలిథిన్ కవర్స్ కట్ చేయగానే విపరీతమైన వాసన వచ్చింది. చుట్టుపక్కల వారు కూడా భరించ లేనంతగా వాసన ఉంది. పార్సిల్ లో ఉన్నది శవమని గుర్తించగానే ఆ ఇంటి వారి నోట మాట రాలేదు. వణికి పోయారు. వెంటనే ఉండి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని యండగండి గ్రామంలోని సాగి తులసి అనే మహిళ ఇంటికి ఈ పార్సిల్ వచ్చింది. పోలీసులు పార్సిల్ ను పరిశీలించి ఉండి ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు హత్యగా నిర్ధారించారు. హంతకులు ఎవరు? ఎందుకు చేశారు? ఎందుకు తులసి ఇంటికి శవాన్ని పంపించారనేది అందరిలో ఉన్న సందేహం. పోలీసులు ఐదు రోజుల తరువాత దర్యాప్తును కాస్త వేగవంతం చేశారు. అయినా హంతకుడు ఎవరనేది ఇంకా తేల్చలేకపోయారు. చచ్చిన శవాన్ని పార్సిల్ చేసి పంపించడం అనేది సంచలనంగా మారింది. ఎన్నో అనుమానాలకు తావు తీసిన ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం కూడా ఒక కారణం అయి ఉంటుందనే అనుమానం కూడా పోలీసుల్లో ఉంది.
తులసి మరిది తీరుపై అనుమానాలు
శ్రీధర్ వర్మను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన శవం పార్సిల్ వచ్చిన రోజు నుంచి ఎస్కేప్ అయ్యారు. శ్రీధర్ వర్మ కనిపించకుండా పోవడంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఐదు రోజుల పాటు వెంటాడి పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీధర్ వర్మను ఆకివీడుకు సమీపంలోని ఒక భవంతిలో బంధించి విచారణ జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిని పోలీసులు కొట్టిపారేశారు. అయితే ఈ హత్య పోలీసులకు సవాలుగా మారింది. శవం పార్సిల్ నుంచి కేసును దర్యాప్తు చేయాల్సి వచ్చింది. చివరి నుంచి దర్యాప్తు ద్వారా మొదట్లో జరిగింది ఏమిటనేది గుర్తించాల్సి ఉంది. శ్రీధర్ వర్మ ఏమి పనులు చేస్తంటాడు. ఎవరెవరితో తిరుగుతుంటాడు. భార్యా భర్తల సంబంధం ఏ విధంగా ఉంది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఎందుకు విడిపోయారు. లేక వారేమయ్యారు. మూడో పెళ్లి తెలిసి చేశారా? తెలియకుండా తల్లిదండ్రులు వారి అమ్మాయిని ఇచ్చారా? అనే కోణంలోనూ విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
తులసి ఎవరు?
పశ్చిమ గోదావరి జిల్లాలోని యండగండి గ్రామానికి చెందిన రంగరాజు కుమార్తె. ఈయనకు మరో కుమార్తె కూడా ఉంది. తులసి కి పెళ్లి చేసిన తరువాత ఒక కుమార్తె పుట్టింది. తులసి భర్త గ్రామంలో అప్పులు ఎక్కువగా చేశాడని, అందుకు భార్యా భర్తలు చాలా సార్లు గొడవలు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఈ తగాదాలు, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక తులసి భర్త ఇంట్లో చెప్పకుండా ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో తులసి పాలకోడేరు మండలం గంగపర్రు గ్రామంలో ఉంటూ ఏవో చిన్న పనులు చేసుకుని కుమార్తెను చదివించుకుంటూ జీవిస్తోంది.
రేవతి ఎవరు?
తులసి చెల్లెలు రేవతి. ఈమెతో శ్రీధర్ వర్మకు వివాహమైంది. వీళ్లు కాళ్ల గ్రామం గాంధీనగర్ లో ఉంటున్నారు. రేవతిని మూడో భార్యగా చేసుకున్న శ్రీధర్ వర్మ తనకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని, వారి వివరాలు తెలుపకుండా ఈమెను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. తులసి నుంచి భర్త దూరంగా వెల్లడంతో తండ్రి వద్దకు రాకుండా వేరే చోట ఉంటోంది. తండ్రి వద్దకు చిన్న కూతురు రేవతి కూడా రాకుండా కళ్ల గ్రామంలో భర్త వద్ద ఉంటోంది. తులసి, రేవతిలు అక్కా చెల్లెళ్లు కావడం వల్ల అప్పుడప్పుడు వారి కుటుంబాల వారు కలస్తుంటారు.
శ్రీధర్ వర్మ ఎలాంటి వాడు
శ్రీధర్ వర్మకు మరో మూడు పేర్లు కూడా ఉన్నాయి. సిద్దార్థ వర్మ, సురేంద్ర వర్మ, సుధీర్ వర్మ పేర్లతో కూడా ఈయనను పిలుస్తుంటారు. చేపల చెరువుల వ్యాపారం చేస్తుంటాడని, గంజాయి ముఠాలతో కూడా వర్మకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రులు తప్ప పగలు పూట గ్రామంలో కనిపించరని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రులు భార్య వద్దకు వస్తూ ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకుంటాడని, బుల్లెట్ వచ్చి వెళుతుంటాడని స్థానికులు చెబుతుంటారు. శ్రీధర్ వర్మ తన వదినకు శవం పార్సిల్ వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ మేరకు ఫోన్ సిగ్నల్స్ ద్వారా వెతికి పట్టుకున్నట్లు సమాచారం. శ్రీధర్ వర్మ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన భార్య, వదిన, మామ ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
శ్రీధర్ వర్మ ఇంట్లో పోలీసులు సోదా చేస్తే మరో చెక్క పెట్టె కూడా శవాన్ని పంపించిన లాంటిదే ఉన్నట్లు తెలిసింది. అంటే తప్పకుండా శ్రీధర్ వర్మ హత్యకు పాల్పడి ఉండాడనే అనుమానంతో అతనితో సహజీవనం చేస్తున్న మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. శ్రీధర్ ఇంట్లో కుంకుమ, చేతబడికి ఉపయోగించే పలు రకాల వస్తువులు కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతోంది.
శవం ఎవరిది?
పార్సిల్ వచ్చిన శవం ఎవరిదనేది ఇంత వరకు తేలలేదు. అయితే కాళ్ల గ్రామం గాంధీనగర్ ఏరియాకు చెందిన పర్లయ్య దిగా గుర్తించినట్లు సమాచారం. పర్లయ్య ఈ వరం నుంచి కనిపించకుండా పోవడమే అందుకు కారణం. పోలీసులు ఈ విషయం కూడా ఇంకా ధృవీకరించలేదు. ఈ ప్రాంతానికి చెందిన మరో మహిళతో కలిసి పర్లయ్యను హత్య చేసి తన వదిన ఇంటికి శవాన్ని వర్మ పార్సిల్ ద్వారా పంపించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడి కావాలంటే పోలీసులు తెలపాల్సిందే. పర్లయ్య శనిపోయాడని స్థానికులు నమ్మడం లేదు. ఆయనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు లేవని, అందువల్ల ఆయనను చంపే అవకాశం ఎందుకు ఉంటుందనే ప్రశ్న స్థానికుల నుంచి వస్తోంది. శవాన్ని గుర్తుపట్టేందుకు వీలు లేకుండా ఉండటంతో పర్లయ్య శవమా? కాదా? అనే అనుమానాలు కూడా ఆయన బంధువుల్లో ఉన్నాయి.
కనిపించకుండా పోయిన తులసి భర్త
ఏడు సంవత్సరాల నుంచి తులసి భర్త కనిపించకుండా పోయారు. తులసికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి చదువుకుంటూ తల్లి వద్ద ఉంటుండగా చిన్న కుమార్తె తాత ఇంట్లో ఉంటోంది. తులసి భర్త ఆచూకీ కూడా తెలుస్తుందేమోనని పోలీసులు ఆ దిశగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా అందరూ తులసి భర్తను చంపి ఎవరైనా పార్సిల్ పంపించారా? అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. అందుకే పోలీసులు ఆయన ఆచూకీ కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడేళ్లుగా కనిపించకుండా పోయిన తులసి భర్త దొరికితే మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది.
ఎందుకు హత్య చేశారు..
పోలీసులు అనుమానిస్తున్నట్లు శ్రీధర్ వర్మ ఈ హత్యకు పాల్పడి ఉంటే ఎందుకనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. చంపిన శవాన్ని తన వదిన ఇంటికి ఎందుకు పంపించారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. చంపిన మూడు రోజుల తరువాత పార్సిల్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంపిన తరువాత మూడు రోజులు శవాన్ని ఎక్కడా దాచారు. ఎందుకు దాచారా? అనే అనుమానాలు కూడా పోలీసులను వెంటాడుతున్నాయి. పార్సిల్ తో పాటు పంపించిన లెటర్ ఫేక్ అని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే రేవతి కుటుంబం పేదరికంలో ఉంది. భర్త లేడు. అటువంటప్పుడు ఆమె కోటి 30 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుంది. ఈ మొత్తం ఇవ్వక పోతే పరిణామాలు వేరుగా ఉంటాయని, మరో శవం లేస్తుందని అందులో ఉంది. చంపిన వారు తులసి భర్తనే చంపారని అనుమానించే విధంగా లేఖ రాశారు. కానీ చనిపోయిన వారు పర్లయ్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
వివాహేతర సంబందాలే కారణమా?
ఈ హత్యకు వివాహేతర సంబంధాలే కారణమనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఎవరికి ఎవరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాలతో శ్రీధర్ వర్మకు ఉన్న సంబంధం ఏమిటనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులను పక్కదోవ పట్టించేందుకు వివాహేతర సంబంధాల ప్రచారం తెరపైకి తెచ్చారా అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులకు కేసు సవాల్ గా మారింది.