ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీల నేతలు ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు.


ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీకి బలం ఉంది. కూటమికి బలం పెరుగుతూ వస్తోంది. ఖాళీ ఏర్పడిన ప్రతి ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. రాజ్య సభకు జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ లు ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి వైఎస్సార్ సీపీ తప్పుకుంది. పోటీ చేయడం లేదు. అదే విధంగా సీపీఐ కూడా తమ అభ్యర్థులను పోటీ చేయించడం లేదు. సీపీఎం మాత్రం రంగంలోకి దిగింది. తెలుగుదేశం కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

కూటమికే గెలుపు అవకాశాలు

ఏపీలో ప్రస్తుతం రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రంగంలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారం దాదాపు పూర్తయిదని చెప్పొచ్చు. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడంలోనూ ముందున్నారు. ముఖ్య నాయకులు, సంఘాల వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడక్కడ డిన్నర్, లంచ్ పార్టీలు ఏర్పాటు చేసి ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. నియోజకవర్గాల్లో ఓటర్లను స్థానిక ఎమ్మెల్యేలు కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కూడా సునాయాసమేననే ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఇప్పటికే అన్ని వర్గాల వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి రాజశేఖర్ కు ఓటు వేయాలని కోరుతున్నారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఏపీటీఎఫ్ నాయకుడు పాకలపాటి రఘువర్మ పోటీలో ఉన్నారు. పీఆర్టీయూ తరపున మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని ఓటర్లు చెబుతున్నారు. రఘువర్మను బలరుస్తున్నట్లు జనసేన, తెలుగుదేశం, బీజేపీలు ఇప్పటికే ప్రకటించాయి. ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయ వర్గం చెబుతోంది.

సీపీఐ మద్దతు కూటమి అభ్యర్థులకే..

సీపీఐ మద్దతు కూటమి అభ్యర్థులకేనని స్పష్టమైంది. కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎం కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ చేసిన ప్రతిపాదనను సీపీఎం తోసిపుచ్చింది. దీంతో సీపీఐ వారు అనధాకారికంగా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సీపీఎం ఒంటరి పోరు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తిరిగి ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగానే పోటీ చేసి ఇక్కడ విజయం సాధించారు. సీపీఎం, యూటీఫ్ నాయకులు బలపరిచిన అభ్యర్థిగా లక్ష్మణరావు పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి డివి రాఘవులు కూటమి అభ్యర్థికి పోటీ ఇస్తున్నారు. రాఘవులు అక్కడి కూటమి అభ్యర్థిని ఓడించగలిగే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సీపీఎం అభ్యర్థిగా కె విజయగౌరి ని రంగంలోకి దించారు. ఆమె యూటిఎఫ్ నాయకురాలు. పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. విజయగౌరి ఉపాధ్యాయ వర్గాల్లో నోటెడ్ కాలేదని పలువురు అంటున్నారు.

పోటీకి దూరంగా వైఎస్సార్సీపీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేయడం లేదు. కారణాలు ఏమైనా పోటీ నుంచి తప్పుకోవడతో కూటమి అభ్యర్థులకు అవకాశాలు కలిసొచ్చాయి. కూటమి గెలుపు అవకాశాలకు కూడా వైఎస్సార్సీపీ పోటీ చేయకపోవడమే ప్రధాన కారణమని పలువురు భావిస్తున్నారు. కనీసం తన వర్గాన్ని కాపాడుకోవడానికైనా పోటీ చేసి ఉండాల్సిందని పలువురు నిరుద్యోగులు వ్యాఖ్యానించడం విశేషం.

ఓటర్లు ఎంత మంది అంటే..

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,46,529 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 416 పోలింగ్ స్టేషన్ ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. పోటీలో మొత్తం 30 అభ్యర్థులు ఉండగా రాజేంద్రప్రసాద్, లక్ష్మణరావుల మధ్యనే పోటీ ఉంటుంది.

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో 3,14,986 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,83,347 మంది పురుషులు కాగా, 1,31,618 మంది స్త్రీలు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండర్స్ ఓటర్లుగా ఉండటం విశేషం. ఈ నియోజకవర్గంలో 456 పోలింగ్ స్టేషన్ ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి.

ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీ మాత్రం ప్రధానంగా ఇద్దరి మధ్యనే జరిగే అవకాశం ఉంది. రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు మధ్య ఈ పోటీ ఉంటుంది.

ప్రలోభాలు

ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి అభ్యర్థులు తాయిలాలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరికి గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేస్తున్నారని, డిన్నర్లు, లంచ్ పార్టీలు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన వారికి గిఫ్ట్ లు ఇస్తున్నారని సీపీఎం వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం దురదృష్ణ కరమని సీపీఎం నాయకులు వ్యాఖ్యానించారు.

Next Story