ఆంధ్రా మన్యం దొరలు ఎవరో?

ఆంధ్రప్రదేశ్‌లో మన్యం జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి ఎస్సీ, మూడు ఎస్‌టీ రిజర్వుడు. ఇక్కడ గెలిచే దొరలెవరో? ఎవరిని గిరిజనులు నెత్తిన పెట్టుకుంటారో..


ఆంధ్రా  మన్యం దొరలు ఎవరో?
x
కామలింగేశ్వర ఆలయం, గాళ్లవిల్లి, మన్యం జిల్లా (Credit: G.N. Subrahmanyam )

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా ఎవరిని వరించనుంది. ఈ జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఉండగా నలుగురూ వైఎస్సార్‌సీపీ వారే. కురుపాం నియోజకవర్గం నుంచి గెలిచిన పాముల పుష్ప శ్రీవాణి మొదటి రెండున్నర సంవత్సరాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు మిగిలిన రెండున్నర సంవత్సరాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అవకాశం కల్పించారు. అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదేళ్లు వరుసగా ఇద్దరు మంత్రులు పనిచేశారు. గిరిజనుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ కాంగ్రెస్‌వారే గెలిచే వారు.

సిటింగ్‌లకే వైఎస్సార్‌సీపీ టికెట్లు
మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మార్చలేదు. జిల్లాలో ఒక ఎస్సీ, మూడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం పార్వతీపురం నుంచి ప్రస్తుతం అలజంగి జోగారావు ఎమ్మెల్యేగా ఉన్నారు. సాలూరు పీడిక రాజన్నదొర, కురుపాం పాముల పుష్ప శ్రీవాణి, పాలకొండ విశ్వరాయి కళావతి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరందరికీ నియోకవర్గాల్లో మంచి పట్టు ఉంది.
మూడు అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
మన్యం జిల్లాలోని పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గానికి విజయ్‌ బోనెలను టీడీపీ ప్రకటించింది. ఈయన స్వగ్రామం పార్వతీపురం మండలంలోని నరిసిపురం గ్రామం. వ్యాపార రిత్యా విదేశాలకు వెళ్లి బాగాడబ్బు సంపాదించారని స్తానికులు చెబుతున్నారు. ఈయన ఇంటర్నేషనల్‌ ఎస్సీ కమ్యునిటీ ఫోరంలో నాయకుడు దాంతో ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ సీటు పొందిన మాజీ ఐఏఎస్‌ అధికారి బి రామాంజనేయులతో పరిచయం ఉంది. దీంతో చంద్రబాబునాయుడు వద్ద రామాంజనేయులు మాట్లాడి విజయ్‌కి టిక్కెట్‌ ఇప్పించారని సమాచారం. అలజంగి జోగారావుపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా విజయ్‌ ఎన్‌ఆర్‌ఐ కావడం వల్ల డబ్బుతో ఓటర్లను ఆకట్టుకోవచ్చుననే ప్రచారం సాగుతోంది.
సాలూరు రాజన్నదొరపై టీడీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన గుమ్మడి సంధ్యారాణి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, భర్త ఆస్త్రేలియాలో ఉంటారు. మొదటి నుంచీ టీడీపీ రాజకీయాల్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న దొరకు కూడా గిరిజనుల్లో మంచి పట్టు ఉంది. ఎవరు వచ్చినా కాదనకుండా వారి సమస్యను సావధానంగా విని సమస్యను పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటుంటారని స్థానికులు చెబుతుంటారు.
కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి రెండో సారి గెలిచి మంత్రి అయ్యారు. మొదటి సారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేనందున ఏమీ చేయలేకపోయానని చెప్పుకుని 2019 ఎన్నికల్లో గెలిచారు. రెండోసారి గెలిచిన తరువాత ఆమె ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ఏనుగుల గుంపును గ్రమాలకు రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందులో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. మరొక ప్రధానమైన హామీల్లో నాగావళి నదిపై పూర్ణపాడు–లాబేశ్‌ గ్రామాల మధ్య వంతెన నిర్మించాల్సి ఉంది. అది కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ రెండు అంశాలు పుష్పశ్రీవాణిపై గిరిజనుల్లో వ్యతిరేకతను పెంచాయి. మంత్రి పదవి పోయిన తరువాత అప్పుడప్పుడు నియోజకవర్గానికి రావడం తప్ప పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఉండటం లేదు. ఈమెపై పోటీకి దిగుతున్న తొయక జగదీశ్వరి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆశీస్సులతో సీట్ సంపాదించారు. స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం. శుత్రుచర్ల పేరుతో మాత్రమే ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్న పాముల పుష్ప శ్రీవాణి శత్రుచర్ల విజయరామరాజు తమ్ముడు శత్రుచర్ల చంద్ర శేఖర రాజు కోడలు. అంటే శత్రుచర్ల విజయరామరాజుకు కూడా కోడలే అవుతుంది. అయినా ఆమెను కాదని జగదీశ్వరిని ఎందుకు రంగంలోకి దింపించారో అర్థం కాని పరిస్థితి ఉంది. పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ వారికి ఇక్కడ తగిన అభ్యర్థి దొరకకపోవడంతో వెతికే పనిలో ఉన్నారు.
Next Story