జనసేనతో పోల్చుకుంటే ఏపీలో టీడీపీ పెద్ద పార్టీ. వైఎస్సార్ సీపీ నుంచి వలసలు జనసేన వైపు మళ్లాయి. ఎందుకు? ఏమిటా మతలబు?
జనసేన పార్టీలో చేరేందుకు వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన నేతలు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? దీని వెనుక ఏముంది? పదేళ్ల క్రితం జనసేన ఆవిర్భవించినప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు జనసేన పార్టీని పెద్దగా పరిణగలోకి తీసుకోలేదు. జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేసే బలం తమకు లేదని నాడు చెప్పారు. అయితే 2019లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న పవనల్ కళ్యాణ్ 137 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు. ఆ ఒక్క స్థానం తూర్పు గోదావరి జిల్లా రాజోల్. ఎమ్యెలేగా గెలిచిన వ్యక్తి రాపాక వరప్రసాద్. చివరకు ఆయన కూడా మిగల్లేదు. వైఎస్‌ఆర్‌సీపీ పంచన చేరారు.
పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడి పోవడంతో ఆయనను పట్టించుకునే వారు లేకుండా పోయారు. చాలా చోట్ల జరిగిన సమావేశాల్లో తనను గెలిపించ లేదనే ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. అలాంటిప్పుడు ఒంటరిగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యులందరికీ చెప్పి టీడీపీతో జనసేన జట్టు కట్టాల్సిందేనని పార్టీ ముఖ్యులను కార్యోన్ముఖులను చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉండటంతో టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు తక్కువుగానే ఉంటాయని, బీజేపీతో ఉండటం వల్ల మనం ఆయన వైపు మొగ్గు చూపడం వేస్టని ఎన్నికల ముందు జనసేనలోకి చేరాలనుకునే వారు వెనక్కి తగ్గారు. తర్వాత పొత్తులు ఖారారు కావడంతో జనసేనలో కూడా సీట్ల కోసం పోటీ పడ్డారు. పోటీ చేసిన అన్ని సీట్లల్లోను టీడీపీ, బీజేపీ మద్దతుతో జనసేన 100 శాతం విజయం సాధించింది.
కాపు పార్టీగా పేరు పడ్డ జనసేన గత ఎన్నికల్లో ఎక్కువ మంది కాపులకే ఎమ్మెల్యే సీట్లను కేటాయించింది. రిజర్వేషన్ సీట్లు ఎలాగూ ఆ వర్గాలకు ఇవ్వక తప్పలేదు. కోస్తా, ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు పొత్తులో జనసేన దక్కించుకుంది. ఇక్కడ రాజకీయాల్లో ఎక్కువ మంది కాపులు ఉన్నందున వారికి ప్రయారిటీ ఇవ్వక తప్పలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చే వారిని నేరుగా టీడీపీలోనే చేర్చుకుంటే పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యత లేకుండా చంద్రబాబు చేస్తున్నారనే చర్చ జరిగే అవకాశం ఉందని, జనసేన టీడీపీ వ్యూహంలోనే భాగంగానే వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చే వారిని జనసేనలో చేర్చుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అంతర్గతంగా ఒప్పందంలో భాగంగానే జరిగిందా? లేదా? అనేది రెండు పార్టీల్లో ఏ వర్గం నుంచి కూడా బయటకు పొక్కలేదు.
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరేందుకు ఏ నియోజక వర్గం వారు ముందుకొచ్చినా, ఆ నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరాలనుకునే వారు రెడ్డి లేదా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు ఎక్కువుగా ఉన్నారు. అందువల్ల పార్టీ చేరికల విషయంలో ఎక్కువ పొరపుచ్చాలు వస్తున్నాయని భావించిన చంద్రబాబు పార్టీలో చేరాలనుకునే వారికి షరతులు విధించారు. తమ పదవులకు రాజీనామాలు చేసి పార్టీలో చేరాలని ప్రకటించారు. కొంత మందికి ఇది కూడా ఇబ్బందిగా మారింది. అందువల్ల టీడీపీ వైపు మొగ్గు చూపకుండా వెనకడుగు వేస్తున్నారని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. 2014లో టీడీపీ గెలిచినప్పుడు తగిన మెజారిటీ ఉన్నా చంద్రబాబు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆ ప్రభావం వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయామని, ఇప్పుడు పార్టీలోకి వచ్చే వారిని ఆలోచించకుండా తీసుకుంటే అనర్థాలకు దారి తీసే అవకాశం ఉందని, చంద్రబాబు కొత్తగా చేరే వారికి అవకాశం పెద్దగా ఇవ్వనందున జనసేన వైపు చూస్తున్నట్లు చర్చ సాగుతోంది.
రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌సీపీ కంటే జనసేన పార్టీకే భవిష్యత్ ఉంటుందనే ఆలోచనల్లో కూడా కొంత మంది వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పరిపాలన అనుభవం లేక పోయినా చంద్రబాబు చొరవతో మంచి పాలనా దక్షత వైపు అడుగులు వేస్తున్నారని, పార్టీలోని నాయకులను, కార్యకర్తలను తక్కువ చేయకుండా తగిన గుర్తింపు ఇస్తున్నారనే ఆలోచనలతో కూడా కొందరు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Next Story