ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల పార్లమెంట్ కు త్రిముఖ పోటీ జరగనుంది. ముగ్గురూ ఉద్దండులే.


బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతం రాజకీయ చర్చకు వేదికైంది. వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో విజయం సాధించిన నందిగం సురేశ్ ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలోకి దూకింది. శుక్రవారం టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో బాపట్ల టీడీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టి కృష్ణప్రసాద్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంను పోటీలోకి దించేందుకు సిద్ధమైంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

నందిగం సురేశ్ వైఎస్సార్సీపీలో ఒక సామాన్య కార్యకర్త. ఈయనను అందనంత ఎత్తుకు వెళ్లేలా వైఎస్ జగన్ చేశారని అందరూ చెబుతుంటారు. ఈ విషయాన్ని సురేశ్ కూడా అంగీకరించారు. అమరావతి ఉద్యమంలో ప్రభుత్వానికి అనుకూలంగా పాల్గొన్నందుకు సురేశ్ కు ప్రభుత్వం ఈ నజరానా గత ఎన్నికల్లో ప్రకటించింది. అయితే తిరిగి సురేశ్ కే టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటన వెలువడటంతో వైఎస్సార్సీపీ వర్గాల్లోనూ ఒకింత చర్చ నడిచింది. సురేశ్ ను ఇడుపులపాయ తీసుకెళ్లి ఆయన చేతనే పార్లమెంట్ అభ్యర్థుల జాబితా చదివించారు వైస్ జగన్. అప్పుడే సురేశ్ కళ్లు చెమర్చాయి. తిరిగి నాకే టిక్కెట్ ఇస్తారని భావించలేదు. అయితే టిక్కెట్ వచ్చిందని చెప్పారు. జగనన్నను ఎవరైనా నమ్ముకుంటే వారికి అన్యాయం చేసే అవకాశమే లేదన్నారు.

తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుండి తెలంగాణ కేడర్ కు చెందిన రిటైర్డ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరును ప్రకటించింది. కృష్ణప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పోలీస్ అధికారిగా పనిచేశారు. మావోయిస్టులతో ఎక్కువగా తలపడిన సంర్భాలు ఉన్నాయి. అయితే ఆయన తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరి తెలంగాణ రాష్ట్రంలో సీటు కోసం ప్రయత్నించారు. వరంగల్ నుంచి సీటు ఇస్తామని చెప్పిన బీజేపీ వారు సీటు ఇవ్వలేదు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. బీజేపీ వారు చెప్పి చంద్రబాబుతో సీటు ఇప్పించారని కొందరు చెబుతుంటే అదేమీ కాదని, చంద్రబాబుతో కృష్ణప్రసాద్ కు ఉన్న సాన్నిహిత్యంతోనే సీటు వచ్చిందంటున్నారు. ఏమైనా బాపట్ల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.

జెడీ శీలం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బాపట్ల బరిలోకి దిగనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇప్పటికే అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అయితే సీట్లకోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో అందరితో పాటు శీలం కూడా తనకు బాపట్ల టిక్కెట్ కావాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జేడీ శీలం బాపట్ల నుంచి పోటీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అవసరమైన మేరకు డబ్బులు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. జేడీ శీలం లాంటి వాళ్లకు పార్టీ అధిష్టానమే ఖర్చుపెట్టుకునే విధంగా ఆలోచనలు చేశారు. ఈయనతో పాటు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు కొప్పుల రాజు కూడా శీలం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. కర్నాటక క్యాడర్ కు ఎంపికయ్యారు. ఆ తరువాత వీఆర్ఎస్ తీసుకున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికై మంత్రిగా పనిచేశారు. ఆయన వివిధ పార్లమెంట్ కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. జేడీ శీలం కాంగ్రెస్ పార్టీలో బాగా గుర్తింపు ఉన్న వ్యక్తి. గతంలో ఒకసారి బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన మాల కమ్యునిటీకి చెందిన వారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న నందిగం సురేశ్, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కృష్ణప్రసాద్ మాదిగా కమ్యునిటీకి చెందిన వారు. జేడీ శీలం ఎవరి ఓట్లు చీలుస్తారనే దానిపైనే చర్చ సాగుతున్నది. గెలుపు టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story