ఎపిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను అదుపు చేయడంలో ఏపీ పోలీసులు ఫెయిల్‌ అయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. కారణాలు ఏమిటి?


ఎపిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హింస చెలరేగింది. వందల మంది రోడ్లపైన రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులపైన రాళ్లు రువ్వారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీని కూడా రాళ్లతో కొట్టారు. చిత్తూరు జిల్లాలోనూ దాడులు జరిగాయి. ముగ్గురు పోలింగ్‌ ఏజెంట్లు కిడ్నాప్‌ అయ్యారు. తిరుపతి, చంద్రగిరి నియోకజవర్గాల్లో దాడులు జరిగాయి. చంద్రగిరిలో ఒక ఇల్లు తగలబెట్టగా, తిరుపతి మహిళా యూనిర్సిటీలో స్ట్రాంగ్‌ రూముల వద్దకు వచ్చిన టీడీపీ అభ్యర్థిపై హత్యయత్నం జరిగింది. గన్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గన్‌మెన్‌ గాలిలోకి కాల్పులు జరిపిన తరువాత దాడులకు పాల్పడిన వారు పరారయ్యారు.

పల్నాడు జిల్లా నర్సరావుపేట, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దాడులు తీవ్రంగా జరిగాయి. ఇల్లు తగలబెట్టుకోవడంతో పాటు కార్లు, బైకులు తగుల బెట్టారు. కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులు, గొడ్డళ్లు చేతపట్టకుని రోడ్లపై స్వైర విహారం చేశారు.
కారకులు ఎవరు?
పల్నాడు జిల్లా నర్సరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన హింసకు స్థానిక ఎమ్మెల్యేలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వారు నేరుగా రోడ్లపైకి రావడంతో రెచ్చిపోయిన అనుచరులు దాడులకు పాల్పడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారంపూడి ఏరియాలోకి రావడంతో మండలంలో తెలుగుదేశం వర్గీయులపై వైఎస్సార్‌సీపీ వారు దాడులు చేయగా ఆ తరువాత టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు చేశారు. గొడ్డళ్లతో నరుక్కున్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంతో నియోజకవర్గంలో హింస చెలరేగింది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాటలు దాడులకు కారణమయ్యాయని పోలీసులు అంటున్నారు.
వందల కొద్ది కేసులు నమోదు
ఎన్నికల రోజు జరిగిన గొడవలకు సంబంధించి 14వ తేదీ నుంచి కేసులు నమోదు చేయడం పోలీసులు ప్రారంభించారు. సంఘటన జరిగిన ఎన్నికల రోజు ఒక్కరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. తాడిపత్రిలో రాళ్లు రువ్విన సంఘటనలో పోలీసులు చాలా మంది గాయపడ్డారు. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ వర్గాలకు చెందిన వారు రాళ్లు రువ్వుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీకి కూడా రాళ్లదెబ్బలు తగిలాయి. తాడిపత్రి ఘటనలో ఇప్పటి వరకు 90 మందిపై కేసులు నమోదు చేశారు. ఇంకా కొంతమందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఘర్షణలు అదుపు చర్యలు తీసుకోవాల్సిన డిఎస్‌పి చైతన్య అలా కాకుండా ఘర్షణలకు కారకుడయ్యాడంటూ ఆయనను విధుల నుంచి తప్పించారు. చిలుమత్తూరు, హిందూపురంలలో జరిగిన గొడవల్లో కూడా పలు కేసులు నమోదయ్యాయి.
తిరుపతి జిల్లా కేంద్రంలో చంద్రగిరి అభ్యర్థి పులివర్తినానిపై హత్యయత్నం కేసులో ఇప్పటి వరకు 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంకా కొందరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. చంద్రగిరిలోనూ, తిరుపతిలోనూ సంఘటనలు జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు చంద్రగిరి అభ్యర్థి దాడులకు కారణమని పోలీసులు కేసులు నమోదు చేశారు.
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసకు సంబంధించి ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ మీడియాకు తెలిపారు. ఇంక పాలు కేసులు ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఐజి సర్వశ్రేష్ఠి త్రిపాటి, ఎస్పీ కలిసి దాడులపై సమీక్ష నిర్వహించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నికలు మొదలైన పది నిమిషాల్లోనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కిడ్నాప్‌ అయ్యారంటూ ఆర్‌వోకు ఫిర్యాదు రావడంతో ఘర్షణలు మొదలయ్యాయి. పుంగనూరు, జిడి నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోనూ గొడవలు జరిగాయి. మొత్తం మీద ఎన్నికల కేసులు సుమారు 50 వరకు నమోదయ్యాయి. ఇక్కడ ఇంకా ఎవ్వరినీ అరెస్ట్‌ చేయలేదు.
హౌస్‌ అరెస్ట్‌లో ఎమ్మెల్యేలు
పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబును కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వీరిని హౌస్‌ అరెస్ట్‌ చేసిన తరువాత దాడులు కొంతవరకు ఆగాయి. ఎన్నికల రోజుతో పాటు రెండో రోజు కూడా దాడులు కొనసాగటం పోలీసుల వైఫల్యంగా భావిస్తున్నారు.
కారంపూడి మండలంలో వందల సంఖ్యలో రాళ్లు, కత్తులు, గొడ్డళ్లు చేతపట్టకుని రోడ్లపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఒక్కరు కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని స్థానికులు అంటున్నారు.
ఈసీ కొరడా ఝుళిపిస్తుందా?
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫమైందని, అందుకు సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తాను బాధ్యులను చేయాలనే ఆలోచనలో ఎన్నికల కమిషన్‌ ఉంది. వీరిద్దరితో పాటు ఇంటిలిజెన్స్‌ ఎడిజి కుమార విశ్వజిత్‌పై కూడా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిని నేరుగా రిపోర్టుతో ఢిల్లీకి ఎన్నికల సంఘం పిలిపించింది. వారి నుంచి రిపోర్టు అందుకుంది. ఈ విషయంలో ఎటువంటి చర్యలు ఉంటాయోననే అనుమానాలు పోలీసులు ఉన్నత వర్గాల్లో ఉంది.
వైఎస్సార్‌సీపీ వారిపైనే ఎక్కువ కేసులు
ఎన్నికల్లో దాడులకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నికల అల్లర్లకు సంబంధిచి సుమారు 150 కేసులు నమోదైనట్లు సమాచారం. ఒక్క పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సుమారు 200 కేసులు నమోదవుతాయని సమాచారం. గొడ్డళ్లతో నరకడాలు, గృహ దహనాలు, వాహనాల దహనాలు, పోలింVŠ బూత్‌ల్లో ఈవీఎంల ధ్వంసం వంటి సంఘటనలు ఎక్కువ జరిగయి.
Next Story