ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అమకు అనుకూలమైన పెద్దల చేత సిఫార్సులు చేయించుకుంటున్నారు.
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై కూటమి వర్గాలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు నామినేషన్ సమయం దగ్గర పడుతుండటం, శని, ఆది వారాలే గడువు ఉండటం, సోమవారం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండటం, మరో వైపు అభ్యర్థులను ఇంత వరకు ప్రకటించక పోవడంతో నరాలు తెగే ఉత్కంఠతో కూటమి వర్గాలు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్. ఆ నాలుగు సీట్లు ఎవరికి ఇస్తారు? అనేదానిపైనే కంప్లీట్‌గా కూటమి వర్గాల కళ్లు అప్పగించి చూస్తున్నారు. ఒళ్లంతా చెవులు చేసుకొని వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈ నెలాఖరు నాటికి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలే. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పరుచూరు అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తి స్థానాలు మార్చి 29 నాటికి ఖాళీ కానున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం లోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది.
ఈ ఐదు స్థానాల్లో ఇప్పటికే ఒక స్థానం ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఒక స్థానం కేటాయించారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఐదు స్థానాల మీద చర్చించారు. అందులో ఒక స్థానం తన అన్న నాగబాబుకు కేటాయించాలని పవన్ కల్యాణ్ కోరిన మేరకు నాగబాబుకు స్థానం ఖరారైంది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. అనంతరం మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక నాలుగు స్థానాలు ఉన్నాయి. వీటికి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
ఓ పక్క కూటమి వర్గమైన జనసేన కోటా పూర్తి కావడం, బీజేపీ కోటా ఏమీ లేక పోవడంతో టీడీపీకే నాలుగు స్థానాలు కేటాయించనున్నారు. దీంతో నాలుగు స్థానాల కోసం తెలుగు తమ్ముళ్లు క్యూ కట్టారు. తమకే కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల చుట్టూ తిరుగుతూ, వారి ప్రసన్నం చేసుకుంటున్నారు. మరో సారి తమకే అవకాశం కల్పించాలని అశోక్ బాబు, దుర్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు. మరో వైపు ఆశావాహుల జాబితా చాంతాడంత ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు రాని వాళ్లు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
మాజీ మంత్రులు దేవినేని ఉమా, కేఎస్ జవహర్, పీతల సుజాత, పరసా రత్నం, మోపిదేవి వెంకటరమణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు పిఠాపురంకు చెందిన ఎస్‌విఎస్‌ఎస్ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న, వంగవీటి రాధా, కేఈ ప్రభాకర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, ఏఎస్ రామకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, సీనియర్ నాయకులు మహ్మద్ నజీర్, నాగూల్ మీరా వంటి వారు ఈ నాలుగు స్థానాల రేస్‌లో ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న, వంగవీటి రాధా, కేఈ ప్రభాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ నేత యనమల పేరు ఎక్కడా వినిపించక పోవడం కూడా ఒక చర్చగా మారింది. సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేస్తారా? లేదా ప్రాంతాల వారీగా అవకాశం కల్పిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Next Story