పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం
వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి, వాసంశెట్టి సుభాష్‌లను అప్పటికప్పుడు పార్టీలోకి చేర్చుకొని మంత్రి పదవులిచ్చారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీలో ఎంపీగా గెలిచి జగన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రఘురామకృష్ణంరాజుకు ఏకంగా టికెట్ ఇచ్చి గెలిపించి, డిప్యూటీ స్పీకర్‌ను చేశారు. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధిలు తమ కంటే ఎందులో గొప్ప అనే చర్చ కూడా ఆ పార్టీలో ప్రారంభమైంది. వాసంశెట్టి సుభాష్‌కు యువకుల కోటాలో మంత్రి పదవి దక్కి ఉండొచ్చు కానీ, ప్రభుత్వ నిర్వహణ వ్యవహారంపై కనీస అవగాహన లేదని, తాహశీల్దారు, కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌కు, ఆర్డీవోకు ఉన్న తేడా కూడా తెలియని వ్యక్తిని మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందనే విమర్శ కూడా ఉంది. పార్టీ సభ్యత్వ విషయంలో సుభాష్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయంపై చంద్రబాబు టెలీ కాన్పరెన్స్‌లో హెచ్చరికలు చేసి, మంత్రి పదవి ఊడిపోతుందని కూడా చెప్పారు. అలాంటి వ్యక్తితో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ, తమ వంటి సీనియర్ వ్యక్తులను ఎందుకు పక్కన పెట్టారనే అంశంపై చర్చ సాగుతూనే ఉంది.
తెలుగుదేశం పార్టీలో ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మినారాయణ, పరిటాల సునీత, గద్దె రామ్మోహన్‌రావు, తెనాలి శ్రావణ్‌కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నెట్టెం రఘురాం, నిమ్మకాయల చిన్నరాజప్ప, పితాని సత్యనారాయణ, దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, కిమిడి కళావెంకట్రావు వంటి ప్రధానమైన నాయకులు ఉన్నారు. వీరందరూ పార్టీలో సీనియర్లు. డెడికేటెడ్‌గా పార్టీలో పని చేశారు. ప్రభుత్వంలో తమకు పదవులు దక్కలేదనే ఆవేదన వారిలో ఉంది. మాటల్లో తప్ప, వారిని చేతల్లో బుజ్జగించిన సందర్భాల్లో చంద్రబాబు వద్ద కనిపించ లేదు. నామినేటెడ్ పోస్టుల్లో తమకు పదవులు దక్కుతాయని, కనీసం ప్రభుత్వంలో విప్ పదవులైనా వరిస్తాయని ఆశించారు. ప్రభుత్వంలో పదవులు దక్కలేదు సరికదా, పార్టీ నాయకులుగా కూడా వీరిని గుర్తించి గౌరవించే పని కూడా కనిపించ లేదు. ప్రస్తుతం వీరిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో మాత్రం పార్టీలో అటు నియోజక వర్గంలో కనీస మర్యాద దక్కిందని చెప్పొచ్చు. ఏ పదవి దక్కని వారిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇది పార్టీకి లాభమా? నష్టమా? అనే విషయాలు సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. నారా లోకేష్ ప్రభావం పార్టీపై ఎక్కువుగా ఉండటం వల్ల కూడా పార్టీలో వీరికి ప్రాధాన్యత దక్కలేదనే చర్చ కూడా ఉంది. తమకంటూ ఒక ప్రత్యేక టీమ్‌ను తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ తాను అనుకున్న వారికే పదవులిచ్చారని, ఎన్నికల్లో టికెట్లు కూడా ఆయన ఇష్ట ప్రకారమే ఇచ్చారనే చర్చ కూడా సాగుతోంది.
పార్టీలో సీనియర్లు భవిష్యత్‌లో ప్రభుత్వ పదవులు రాకపోయినా పార్టీ కోసం పని చేస్తారా? లేదా సర్థుకొని వచ్చే ఎన్నికల్లో వీరి ప్రభావం ఎలా ఉంటుందో చూపిస్తారా? అనేది పెద్ద చర్చగా మారింది. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోను మేనేజ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి సక్సెస్ అవుతారా? చివరకు ఫెయిల్యూరై తెలంగాణలో మాదిరి పార్టీని వదిలేస్తారా? అనేది కూడా చర్చగా మారింది.
పరిటాల సునీత సీనియర్ మహిళా నాయకురాలు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి సునీత భర్త పరిటాల రవి టీడీపీలో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు. తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లాలో తన నియోజక వర్గానికి సాటి లేదనిపించారు. ఆయన మరణ అనంతరం సునీత పార్టీలో, ప్రభుత్వంలో మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాకుండా కుమారుడికి సీటిచ్చి పార్టీ తప్పు చేసిందనే విమర్శ కూడా వచ్చింది. ఆ విమర్శను దిద్దుకునేందుకు 2024 ఎన్నికల్లో తిరిగి సునీతకే సీటిచ్చి, సీటు గెలుచుకునేలా పార్టీ చేసింది. ఎవరి ప్రమేయంతో పరిటాల సునీత గెలవగలిగారనే అంశం కంటే నియోజక వర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకత పార్టీలో పట్టు ఉందనడానికి ఇదొక ఉదాహరణ. అలాంటి నాయకురాలికి ప్రభుత్వంలో పదవి దక్కకుండా పోయింది. పైన పేర్కొన్న పదవులు దక్కని పార్టీ నేతలంతా అసంతృప్తితోనే ఉన్నారు.