Magunta Srinivasulu Reddy, MP

ఏపీలో ఒంగోలు ఎంపీ మాగుంటకు సీటెందుకు ఇవ్వలేదో సహేతుకమైన కారణం చెప్పలేకపోయింది వైఎస్సార్‌సీపీ. ఇప్పుడు దీనిపైనే జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.


మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్‌ పొలిటీసియన్‌. ఆయన ఒంగోలు వేదికగా మొదటి నుంచీ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఒంగోలు నుంచే పోటీ చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలవంతుడు. ఒంగోలు పార్లమెంట్‌ సిట్టింగ్‌ ఎంపీ. అయినా వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వలేదు. కారణాలు చెప్పలేదు. ఒంగోలు నుంచి పార్లమెంట్‌ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని రంగంలోకి దింపేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వాసూ.. నువ్వు ఒంగోలు నుంచి పోటీ చేస్తావా.. తప్పుకుంటావా.. మిగిలిన విషయాలు వదిలెయ్‌ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)కి చెప్పడం విశేషం. మాగుంటకు తిరిగి సీటు కేటాయించకపోవడానికి కారణాన్ని ఎందుకు ప్రజలకు చెప్పలేదు. ఏమిటి అందులో ఉన్న మర్మం. మాగుంట ఎంత ప్రయత్నించినా మాట్లాడేందుకు కూడా సీఎం జగన్‌ సుముఖత ఎందుకు చూపలేదు.

విమర్శలు చేయలేదనేనా..
మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై విమర్శలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని, చంద్రబాబు, లోకేష్‌లపై రాజకీయ విమర్శలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఆదేశిస్తే తాను అలా చేయలేనని తప్పుకున్నందునే ఆయనకు సీటు ఇవ్వలేదనే ప్రచారం సాగింది.
మద్యం పాలసీకి సహకరించలేదనా..
మాగుంట మద్యం వ్యాపారం దేశవ్యాప్తంగా ఉంది. 11 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రధానంగా మద్యం వ్యాపారం ఉంది. మద్యం సప్లై గతంలో ఎక్కువగా ఏపీలోనూ ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నా ఆయన బాట్లింగ్‌ కంపెనీల్లో తయారు చేసే మద్యాన్ని ఏపీలో మాత్రం అమ్మలేదు. అందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలే కారణమనే ప్రచారం కూడా ఉంది.
కుమారుడు మద్యం కేసులో నిందితుడనా..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి నిందితునిగా ఉన్నారు. ఆయను సీబీఐ అరెస్ట్‌ చేసి విడుదల చేసింది. ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని కేసీఆర్‌ కుమార్తె కవిత చెప్పినట్లు నేను చేశానని చెప్పడంతో ఆయనకు బెయిల్‌ మంజూరు అయింది. ఆ కేసులో కుమారుడు నిందితునిగా ఉన్నందున సీటు దక్కలేదనే ప్రచారం కూడా సాగింది. కారణాలు ఏవైనా కావొచ్చు, ఈ కారణంగా మాగుంటకు సీటు ఇవ్వడం లేదని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసి ఉంటే ఆ ప్రభావం మాగుంటపైనే ఉండేది. సహేతుకమైన కారణం చెప్పడంలో వైఎస్సార్‌సీపీ విఫలం కావడంతో వైఎస్సార్‌సీపీని కూడా ప్రజలు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాగుంటకు సీటు ఇవ్వడం లేదని మాత్రమే స్పష్టం చేసింది. కారణం ఏమిటో తెలియక మాగుంట అభిమానులు అయోమయంలో పడ్డారు.
వ్యాపారాల రిత్యా ప్రజా ప్రతినిధిగా...
మాగుంట వ్యాపారాల రిత్యా తప్పకుండా పార్లమెంట్‌ సభ్యునిగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నందున ప్రభుత్వంలోని పెద్దలను అవసరాల రిత్యా కలవాలంటే తప్పకుండా ఒక పదవి అవసరం. పార్లమెంట్‌ సభ్యునిగా ఉంటే ప్రభుత్వంలోని పెద్దలను కలిసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఆయనకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వకపోయినా తిరిగి టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంట్‌ సీటు సంపాదించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని, ఈ గాలిలో ఎవరు పోటీ చేసినా గెలుపు అవకాశాలు వారికే ఉంటాయనే టాక్‌ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది.
నాలుగు సార్లు ఎంపీగా..
మాగుంట శ్రీనివాసులురెడ్డి 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఒంగోలు ఎంపిగా ఎన్నికయ్యారు. 2024లో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీలో సీటు దక్కలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు హామీ మేరకు ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికి నాలుగు సార్లు ఎంపీగా మాగుంట గెలిచారు. ఒక సారి ఎమ్మెల్సీ అయ్యారు. తిరిగి ఎంపీగా పోటీలోకి దిగారు. 1998, 2004, 2009, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలిచారు. వరుసగా ఆరుసార్లు ఒంగోలు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయగా 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరామ్‌పై ఒకసారి, 2014లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డిపై మరోసారి ఓటమి చెందారు. ఒంగోలు కేంద్రంగా మాగుంట కుటుంబం 1991లో రాజకీయాల్లోకి వచ్చింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్‌–ఐ తరపున పోటీ చేసి గెలుపొందారు. తరువాత జరిగిన పరిణామాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి మావోయిస్టుల కాల్పుల్లో ఒంగోలులోనే దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య మాగుంట పార్వతమ్మ 1996లో పోటీ చేసి ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచారు.
టీడీపీ గెలిచింది రెండు సార్లు మాత్రమే..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత మొదటిసారి 1984లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బెజవాడ పాపిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పులి వెంకటరెడ్డిని 18,143 ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తరువాత అంటే 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కరణం బలరామకృష్ణమూర్తి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డిపై 21,946 ఓట్ల మెజారిటీతో గెలవగలిగారు. టీడీపీ ఆవిర్భావం తరువాత పదిసార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఆరుసార్లు కాంగ్రెస్‌ పార్టీ, రెండు సార్లు వైఎస్సార్‌సీపీ గెలిచింది. వరుసగా ఆరుసార్లు పోటీచేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి 2014లో మాత్రమే టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. కొద్దిరోజుల్లోనే తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరడం విశేషం. మాగుంట ప్రయాణం దాదాపు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలోనే సాగింది. ప్రస్తుతం విధిలేని పరిస్థితుల్లో తిరిగి టీడీపీ కూటమిలో చేరి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు వైఎఆర్‌సీపీ తరఫున వైవిసుబ్బారెడ్డి ఎంపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ పోరులో వైవి సుబ్బారెడ్డి గెలుపొందగా మాగుంట ఓటమి చవి చూశారు. కొద్ది రోజుల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
Next Story