తిరుపతి ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రపంచ పర్యాటక స్థలాల్లో ఒకటి. చారిత్రిక ప్రాశస్త్యం, నేపథ్యం కలిగిన ఈ ఆధ్యాత్మిక రాజధాని రాజకీయ రణ రంగానికి కేంద్ర బిందువు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
ప్రపంచ ఆధ్యాత్మిక చిత్రపటంలో చెరగని సంతకం తిరుపతి శాసనసభ స్థానం. ఏకచత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ పాలకులకు దీటుగా రాజకీయ చైతన్యానికి తెరతీసిన యుగపురుషులకు కూడా నెలవు కావడంతో తిరుపతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఏర్పడింది.
డీలిమిటేషన్ ఆర్డర్స్ 1951ప్రకారం ఏర్పడిన తిరుపతి నియోజకవర్గానికి 15 సార్లు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అనేకమంది చరిత్రపుటల్లో నిలిచారు.
ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో ప్రస్తుతం 270,762 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఎవరు పోటీ చేస్తారు? ఎవరు విజయం సాధిస్తారు? అనేది చర్చనియాశం.
వెండితెర నుంచి ...
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. ప్రముఖసినీ నటుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తిరుపతిలో ఒకసారి విజయం సాధించారు. గతంలో.. తిరుపతిలో రెండు సార్లు గెలిచిన నాదముని రెడ్డి, పుత్తూరులో ఒకసారి గెలిచిన రెడ్డివారి రాజశేఖరరెడ్డి తండ్రి.. కొడుకులు. రెండు సార్లు తిరుపతిలో గెలిచిన అగరాల ఈశ్వరరెడ్డి కొద్ది కాలం శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. టిడిపి.. ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు సినీ రంగం నుండి వచ్చిన వారే. తొలి సారి తిరుపతి నుండి పోటీ చేసిన వారే కావటం విశేషం.
రాజకీయ చరిత్ర పుటల్లో..
తిరుపతి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయిదు సార్లు, వైసిపి ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఇక్కడి నుండి విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో.. ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేసారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి గెలుపొందారు.
రాజకీయ ఔదార్యం
2014 ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి నియోకవర్గంలో మొత్తం 2,90,107 ఓట్లు ఉండగా, అందులో 1,71,507 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుంచి పోటీ చేసిన వెంకటరమణకు 99,313 ఓట్లు రాగా, వైసిపి నుంచి పోటీ చేసిన కరుణాకరరెడ్డికి 57,774 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థి వెంకటరమణ 41,539 ఓట్ల మెజార్టీతో గెలపొందారు. అయితే, ఎన్నికైన కొద్ద కాలానికే వెంకటరమణ అనారోగ్యంతో మరణించారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ టిడిపి నుంచి పోటీ చేసారు. వైసిపి పోటీ పెట్టలేదు. కాంగ్రెస్ అభ్యర్థిపై సుగుణమ్మ 1,16,524 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
నిలిచేది ఎవరు
అధికార వైయస్సార్సీపి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన తనయుడు, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిని ఆ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది.
వీరి ఏలుబడిలో అభివృద్ధి బాటలో తిరుపతి కాస్త మెరుగులు దిద్దుకుంది. తిరుపతికి ఫ్లై ఓవర్లు వేయడంతో పాటు విస్తరించిన నగరానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలులో స్మార్ట్ సిటీ నిధులతో కొత్త రోడ్లు వేశారు. అయితే నిధుల వినియోగంలో ఆశ్రితపక్షపాతం, అవినీతి అక్రమాలు జరిగాయని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి నగరంలో ప్రధాన రహదారులు నిర్మించే టీటీడీ నిర్వహణ బాధ్యతలు మున్సిపాలిటీ అప్పగించింది. ఈ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అయితే తిరుపతి శివార్లలో కొత్తగా నిర్మించిన రోడ్లలో కోట్లాది రూపాయలు స్వాహా చేయడంతో పాటు మాస్టర్ ప్లాన్ అమలులో, ఇళ్ల కూల్చివేతలో వివక్షత చూపించారనేది బహిరంగ ఆరోపణ. కేటీఆర్ బాండ్లు జారీ చేయడంలో కూడా భారీ కుంభకోణం జరిగిందనేది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం శ్రీనివాసులురెడ్డి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. భూ అక్రమణలో కూడా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు వీర విహారం చేశారని ఆరోపిస్తున్నారు.
తనయుడి కోసం..
భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే గానే కాకుండా టిటిడి చైర్మన్‌గా కూడా బాధ్యత వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా నాన్చుడు ధోరణిలో ఉన్న టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడం, టీటీడీ అటవీశాఖ కార్మికులకు మేలు చేయడం వంటి కార్యక్రమాలతో తన తనయుడు అభినయ రెడ్డి విజయం కోసం పాట్లు పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు తిరుపతి నగర డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి ‘భూ బాధితుల ఆత్మీయ సమావేశం నిర్వహించగలరా? అని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ నాయకుడు కిరణ్ రాయల్ ప్రశ్నించారు.
టీడీపీకా... జనసేనకా..
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినా నియోజకవర్గాల కేటాయింపు పూర్తి కాలేదని సమాచారం. దీంతో ఆ రెండు పార్టీల నుంచి ఏ పార్టీ వారు ఇక్కడ పోటీ చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తిరుపతి నియోజకవర్గంలోని 2,70,762 ఓటర్లలో సగం వంతు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఈ సీటు తమకంటే తమకు కేటాయించాలని తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు ఇక్కడ నుంచి పట్టుబడుతున్నారు.
జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే చదవవాడ కృష్ణమూర్తి సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఈ పార్టీ నుంచి పోటీ చేసినా 5 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సీటును జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆశిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్. సుగుణమ్మ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. అలాగే ఒకరిద్దరూ టికెట్ రేసులో ఉన్నప్పటికీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో కుదరని ఏక అభిప్రాయం వల్ల ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది తేలలేదు. అందుకోసం ఈనెల ఆఖరులో విడుదలయ్యే రెండో జాబితా వచ్చేవరకు వేచి చూడక తప్పదు.
Next Story