ఏపీలో మంత్రి వర్గ ఏర్పాటుపై చర్చ సాగుతోంది. టీడీపీ వారితో పాటు జనసే, బీజేపీ వారు కూడా మంత్రివర్గంలో ఉంటారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గంలో ఎవరెవరు మంత్రులుగా ఉంటారనే విషయమై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఈనెల 12 ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోజే మంత్రి వర్గంలో కొందరు ముఖ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బిజెపితో పాటు జనసేన పార్టీని కలుపుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. 2024లో ఇద్దరికి మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఈసారి బిజెపితో పాటు మిత్రపక్షమైన జనసేనకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ఏపీ మంత్రివర్గంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముద్ర తప్పకుండా ఉంటుందని పలువురు పార్టీ నాయకులు భావిస్తున్నారు.

తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీనవర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలోకన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో కడప నుంచి మాధవీరెడ్డి, పుట్టపర్తి నుంచి సింధూరరెడ్డి, పెనుకొండ నుంచి సవిత లాంటి వారు మొదటిసారి పోటీచేసిన గెలుపొందిన మహిళలు ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాలైన శింగనమల నుంచి బండారు శ్రావణిశ్రీ, శింగనమల నుంచి నెలవల విజయశ్రీ, ఎస్టీల్లో రంపచోడవరం నుంచి శిరీషాదేవి, కురుపాం నుంచి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. బీసీల్లో గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవి, తుని నుంచి యనమల దివ్య, పెనుగొండ సవిత, పలాస నుంచి గౌతు శిరీష వంటి వారున్నారు. వీరిలో సామాజిక వర్గానికి ఒకరికి అవకాశం లభించ వచ్చనే చర్చ మొదలైంది.
కొత్త తరంలో ఆసక్తి..
వీరందరూ రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులు. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసన సభ్యులుగా గెలిచిన వారికి అవకాశమివ్వాలనుకుంటే.. ఎస్సీ వర్గానికి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు. పార్టీలో అత్యంత సీనియర్‌ నేత అశోకగజపతిరాజు కుమార్తె విజయనగరం నుంచి గెలుపొందిన అదితి గజపతిరాజుకూ అవకాశం దక్కొచ్చు. ఎస్టీల్లో అవకాశం ఇవ్వాలనుకుంటే సాలూరు నుంచి పీడిక రాజన్న దొరను ఓడించిన గుమ్మడి సంధ్యారాణికి అవకాశం లభించొచ్చు.
సీనియర్లే ముఖ్యనుకుంటే..
తెదేపాలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్‌విఎస్‌కె రంగారావు, కిమిడి కళా వెంకటరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణంరాజు, కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, శ్రీరాం తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది.
ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్‌ విజయ్‌కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, నెల్లూరు జిల్లా నుంచి ఎం నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డిల పేర్లు పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్‌ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిల పేర్లు కూడా పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పుచేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో తెదేపా చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశమొస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ఛాన్సు దక్కొచ్చు.
మైనారిటీల నుంచి నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్, గుంటూరు తూర్పు నుంచి నసీర్, మదనపల్లి నుంచి షాజహాన్‌ బాషాలు ఉన్నారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే అభ్యర్థులు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో వీరిలో ఒకరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
జనసేనలో ఎవరు?
జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్ఠంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్‌ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్‌ బాబు, నిడదవోలుకు చెందిన కందుల దుర్గేశ్, అవనిగడ్డకు చెందిన మండలి బుద్ధప్రసాద్, తిరుపతి నుంచి గెలిచిన ఆరణి శ్రీనివాసులు మిగిలినవాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బిజెపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచారు. సీనియర్‌ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. జనసేన, భాజపాల నుంచి ఏ జిల్లాలో, ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్నిబట్టి తెదేపా ఎమ్మెల్యేల అవకాశాలూ ప్రభావితమవుతాయి.
Next Story