TTD STAMPEDE | చేతులు కాలాక చంద్రబాబు గర్జిస్తున్నారా!
నేను 2014 నాటి ముఖ్యమంత్రిని కాదు, నేనొక మాట చెబితే అది వెయిసార్లు చెప్పినట్టేనని చంద్రబాబు ఇటీవల కలెక్టర్లు, పోలీసు అధికారుల సమావేశంలో చెప్పారు.
‘భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట (TTD STAMPEDE) జరిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు.
నేను 2014 నాటి ముఖ్యమంత్రిని కాదు, నేనొక మాట చెబితే అది వెయిసార్లు చెప్పినట్టేనని చంద్రబాబు ఇటీవల కలెక్టర్లు, పోలీసు అధికారుల సమావేశంలో చెప్పారు. ఆ మాటల తడి ఆరకముందే తిరుపతిలో అధికారుల తాత్సారం, సహాయ నిరాకరణతో ఆరుగురు అమాయక భక్తుల ప్రాణాలు వైకుంఠానికి చేరాయి. చంద్రబాబు తరహా హెచ్చరికలు, విజ్ఞప్తులు సరిగా వర్కవుట్ అయిఉంటే పరిస్థితి ఇందాక వచ్చేది కాదని తిరుమల తొక్కిసలాట ఘటన రుజువు చేస్తోందని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుందని వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు తిరుపతిలో అధికారులను ఉద్దేశించి ఏమన్నారంటే...
"భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు?" అని TTD జేఈవో గౌతమిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్‌ల లభ్యత గురించి కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అంచనా ఉన్నా అధికారులు ఎందుకిలా?
వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులు.. సగటున 80 నుంచి లక్ష మంది వరకు భక్తులు తిరుమల శ్రీవారిని సందర్శిస్తారన్న అంచనా ఉంది. తిరుపతిలో 8 సెంటర్లు.. 90 కౌంటర్లు.. తిరుమలలో 4 సెంటర్లు, ఒక్కో కౌంటర్.. వెరసి 94 కౌంటర్లు.. సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు అన్ని రకాల ప్రివిలైజ్డ్ దర్శనాలను రద్దు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 3వేల మంది పోలీసులు, 1550 మంది టీటీడీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారని ప్రకటించింది టీటీడీ.
జనవరి 8.. టికెట్ల కోసం జనం తండోపతండలుగా గుమికూడుతున్నారు. పోలీసులు తమకు తోచిన రీతిలో భక్తుల్ని క్యూలోకి పంపుతున్నారు. ఈ పంపే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇప్పుడు దీనిపై విచారణ సాగుతోంది. ఎవరో ఒకర్ని బాధ్యుల్ని చేస్తారు. ఆ పై చర్యలంటారు. దాన్ని పక్కన బెడితే.. అసలు భక్తుల భద్రతకు ఏమేమి చేసి ఉండవచ్చుననే దానిపై చర్చ సాగుతోంది.
తిరుమల వంటి పవిత్ర ప్రదేశంలో భక్తులు భద్రతతో, శాంతియుతంగా దర్శనం చేసుకునే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని, టీటీడీ భక్తుల భద్రతకు పలు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని టీటీడీ భద్రతా విభాగంలో పని చేసిన ఓ మాజీ అధికారి అభిప్రాయపడ్డారు.
ఏమి చేసి ఉండాల్సింది
బ్యారికేడ్ల వ్యవస్థను మెరుగుపరచడం: క్యూలైన్లలో భక్తులు క్రమంగా వెళ్లేలా పటిష్ఠమైన బ్యారికేడ్ల ఏర్పాట్లు చేయాలి.
ప్రీ-బుకింగ్ విధానం: ముందస్తు టోకెన్ బుకింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడం ద్వారా భక్తుల సంఖ్యను నియంత్రించవచ్చు.
ఒకే చోట ఎందుకు ఉండాలి: టోకెన్ పంపిణీ కేంద్రాలను నగర వ్యాప్తంగా విభజించి, ఒక్కచోటే జనం పోగు కాకుండా చూడాలి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగమేమీ?
క్యూ నేజ్‌మెంట్ యాప్‌లు: భక్తులు ఆన్‌లైన్‌లో తమ సమయాన్ని తెలుసుకునేందుకు, వారి స్థానాన్ని ట్రాక్ చేయడానికి అనువుగా యాప్‌లను అందుబాటులోకి తీసుకురావాలి.
సీసీటీవీ మానిటరింగ్: టోకెన్ పంపిణీ కేంద్రాలు, దర్శన ప్రాంతాలు వంటి ప్రధాన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, భక్తుల కదలికలను పర్యవేక్షించాలి.
డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు: క్యూలైన్ తీరు తెన్నులను, వేళలను అంచనాలను చూపే డిజిటల్ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి.
తగిన సంఖ్యలో సిబ్బంది నియామకం
ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని నియమించి, వారు జనసందోహాన్ని క్రమంగా నిర్వహించేలా చేయాలి.
పోలీసు సమన్వయం: భక్తుల సంఖ్యను ఆధారంగా పోలీసు సిబ్బందిని నియమించడం, వారికి తగిన రక్షణ పరికరాలను అందించడం ముఖ్యం.
అత్యవసర వైద్య సేవలు
ప్రధాన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, అత్యవసర వైద్య సేవలు అందించాలి.
సీపీఆర్ శిక్షణ: భద్రతా సిబ్బందికి సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) వంటి ప్రాథమిక వైద్య శిక్షణ ఇవ్వడం అవసరం.
భక్తులకు అవగాహన...
సమాచార బోర్డులు: భక్తులు పాటించాల్సిన నిబంధనలను వివరిస్తూ ప్రతి ప్రాంతంలో స్పష్టమైన సమాచారం కల్పించాలి.
వేళల పట్టికలు: ప్రత్యేక ఈవెంట్ల సమయంలో దర్శన సమయాలను ముందుగానే ప్రకటించి, భక్తుల రద్దీని నియంత్రించవచ్చు.
భక్తులకు ప్రాథమిక భద్రత నియమాలు, వ్యవహార విధానం గురించి ప్రచారం చేయడం అవసరం.
బాధ్యత వహించే వ్యవస్థ..
భక్తుల రద్దీ నిర్వహణలో తలెత్తిన లోపాలను సమీక్షించే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి.
విధి నిర్వాహణ లోపాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటూ క్రమశిక్షణకు చర్యలు చేపట్టాలి.
విపత్తుల నిర్వహణ ప్రణాళిక
అత్యవసర పరిస్థితుల్లో భక్తులు సురక్షితంగా బయటపడేలా ప్రత్యేక మార్గాలను అందుబాటులో ఉంచాలి.
భక్తులకు వెంటనే సమాచారం అందించడానికి స్పీకర్ వ్యవస్థలు, లైటింగ్ సంకేతాలు ఏర్పాటు చేయాలి.
భక్తుల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావచ్చు. టీటీడీ, పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు ఈ చర్యలను వెంటనే అమలు చేయడం ద్వారా భక్తులకు భద్రత కల్పించవచ్చునని టీటీడీ మాజీ అధికారులు సలహా ఇచ్చారు.
Next Story