సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లడుతూ ప్రభుత్వం ఫెయిల్ అయిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. హోం మంత్రి అనితపై బాధ్యత ఉందంటూ ఆమెపై తోచేశాడు. అలాగే గత ప్రభుత్వంపై తోసేశాడు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన కూడా మంత్రి వర్గంలో భాగమనే విషయం మరిచిపోయినట్లున్నారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వంలో పోలీస్ విభాగం నిర్వీర్యమైంది. అందులో భాగంగానే పలువురు పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముగ్గరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఊరకే ఒక్క మాటతో తోచేస్తే పోయేది కాదు. వైఎస్సార్‌సీపీపై నెట్టేస్తే ఎవ్వరూ హర్షించరు. పోస్టింగ్‌లకు లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారు. డీఎస్‌పీల బదిలీల్లో లక్షలు చేతులు మారాయి. నిజాయితీగా ఉన్నామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైంది. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. ఇప్పటికే గత ప్రభుత్వంలో తొత్తులుగా వ్యవహరించిన పలువురు పోలీస్ అధికారులు వీఆర్‌లో ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని చెప్పొచ్చు.
సీపీఎం సీనియర్ నాయకులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. చిన్న బిడ్డలపై అఘాయిత్యాలు, హత్యలు చేస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇది డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి వ్యాఖ్యానించడం కంటే నాకు కూడా బాధ్యత ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రజల్లో మా పాలన బాగుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాలి. అలా కాకుండా యూపీ తరహా పోలీసింగ్ కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చట్టాన్ని ఉల్లంఘించడమే. యూపీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా ఛీకొడుతున్నారు. న్యాయబద్ద పాలన ఉండాలి. చట్ట పరిధిలో పాలించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఇప్పటికైనా స్పందించాలి. రాజ్యాంగాన్ని అగౌరవ పరచడం మంచిది కాదు. ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త సమస్యలు తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజలు ఇటువంటి వ్యాఖ్యలను హర్షించరని అన్నారు.
కాగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని స్పష్టంగా చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో ప్రభుత్వమే అంగీకరించిందని చెప్పాలి. పవన్ కళ్యాన్ హోం మంత్రి వనితను విమర్శించారంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించినట్లే. ముందు ఆయన శాఖలో పేరుకు పోతున్న పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవాలి. డయోరియా, డెంగ్యూవంటి వ్యాధులు గ్రామాల్లో ప్రబలుతున్నాయి. గ్రామాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా మారిపోయాయి. ఈ విధంగా మూడు కుంపట్లపై ప్రభుత్వం కొనసాగే సూచనలు కనిపించడం లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. లేదా పవన్ కళ్యాణ్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి ఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ ఈ అంశాన్ని మూడు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో సహచర మంత్రి పని తీరుపై కామెంట్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధం. కలెక్టివ్ రెస్పాన్స్ బులిటీ తీసుకోవాలి. ఈ మాటలు వింటుంటే ఆయనకు రాజ్యాంగంపై అవగాహన లేదని, రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని, బాధ్యత కలిగిన వ్యక్తుల స్థానంలో ఉన్నప్పుడు ప్రతి మాటా విలువైనదనే విషయం గుర్తించాలన్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, హత్యలు జరటం బాధాకరమని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడాల్సిందిగా జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వివి లక్ష్మినారాయణ (జెడి లక్ష్మినారాయణ)ను కోరగా తప్పులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమని సీరియస్‌గా ఒక హెచ్చరిక పవన్ కళ్యాణ్ చేశారన్నారు. హోం మంత్రి కూడా దీనిని పాజిటివ్‌గా తీసుకున్నారన్నారు. ఈ విధమైన హెచ్చరికలు చేయడం మంచిదేనని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభిప్రాయం తీసుకునేందుకు ప్రయత్నించగా స్పోక్స్ పర్సన్‌కానీ, పార్టీ ముఖ్య నాయకులు కానీ అందుబాటులోకి రాలేదు. రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డకి ఫోన్ చేస్తే ఆయన పీఏ ఫోన్ లిఫ్ట్‌చేసి సార్ అందుబాటులో లేరని, వచ్చిన తరువాత చెబుతానని ఫోన్ పెట్టేశారు. స్పోక్స్‌పర్సన్ మూర్తికి ఫోన్ చేస్తే నాకు వేరే అసైన్‌మెంట్ ఇచ్చారని, ఆ పనిలో ఉన్నందున మీడియా సెల్ శివ నెంబర్ ఇస్తానని పంపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకటికి నాలుగు సార్లు చేసినా ఇదే పరిస్థితి. మాజీ మంత్రి మేరుగు నాగార్జునకు ఫోన్ మూడు సార్లు చేస్తే రెండు సార్లు రింగ్ కాగా ఒకసారి కట్ చేశారు. అంటే వైఎస్సార్ సీపీ వారికి అధికార కూటమి మాటలపై కానీ, చేతలపై కానీ మాట్లాడటానికి ఇష్టం లేదని స్పష్టమవుతోంది.
ఇక బీజేపీ వారు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. లంకా దినకర్ సోమవారం పవన్ వ్యాఖ్యలు శాంతి భద్రతలపై అప్రమత్తం చేసేలా ఉన్నాయని చెప్పారు. బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పాతూరి నాగభూషణంకు ఫోన్ చేయగా విషయం ఏమిటని అడిగారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడాలని కోరగా వేరే పనిలో ఉన్నాను. మళ్లీ ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశారు.