గురజాల నియోజక వర్గంలో టఫ్‌ ఫైట్‌. యరపతినేని.. కాసు మహేష్‌రెడ్డిల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ.


జి. విజయ కుమార్

గురజాల అసెంబ్లీ నియోకవర్గంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలదే పైచేయి. ఈ వర్గాల వారు ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరితో పాటు వైశ్య, బీసీలను గెలిపించిన ఘనత కూడా ఇక్కడి ఓటర్లకు ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఎక్కువసార్లు గెలిచాయి. పూర్వపు రోజుల్లో కృషికార్‌ లోక్‌ పార్టీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించిన ఘనత కూడా ఇక్కడి ఓటర్లదే. ఇప్పటి వరకు ఎవరు గెలిచినా భారీ మెజారిటీ అంటే 24వేల లోపులో మాత్రమే ఉంది. 1978లో కాంగ్రెస్‌ ఐ నుంచి గెలిచిన జి మల్లికార్జునరావు 23,248ఓట్ల మెజారిటీ, 1989లో కాంగ్రెస్‌ ఐ తరపున గెలిచిన కె వెంకటనర్సిరెడ్డికి 23,145ఓట్ల మెజారిటీ, 1994లో గెలిచిన టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు 23,967ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తరువాత మొదటి సారిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2019లో గెలిచిన కాసు మహేష్‌రెడ్డికి 28,613 ఓట్ల మెజారిటీ వచ్చింది. బీసీ నాయకుడైన జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్‌ ఐ తరపున పోటీ చేసి 1999లో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై కేవలం 131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే 2004లో యరపతినేని శ్రీనివాసరావును 8,343 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా పరిశీలిస్తే గెలుపు సాధించిన వారంతా తక్కువ ఓట్లతో గెలిచిన వారే కావడం విశేషం.
రెడ్డి వర్సెస్‌ కమ్మ..
మేలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గురజాల నియోకజవర్గంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య పోటీ జరుగుతోంది. ఈ రెండు సామాజిక వర్గాలే ఓటర్లను నియోకవర్గంలో ప్రభావితం చేయగలుగుతున్నాయి. పోటీ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంటుందని ఓటర్లు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా రంగంలోకి దిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పోటీ చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి విద్యా సంస్థల అధినేత తియ్యగూర యల్లమందారెడ్డి పోటీకి దిగారు. త్రిముఖ పోటీ జరిగినా గెలుపు ఓటములు టీడీపీ, వైఎస్సార్‌సీపీ మద్యనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ..
రెండు పార్టీల్లో ఏ పార్టీ నాయకుడు గెలిచినా తక్కువ మెజారిటీ మాత్రమే వుంటుంది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో కాసు మహేష్‌రెడ్డికి వచ్చిన మెజారిటీనే అత్యధిక మెజారిటీ. ఇప్పటి వరకు ఈ సంఖ్యను మించి మెజారిటీ ఎవ్వరూ సాధించలేదు. అయితే వైఎస్సార్‌సీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గండిపడే పరిస్థితులు కనిపిస్తున్నట్లు నియోపకవర్గంలోని పలువురు ఓటర్లు చెబుతున్నారు. యరపతినేని శ్రీనివాసరావు ఓటమి పాలైనా ఐదేళ్లుగా ప్రజల మధ్యనే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహేష్‌కు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో జంగా ఇటీవల టీడీపీలో చేరారు. బీసీల ఓట్లు వైఎస్సార్‌సీపీ నుంచి కొంతవకు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాసు మహేష్‌రెడ్డికి స్థానిక నాయకుల మద్ధతు కూడా గత ఎన్నికల్లో మాదిరి లేదనేది పార్టీ వర్గాల వారు చెబుతున్న మాట. ఇదే నిజమైతే కాసు మహేష్‌రెడ్డి ఏటికి ఎదురీదాల్సిందే. యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. కాసు మహేష్‌రెడ్డిది రాజకీయ కుటుంబం అయినా మొదటి సారి గెలిచారు. నర్సరావుపేట సొంత నియోజకవర్గం కాగా గురజాలను వైఎస్‌ జగన్‌ మహేష్‌రెడ్డికి కేటాయించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి వారసునిగా మహేష్‌రెడ్డికి పేరు ఉన్నా రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి మత్తతు లభించడం లేదు. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నుంచి సుమారు 50 శాతం మద్దతు కాసు మహేష్‌రెడ్డికి లభించింది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ సామాజికవర్గంలో సుమారు 80 శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావం గురజాల లాంటి నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
Next Story