టీటీడీకి బయటి వారు ఇస్తున్న ధరకు ఏపీ వారు నెయ్యి సరఫరా చేయలేక పోతున్నారు. తక్కువ ధరకు నాణ్యతతో కూడిన నెయ్యి ఎలా సరఫరా చేయగలమని ప్రశ్నిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో బోలెడన్ని సహకార డెయిరీలు ఉన్నాయి. నాణ్యమైన నెయ్యి తయారయ్యేది ఏపీలోనేనని ఎంతో మంది ప్రశంశించిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నాయి. అయితే ఆవు నెయ్యితో పాటు గేదె నెయ్యి కూడా ఎక్కువగా తయారవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ఆవు పాలు ఎక్కువ వస్తాయి. కోస్తా ప్రాంతంలో గేదెపాలు ఎక్కువగా పాల సేకరణ కేంద్రాలకు వస్తాయి. నాటు గేదెలు తక్కువ పాలు ఇస్తాయి. ఆ పాల నుంచి నాణ్యమైన నెయ్యి వస్తుందని ఎంతో మంది కొనుగోలు చేసిన వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గతంలో అమ్మ డెయిరీకి లక్ష లీటర్లపైన పాలు వచ్చేవి. ఈ పాలలో ఎక్కువగా గేదెపాలు ఉంటాయి. ఆవుపాలు చాలా తక్కువ. 12 ఏళ్ల క్రితం ఒంగోలు డెయిరీలో పాలపొడి ఫ్యాక్టరీ పెట్టేందుకు బెంగుళూరు నుంచి యంత్రాలు కూడా తెప్పించారు. ఆ తరువాత ఈ డెయిరీ మూతపడింది. చిత్తూరు డెయిరీ కూడా లక్షల లీటర్ల పాలు సేకరించే వారు. ఆ డెయిరీ కూడా మూతపడింది. ఇందుకు పాలకుల విధానాలే కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గేదెపాలు, ఆవుపాల సేకరణ వేరువేరుగానే జరుగుతుంది..
ఏపీలో పాల సేకరణలో ఆవుపాలు వేరుగా, గేదెపాలు వేరుగా సేకరిస్తారు. ఆవుపాల ధర వేరుగా, గేదెపాల ధర వేరుగా ఉంటుంది. అందువల్ల పాల సేకరణ వేరుగానే ఉంటుంది. అలాంటప్పుడు స్వచ్ఛమైన ఆవు పాల నుంచి వచ్చిన వెన్నను ఏపీ డెయిరీ వారు టీటీడీకి సరఫరా చేయొచ్చు. అయితే టీటీడీ టెండర్లలో పాల్గొన్నా వేరే రాష్ట్రాల వారు సరఫరా చేసే ధరకు ఏపీ వారు సరఫరా చేసే అవకాశం లేదని పలు డెయిరీల వారు చెబుతున్నారు.
ఈ డెయిరీలు ఎందుకు మూత పడ్డాయి
రాష్ట్రంలో చాలా సహకార డెయిరీలు మూతపడ్డాయి. ఇందుకు పాలకుల విధానాలే కారణాలని చాలా మంది పాడి రైతులు చెబుతున్నారు. ఎవరికి వారు తమకు సంబంధించిన డెయిరీలకు పాలు తీసుకునేందుకు ప్రభుత్వ రంగంలో ఉన్న డెయిరీలను దెబ్బతీశారనేది బహిరంగ రహాస్యం. తెలుగుదేశం పార్టీ హయాంలో సహకార డెయిరీలను కంపెనీ చట్టం కిందకు మార్చారు. దీంతో పాలక వర్గాలు వారి ఇష్టానుసారం చేసి నష్టాల్లోకి వెళ్లిన తరువాత ఆ డెయిరీలు మూసి వేశారు. చిత్తూరు డెయిరీ, ఒంగోలు డెయిరీల పరిస్థితి ఇదే. సంగం డెయిరీ మాత్రం చావు బతులకుల మధ్య ఉంది. ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకుమార్‌ దీనికి జీవం పోశారని చెప్పొచ్చు.
టీటీడీ నెయ్యి టెండర్లలో సహకార మిల్క్‌ డెయిరీలు ఎందుకు పాల్గొనటం లేదు?
ఏపీ నుంచి సహకార పాల డెయిరీలు టీటీడీకి నెయ్యి సప్లై చేసేందుకు టెండర్లలో పాల్గొనవచ్చు. కానీ వారు పాల్గొనటం లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. కేవలం ఆవుపాలు ప్రత్యేకంగా సేకరించి ఆ పాల నుంచి నెయ్యిని ప్రత్యేకంగా తయారు చేసే క్రమంలో ఖర్చులు ఎక్కువవుతున్నట్లు చెబుతున్నారు. ఆవు నెయ్యి ఒక కేజీ తయారు కావాలంటే 25 లీటర్ల పాలు ఉపయోగించాల్సి వుంటుంది. ఆవు పాలలో మూడు నుంచి నాలుగు శాతం ప్యాట్‌ ఉంటుందని కొందరు పాల ఉత్పత్తిదారులు తెలిపారు. ఆవు పాలలో 99 శాతం నెయ్యి ఉంటుందని, ఒక శాతం నీరు ఉండే అవకాశం ఉందని కొందరు అధికారులు తెలిపారు. ఆవు పాల నుంచి నెయ్యి తీసిన తరువాత స్కిమ్‌ మిల్క్‌ వస్తుందని, ఈ పాలను లీటరు రూ. 15 లకు అమ్ముతామని అధికారులు వివరించారు. అన్ని ఖర్చులు కలుపుకుని ఒక కేజీ ఆవు నెయ్యి తయారు చేసేందుకు రూ. 500లు తక్కువ కాకుండా ఖర్చు అవుతుందని, అలాంటప్పుడు ఏపీ నుంచి నెయ్యి టీటీడీ ధరకు ఇచ్చే అవకాశమే లేదని పేరు చెప్పేందుకు అంగీకరించని ఏపీ డెయిరీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ధర గిట్టుబాటు కావడం లేదు
ప్రత్యేకించి ఆవు నెయ్యిని ప్రత్యేకంగా తయారు చేయాలంటే పాలు వేరువేరుగా సేకరించాల్సి వుంటుంది. సేకరించిన పాల నుంచి నెయ్యిని వేరు చేసిన తరువాత అయ్యే ఖర్చులు చూస్తే కనీసం కేజీ నెయ్యి రూ. 800 ల వరకు పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కూడా కేజీ నెయ్యి రూ. 800పైనే అమ్ముతున్నారు. జిఆర్‌బి నెయ్య కేజీ రూ. 844లుగా ఉంది. ఈ నెయ్యి తమిళనాడు లోని హోసూరులో తయారవుతోంది. ఏపీలో కూడా విక్రయాలు జరుగుతున్నాయి. నిజానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెన్నతీసి నిల్వ ఉంచి నెల తరువాత కాచి వడపోస్తే వచ్చే నెయ్యి కేజీ రూ. 1,000ల వరకు పడుతుందని కొందరు పాల ఉత్పత్తి దారులైన రైతులు చెబుతున్నారు.
ఉదాహరణకు వేరు శనగ నూనె ఒక కేజీ తయారు చేయాలంటే మూడు కేజీల వేరు శనగ గింజలు మిషన్‌లో వేయాల్సి ఉంటుంది. మూడు కేజీలకు వచ్చే నూనె ఒక కేజీ అంటే కేజీ నూనె రూ. 350లు పడుతుంది. కానీ మార్కెట్లో నూనె రూ. 120లకే అందుబాటులో ఉంటున్నాయి. నెయ్యి పరిస్థితి కూడా అలాగే తయారైందని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన నారు వెంకటరెడ్డి అనే పాల ఉత్పత్తి దారు మాట్లాడుతూ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ రూ. 1,000పైనే ఉంటుందన్నారు.
పాల సేకరణ కేంద్రాల చైర్మన్‌లు ఎందుకు మాట్లాడటం లేదు
విశాఖ డెయిరీ, విజయ డెయిరీ, సంగం డెయిరీలు సహకార రంగంలో ఉన్నవే. ఈ డెయిరీ చైర్మన్‌లు నోరు మెదిపేందుకు అంగీకరించడం లేదు. మీరు మీ డెయిరీల నుంచి నెయ్యి టీటీడీకి సరఫరా చేసేందుకు ఎందుకు టెండర్లలో పాల్గొనడటం లేదని ప్రశ్నిస్తే మమ్మల్ని ఇప్పుడేమీ అడగొద్దు. మేము ఈ విషయంలో ఏమీ మాట్లాడలేమని సమాధానం చెబుతున్నారు. ఏకంగా విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు నాకు ఏమీ తెలియదని సమాధానం చెప్పడం విశేషం. సహకార సంఘాలను రాజకీయ రంగంగా చూస్తున్నారే తప్ప ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యంగా చూడటం లేదు. ఇందువల్ల ఈ సంఘాలు దెబ్బతింటున్నాయనేది పలువురి వాదన.
నాణ్యతలోపం ఉండే అవకాశం ఉంది
టీటీడీకి సరఫరా జరుగుతున్న నెయ్యిలో నాణ్యత లోపం ఉండే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌ అన్నారు. ఆయన ఫెడరల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ అధికారులు చెబుతున్న ప్రకారం కేజీ నెయ్యి తయారు కావడానికి 25 కేజీల పాలు వాడాల్సి ఉంటుందని, వెన్న తీసిన పాలను బయట అమ్మాలంటే లీటరు రూ. 15లకు మాత్రమే అమ్మాల్సి ఉంటుందన్నారు. అన్ని ఖర్చులు కలుపుకుని ఒక కేజీ నెయి తయారుకు కనీసంగా రూ. 600లు అవుతుందని, అలాంటప్పుడు రూ. 325లకు కేజీ నెయ్యి ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ఎన్‌డీడీబీ రిపోర్టు ప్రకారం కూడా తప్పులు జరిగే అవకాశం ఉందని చెప్పినందున అందరూ కోరుతున్నట్లు సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని అన్నారు.
Next Story