సీఎంఓ అనుమతి లేకుండా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఏ పనులూ చేయొద్దు అంటూ ఆదేశాలు ఉన్నాయా? అందుకే నర్సరావుపేట ఎమ్మెల్యే ఎక్సైజ్ ఆఫీసులో చిందులు తొక్కారా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు వ్యాల్యూ లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు (పేర్లు రాయొద్దని చెప్పారు) కలెక్టర్ లకు, ఇతర జిల్లా అధికారులకు ఏ పని చెప్పినా సీఎంఓ నుంచి చెబితే తప్ప తాము చేయలేమని చేతులెత్తేస్తున్నట్లు చెబుతున్నారు. తాము ఉన్నా ఉపయోగం అంటూ లేకుండా పోయిందనే బాధ వారిలో ఉంది.
అలా సాధ్యం కాదు..
పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సౌమ్యుడనే పేరు సంపాదించుకున్నారు. మంచి వైద్యునిగా పేరు ఉంది. చాలా మంది ప్రజలు అరవిందబాబు చాలా మంచి వాడని చెబుతుంటారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ప్రస్తుతం నర్సరావుపేట మద్యం డిపోలో పనిచేస్తున్న వారిని తొలగించి తమ పార్టీకి చెందిన వారిని నియమించాలని అక్కడి కలెక్టర్ ను కోరారు. అందుకు కలెక్టర్ సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. ఇలాంటి పనులు చేయాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెప్పాలని, లేకుంటే చేయలేమని, ఇందుకు సంబంధించి ఓరల్ ఆదేశాలు ఉన్నట్లు కలెక్టర్ కార్యాలయం చెప్పటంతో ఆయనకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.
ఎక్సైజ్ హెచ్ఓడీ కార్యాలయానికి ...
ఎమ్మెల్యే అరవిందబాబు నేరుగా విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. నర్సరావుపేట మద్యం డిపోలో తాను చెబుతున్న పది మంది పేర్లు కమిషనర్ కమిషనర్ నిశాంత్ కుమార్ కు ఇచ్చి వీరిని మద్యం డిపోలో నియమించాలని కోరారు. కమిషనర్ లెటర్ తీసుకున్న తరువాత తాను బయటకు వెళుతున్నానని, మరో గంట తరువాత వస్తానని, ఈ లోపు ఆదేశాలు తయారు చేసి ఉంచాలని కమిషనర్ తో అరవిందబాబు చెప్పి వెళ్లి పోయారు.
మూడు గంటల పాటు రచ్చ
సాయంత్రం మూడు గంటలకు కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఆసమయంలో కమిషనర్ లేరు. నేరుగా చాంబర్ లోని యాంటీ రూములోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక దిండు తీసుకుని కొంత సేపు చాంబర్ లోని సోఫాలో కూర్చొన్నారు. ఆ తరువాత చాంబర్ లో నేలపైనే పండుకుని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎంత చెప్పినా ఆయన వినలేదు. చేసేది లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. పల్లా శ్రీనివాసరావు అరవిందబాబుకు ఫోన్ చేసి అక్కడ ఎటువంటి గోలా చేయవద్దని, తన వద్దకు వస్తే మాట్లాడతానని చెప్పారు. అయినా పట్టించుకోకుండా సాయంత్రం ఆరు గంటల వరకు కార్యాలయంలో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాల్లో మేము ఏమి చేయటానికి ఉన్నాం..
నియోజకవర్గాల్లో కార్యకర్తలకు చిన్న పనులు కూడా చేయించలేక పోతున్నాం. అలాంటప్పుడు మేము ఉండీ ఉపయోగం ఏమిటి? ఏమి అడిగినా సీఎం కార్యాలయం నుంచి చెప్పాలంటున్నారు. ప్రతి విషయానికీ ముఖ్యమంత్రిని కలవడం సాధ్యమవుతుందా? నాకంటూ కాస్త స్వతంత్రత లేదా? ప్రజా ప్రతినిధిగా పలానా పని చేయాలని కోరటం కూడా సాధ్యం కాకపోతే ఎలాగంటూ ఆవేదనాగ్రహం అధికారులపై వ్యక్తం చేశారు. కమిషనర్ మాత్రం సాయంత్రం వరకు కార్యాలయానికి రాలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు.
మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
కనీసం పీఏలను పెట్టుకోవాలన్నా సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఆగాలి. ఇలాగైతే ఎలా అంటూ మంత్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేషన్ చెప్పిన వారినే పీఏ లుగా, లేదా పీఎస్ లుగా మంత్రులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మంత్రి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ పీఏలను కూడా మేము పెట్టుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్ఓ ను పెట్టుకోవాలన్నా వారు చెప్పి పంపించిన వారి చేతనే పనిచేయించుకోవాలన్నారు. ఇటీవల మంత్రులకు పీఆర్వోలు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్ పేరుకు మాత్రమే. ముందుగానే సెలక్ట్ చేసుకున్న ప్రకారం ఎంపిక జరిగిట పోయింది.
ఎంపిక చేసిన వారి ఫేస్ బుక్ లు పరిశీలన
మంత్రుల వద్ద పనిచేసేందుకు పీఆర్వోలుగా తీసుకోవాలనుకున్న వారి ఫేస్ బుక్ లు లోకేష్ సోషల్ మీడియా టీం తనిఖీ చేసింది. ఆ తనిఖీలో ఎవరెవరితో వారికి సంబంధాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ఎవరితో వారు ఫొటోలు దిగారు. వారి గురించిన వివరాలు సేకరించి ఆ తరువాతనే సెలక్షన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సహజంగా పీఏలు, పీఆర్వోలు, పీఎస్ ల విషయంలో మంత్రుల అభిప్రాయాలను గౌరవించి వారికే వదిలేస్తారు. వారు కావాల్సిన వారిని పెట్టుకుంటారు. అయితే ఈ ప్రభుత్వంలో అది జరగలేదు. నేరుగా ప్రభుత్వ పెద్దలే వారిని ఎంపిక చేసి మంత్రులకు అలాట్ చేశారు.
మంత్రులు ఏమి చేస్తున్నారో తెలుసుకునేందుకేనా?
మంత్రులు ఏమి చేస్తున్నారు. ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే అంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ఈ రకమైన వ్యవహారానికి తెరలేపారనే చర్చ కూడా పార్టీలో ఉంది. తాము చెప్పినవి కూడా కొన్ని పనులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తేనే చేస్తామని అధికారులు చెబుతుండటంతో ఏమి చేయాలో వారికి దిక్కుతోచడం లేదు. పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నాం తప్ప మాకు ఎటువంటి పవర్స్ లేవని ఆవేదన చెందుతున్నారు.
చాలా మంది ఎమ్మెల్యేలకు మాస్ వార్నింగ్ లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా మంది ఎమ్మెల్యేలకు మాస్ వర్నింగ్ లు ఇస్తున్నారు. మీ జాతకం మొత్తం నా దగ్గర ఉందని, ఏ సమాచారమైనా నేను తెప్పించుకుంటానని, మీ పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నానని పలు సందర్బాల్లో ఎమ్మెల్యేలతో అన్నారు. దీంతో వారిలో ఇవేమి సర్వేలంటూ ఆందోళన మొదలైంది. ప్రతి చిన్న పనికి సీఎం ఆఫీసుకు వెళ్లటం అంటే ఎలా సాధ్యమని అంటున్నారు. పోనీ మంత్రుల ద్వారా చెప్పించుకుందా మంటే వారికే దిక్కు లేదని, ఇన్చార్జ్ మంత్రులు కూడా మా వద్ద ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.