మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు వైఎస్‌ కుటుంబానికి నమ్మిన వ్యక్తి. జగన్‌ కోసం జైలుకు వెళ్లారు. ఎందుకు జగన్‌కు దూరమయ్యారు?


మోపిదేవి వెంకటరమణారావు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా పదవులు అనుభవించారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మోపిదేవి ఎమ్మల్యేగా నాలుగు సార్లు ఓటమి చెందగా మూడు సార్లు గెలిచారు. సుమారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మొదట కాగ్రెస్‌ పార్టీ, ఆ తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ వచ్చారు. ఉన్నట్లుండి ఈనెల 29న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ ఆయన వివాద రహితుడనే పేరు ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. విజయవాడలోని లయోలా కాలేజీలో తన డిగ్రీ చదువును పూర్తి చేశారు.

స్థానిక రాజకీయాలకే ప్రాధాన్యం
మొదటి నుంచీ స్థానిక రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. సొంత నియోజవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి ప్రజలకు సేవ చేయాలనేది మొదటి నుంచీ ఆయన కోరుకున్నారు. 2019 వరకు ఆ విధంగానే జరిగింది. మొదట 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు . 2014, 2019లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు . 2024 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు రేపల్లె నుంచి టిక్కెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. మీకు వేరే పదవులు ఉన్నాయి. ఈసారికి ఎమ్మెల్యే టిక్కెట్‌ లేదని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఆయనకు వైఎస్‌ జగన్‌పై నమ్మకం పోయింది.
మనసులో ఉన్న మాట బయటకు చెప్పలేదు కానీ జగన్‌ నాయకత్వంపై ఆయనకు విశ్వాసం లేకుండా పోయిందని ఆయన మీడియా ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వూల ద్వారా అర్థమైంది. తాను అనుకున్నది చేయాలనుకుంటాడు. ఎవరు చెప్పినా వినడు. మంచీ చెడులు ఆలోచించే విచక్షణ వైఎస్‌ జగన్‌కు లేదని ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడినప్పుడు చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌తో నాకు ప్రత్యేకించి కొన్ని స్పర్థలు ఉన్నాయి. అవి బయటకు చెప్పుకోలేనని మోపిదేవి చెప్పడం విశేషం. ఢిల్లీలో ఆయన పలు ఎలక్ట్రానిక్‌ మీడియా చానల్స్‌తో మాట్లాడారు. నేను వైఎస్‌ఆర్‌ కుటుంబం కోసం ఎంతో పనిచేశాను. ఆ గుర్తింపును ఇవ్వడంలో జగన్‌ ఫెయిల్‌ అయ్యాడని ఆ ఛానల్స్‌తో మాట్లాడిన మాటలను బట్టి చెప్పొచ్చు.
జగన్‌తో ఎక్కడ చెడింది?
2019 ఎన్నికల్లో మోపిదేవి ఓడిన తరువాత రాజ్యసభకు జగన్‌ మోపిదేవిని పంపించారు. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో మోపిదేవి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు తొందర పడొద్దని చెప్పడంతో వెనుకడుగు వేశారు. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఇష్టం లేకుండానే తీసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. నేను ఎమ్మెల్యేగా రేపల్లె ప్రజల మధ్య ఉండాలని కోరుకున్నానే తప్ప పార్లమెంట్‌కు పరోక్ష పద్ధతిలో రావాలని ఎప్పుడూ కోరుకోలేదన్నారు. ఆ విషయం జగన్‌కు చెప్పినా నా మాటకు విలువ ఇవ్వలేదని, పట్టించుకోలేదన్నారు. అందువల్ల ఇక జగన్‌తో తెగదెంపులు చేసుకోవడమే మంచిదనే బావనతో ముందుగాన తెలుగుదేశం పార్టీ వారితో మాట్లాడి వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మోపిదేవిపై ఉన్న కేసులు ఏమిటి?
మోపిదేవి వెంకట రమణారావు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, సహజ వాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించారనే నేరారోపణపై 2012 మే నెలలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. రమణారావుపై ఐపీసీ–420, 120బి, 409 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసింది. వ్యాన్‌పిక్‌ ప్రాజెక్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌కు సహకరించి క్విడ్‌ ప్రోకోకు మంత్రి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తూ కేసులు నమోదు చేసింది. దీంతో ఏడాది పాటు మోపిదేవి జైల్లో ఉన్నారు. అనారోగ్యం తోడు కావడంతో కోర్టులో బెయిల్‌కు పిటీషన్‌ వేశారు. పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
టీడీపీలో ఇమడ గలుగుతారా?
రేపల్లె నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకునిగా అనగాని సత్యప్రసాద్‌ ఉన్నారు. మూడు సార్లు రేపల్లె నుంచి పోటీ చేసి సత్యప్రసాద్‌ మోపిదేవి వెంకటరమణపై గెలిచారు. ఈ సారి ఆయనకు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రి పదవి కూడా ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మోపిదేవి వెంకటరమణారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్యప్రసాద్‌తో నాకు సన్నిహితత్వమే తప్ప శత్రుత్వం లేదని మోపిదేవి చెబుతున్నారు. ఆయనతో కూర్చుని మాట్లాడుకుని ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని అంటున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోలేదు. ముందుగా తీసుకున్న మాట ప్రకారం వైఎస్సార్‌సీపీకి, పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎటువటి స్ట్రాటజీ తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
Next Story