దళిత ఎమ్మెల్యేల మీద అంత వ్యతిరేకత ఉందా, అప్పర్ క్యాస్ట్ వాళ్ల మీద లేదా
x
YCP party office at Vijayawada

దళిత ఎమ్మెల్యేల మీద అంత వ్యతిరేకత ఉందా, అప్పర్ క్యాస్ట్ వాళ్ల మీద లేదా

ఇప్పటికి 4 జాబితాలు వచ్చాయి. 59 అసెంబ్లీ, 10 లోక్ సభ సీట్లలో వైసీపీ మార్పులు చేర్పులు చేసింది. అయితే వీటిలో 21 ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలవే ఉన్నాయి. ఎందుకిలా?


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 అనే నినాదంతో ముందకువెళుతున్న వైసీపీ నాయకత్వం భారీ కసరత్తే మొదలుపెట్టింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం లేకుండా ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కులాలు, మతాలు, డబ్బు, దస్కం, పరసనాలిటీ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతోంది. గెలిచే అవకాశం లేదని అంతర్గత సర్వేలో తేలితే తన మన అనే తేడా లేకుండా మార్పులు చేర్పులు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మార్పులు చేర్పుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలే ఉన్నారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికి నాలుగు జాబితాలు విడుదలయ్యాయి. పది పార్లమెంటు, 58 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల మార్పులు, చేర్పులు జరిగాయి. మరో 12 మందిని మార్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో అసెంబ్లీకి మార్పులు చేర్పులు చేసిన వారి సంఖ్య 70కి చేరుతుంది. నియోజక వర్గాల సమన్వయ కర్తల మార్పులు చేర్పులపై కసరత్తుకు ముందు సీఎం జగన్‌ ఆయా నియోజకవర్గాల నేతల్ని పిలిచి మాట్లాడుతున్నారు. జగన్ చేసే ప్రతిపాదనలకు ఒప్పుకున్నవారు నోరు విప్పకుండా పార్టీ ఆదేశమే శిరోధార్యం అంటుంటే నచ్చనివాళ్లేమో నాయకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఐదేళ్ల కష్టానికి ఇదా ఫలితం అంటూ వాపోతున్నారు.

తాజా జాబితాలో నలుగురు ఎస్సీలే...

తాజాగా ప్రకటించిన నాలుగో జాబితాలో 9 మందిని మారిస్తే వారిలో నలుగురు ఎస్సీ, ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ధర్ ను తొలగించి కడపకు చెందిన డాక్టర్‌ సుధీర్‌ను సమన్వయకర్తగా నియమించారు. వృత్తి రీత్యా ఆర్ధర్ పోలీసు అధికారి. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్, ప్రోటోకాల్ అధికారిగా పని చేశారు. ఆ కృతజ్ఞతతోనే.. 2014లో సీటు ఇవ్వకపోయినా 2019లో ఇచ్చారు. గెలిచారు. ఇప్పుడు సీటు తిరస్కరించారని ఆర్థర్ వాపోతున్నారు. బైరెడ్డి శ్రీధర్, మరికొంతమంది ప్రయత్నించినా చివరికి డాక్టర్ సుధీర్‌ను ప్రకటించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ యాజమాన్యం డాక్టర్ శ్రీధర్ వైపు మొగ్గు చూపిందని ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది.

ఉప ముఖ్యమంత్రినీ మార్చారెందుకో..

గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రెండోసారి గెలిచారు. ఇప్పుడాయన్ను మార్చారు. స్థానిక మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు నారాయణస్వామిని చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. నారాయణ స్వామి సొంత వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఏదీ దాచుకోకుండా మాట్లాడి చిక్కుల్లో పడుతుంటారు. అటువంటి వ్యక్తికి మరోసారి సీటు ఇస్తే ఇక నియోజకవర్గం తమ చెప్పుచేతల్లో ఉండదని భావించిన ఓసామాజిక వర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వత్తిడి తెచ్చి ఆయన సీటును మార్పించారని సమాచారం. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జిగా నియమించింది.

రక్షణనిధికే రక్షణ కరవైందా..

తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి ఆది నుంచి వైకాపాలో ఉన్నారు. 2019లోనే మంత్రి అవుతారనుకున్నారు. ఆ చాన్స్ రాలేదు. ఇప్పుడు సీటూ లేకుండా పోయింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు టికెట్‌ ఖరారు చేశారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినాని అనుచరునిగా స్వామిదాస్ కు పేరుంది. అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టారు. ఆ టికెట్‌ను వీరాంజనేయులుకు ఇచ్చారు.

21 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే...

ఇప్పటివరకూ 4 జాబితాల్లో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన మార్పుల్లో సిటింగ్‌లకు (ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కలిపి) 34 టికెట్లు గల్లంతయ్యాయి. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే 21 మంది.

మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జిలను వైసీపీ ప్రకటించింది. నాలుగో జాబితాలో ఒక ఎంపీ స్థానంతో పాటు 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది.

మహీధర్‌రెడ్డి టికెట్ నిలబెట్టుకున్నారు...

కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్‌ను కందుకూరుకు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డిని మరెక్కడికైనా మార్చాలనుకున్నారు. ఇందులో భాగంగా మహిధర్ రెడ్డిని క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని కందుకూరులో మహీధర్‌రెడ్డిని యథాతథంగా ఉంచారు.

ఎస్సీ, ఎస్టీలే ఎందుకు టార్గెటన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగుల పని తీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించి.. వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటిస్తేనే.. తాను అనుకున్నట్టుగా 'వై నాట్ 175' లక్ష్యం చేరుకోగలమని భావిస్తున్నారు. దీంతో.. ఇప్పటికే మూడు విడుతల్లో ఎమ్మెల్యే, ఎంపీలు కలిపి 59 మందిని ప్రకటించిన జగన్.. ఇప్పుడు మరో 9 మందితో నాలుగో జాబితా ప్రకటించారు. మరో జాబితా త్వరలో విడుదలవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మార్చే వాళ్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉండడంతో రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లను ఎందుకు మార్చడం లేదన్న ప్రశ్నను ప్రత్యర్థి పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారు.

Read More
Next Story