Janasena on Periyar | పెరియార్ కులాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించారు?
x

Janasena on Periyar | పెరియార్ కులాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించారు?

పవన్ కల్యాణ్ మాటలు తమిళ పార్టీల ఐక్యతకు బాటలు వేశాయి. పెరియార్ పేరు ప్రస్తావనతో జనసేనాని మాటలు మంటలు పుట్టించేలా ఉన్నాయి.


తమిళనాట హిందీని వ్యతిరేకించడంపై జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పారు. వ్యతిరేకించారు. అంతటితో ఆగని ఆయన తమిళ సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా సొమ్ము చేసుకుంటారు? అని నిలదీశారు.అక్కడితో కూడా వదలని పవన్ కల్యాణ్ పెరియార్ తెలుగు బలిజ నాయుడు అని కులాన్ని ఆపాదిస్తూ, వ్యాఖ్యానించడంలో ఆంతర్యం ఏమిటి?

పవన్ కల్యాణ్

విప్లవం, అభ్యుదయం, ఆదర్శాల నుంచి కులం, సినీగ్లామర్ ఆలంబనగా జనసేనకూ పవన్ కల్యాణ్ ఊపిరి పోశారు. అధికారంలోకిచేరువకావడంలో బీజేపీకి సన్నిహితంగా మారి హిందూత్వం, సనాతన అజెండా దిశగా ఆయన ప్రస్థానం రూపాంతరం చెందింది.

పెరియార్

తమిళనాడులో పెరియార్ బడుగుజీవుల ఆత్మగౌరవ పోరాటం కోసం పేరు వెనుక కులాన్ని చెరిపేసిన వ్యక్తి. తనకు జరిగిన అవమానం, దళితులకు ప్రాధాన్యం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని వీడిన పెరియార్ సనాతనం నుంచి నాస్తికం వైపు అడుగులు వేశారు. ఆయన పేరు, కులాన్ని ప్రస్తావించడం ద్వారా పవన్ కల్యాణ్ తనకు తాను మరో పెరియార్ అని చెప్పుకోవడానికి ప్రయత్నించారా?

ఇదిలావుంటే, తమిళనాడుపై హిందీ భాషను రుద్దడాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. మినహా హిందీ మాట్లాడే వారిని వద్దనలేదు. ముస్లింల అస్థిత్వాన్ని, వారి ప్రార్ధనలు, జీవనానికి భంగం కలిగించలేదనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటాం అని తమిళనాడు ప్రభుత్వం, పార్టీలు ముక్తకంఠంతో తెగేసి చెప్పాయి. ఈ పరిస్థితుల్లో

మంటలు రేపిన కల్యాణ్

పిఠాపురంలో జనసేన 12వ వార్షికోత్సవ జయకేతనం ప్లీనరీలో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు వివాదాలకు ఆస్కారం కల్పించడమే కాదు. పెద్ద చర్చకు దారి తీసింది. తమిళ పార్టీల ఆగ్రహానికి గురయ్యేలా కనిపిస్తోంది. రాజకీయ పరిశీలకుల కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి కల్పించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో తమిళ పార్టీలు ఏకం అయ్యాయి. డీఎంకేకి వ్యతిరేకంగా దళపతి, సినీ కథానాయుడు విజయ్ తమిళ వెట్రిగ కళగం (Tamil Vetriga Kalagam -TVK) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. తమిళనాడు సీఎం స్టాలిన్ హిందీకి వ్యతిరేకంగా సాగించాల్సిన పోరాటంపై ఏర్పాటు చేసిన సమీక్షకు టీవీకే పార్టీ నేత విజయ్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి మీడియా ప్రతినిధుల నుంచి తెలిసిన సమాచారం.

"హిందీ వద్దు కానీ ఆ భాష ఆధారంగా నిర్మించే సినిమాలతో వచ్చే ఆదాయం కావాలా?" అని పవన్ కల్యాణ్ సూటిగా నిలదీయడం తమిళుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడినట్లు వాతావరణం కనిపిస్తోంది. అంతటితో ఆగని పవన్ కల్యాణ్ ద్రవిడ ఉద్యమ ఆరాధ్యుడు పెరియార్ రామస్వామి ఎనాయకర్ పేరు ప్రస్తావించడం తోపాటు ఆయన కూడా తెలుగు మూలాలు కలిగిన బలిజ నాయుడు అని కులాన్ని ఎత్తిచూపారు. తద్వారా పవన్ కల్యాణ్ మదిలో మాట ఎలా ఉందనే విషయం కూడా తెరమీదకు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వెనుక నిగూఢార్థం దాగి ఉందనే విషయం అర్థం అవుతుంది.

పెరియార్ కు కులం ఉందా..?

కాపు కులానికి చెందిన పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో "తాను కూడా పెరియార్ అంతటి వాడిని చెప్పదలుచుకున్నాడా? లేక రాయలసీమలో బలజలు (కాపు), కోస్తా ప్రాంతంలోని తూర్పు కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారా?" అనే అంశాలు చర్చకు వచ్చాయి. పెరియార్ ఈరోడ్ వెంకట రామస్వామి పెరియార్ గా, తందై పెరియార్, రామస్వామి, ఈవీఆర్ గా పేరు సంపాదించుకున్న నేత. ఈయన నాస్తికవాదే కాకుండా, సంఘ సంస్కర్తగా తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమానికి ఊపిరి పోశారు. ద్రావిడ ఉద్యమ నిర్మాత అనేది జగమెరిగిన సత్యం.

ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యాలపై సీపీఎం నేత కందారపు మురళి స్పందించారు.

సంఘ సంస్కర్త పెరియార్ కు కులం అంటగట్టడం అంటే, అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు.

"బీజేపీ పక్కన చేరిన కల్యాణ్ దక్షిణాది నేతగా ఎదగాలని ఉవ్విళూరుతున్నారు. సనాతన ధర్మం అంటూ మతాన్ని నెత్తికెత్తుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పెరియార్ పేరు ప్రస్తావించే అర్హత ఏమత్రం లేదు" అని కందారపు మురళి వ్యాఖ్యానించారు. బలిజ సామానికవర్గంలో ఆయన సంస్కర్తగా మరోహీరో కావాలని భావించినట్లే కనిపిస్తోంది. అని అభివర్ణించారు. అలా అనుకుంటే ఆయన మూర్ఖత్వం అని మురళీ అన్నారు.

దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందనే ఆగ్రహంతో రామాయణం, రాముడిని పెరియార్ విమర్శించారు. ఊరేగింపులు కూడా నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. 1904లో పెరియార్ కాశీలోని విశ్వనాథుడి దర్శనానికి వెళ్లిన సమయంలో జరిగిన అవమాన భారంతో ఆయన నాస్తికుడిగా మారడానికి బీజం వేసిందని చెబుతారు. బ్రాహ్మణ వర్గాన్ని ధ్వేషించిన పెరియార్ పూర్వీకులది కర్ణాటక ప్రాంతానికి చెందిన కన్నడ బలిజలు అనేది చరిత్ర చెబుతున్న మాట.

నల్ల చొక్కా వెనుక కథ...

తమిళనాడులో పెరియార్ కూడా 1919 నుంచి 1925 వరకు కాంగ్రెస్ నేతగా ఉంటూనే స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. ఆ తరువాత కాలంలో పెరియార్ తోపాటు ఆయన అనుచరులు సాంఘిక సమానత్వం కోసం పోరాటాలు సాగించిన చరిత్ర ఉంది.

1929లో చెంగల్పట్టు ఆత్మగౌరవ సమావేశంలో పెరియార్ రామస్వామి తన పేరు వెనుక ఉన్న కులం పేరును తొలగించుకుని, ఆత్మగౌరవానికి సాక్ష్యంగా నిలవడమే కాదు. తమిళనాట ప్రజలు, ద్రావిడ పార్టీలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి.

1919లో వ్యాపారం వదిలి కాంగ్రెస్ లో చేరిన రామస్వామి తమిళ సమాజంలో బలంగా ఉన్న కుల మనోభావాతు, మూఢ నమ్మకాలను పారదోలి, పోరాటం సాగించడానికి చిహ్నంగా నల్లచొక్కా (BLOCK SHIRT) ఎంచుకున్నారు. ఇప్పటికీ ద్రావిడ పార్టీలు అదే పంథాను అనుసరిస్తున్నాయి.

అంటరానితనం సరైంది కాదు. వారిని ఆలయాల్లోకి అనుమతించాలి. బ్రాహ్మేణతరులకు అర్చకులుగా రిజర్వేషన్ కల్పించాలనే పెరియార్ డిమాండ్ ను 1925 కాంగ్రెస్ పార్టీ కంచి సమావేశంలో బ్రాహ్మణవర్గం వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడిన పెరియార్ ద్రావిడ ప్రజల కోసం ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

హిందీపై వ్యతిరేకత

తమిళనాడులో 1937లో రాజాజీ సారధ్యంలోని మద్రాసు ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాస్ రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టడాన్ని పెరియార్ వ్యతిరేకించడమే కాదు. తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమానికి బీజం వేసి, సఫలం అయ్యారు.

పార్లమెంటరీ రాజకీయలు వదిలేసిన జస్టిస్ పార్టీని ద్రావిడర్ కళగం అనే సామాజిక ఉద్యమ సంస్థగా తీర్చిదిద్దారు. కాగా, రాజకీయల వైపు ఆసక్తి కలిగిన ఆయన అనుచరులు పెరియార్ నుంచి పక్కకు తప్పుకుని అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం ( Dravida Munnetra Kazhagam - DMK) పార్టీని ప్రారంభించారు. 1969లో ఆయన మరణానంతరం కలైంజర్ కరుణానిధితో విభేదించిన ఎంజీ. రామచంద్రన్ అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ( All India Anna Dravida Munnetra Kazhagam AIADMK) పేరుతో మరో పార్టీ స్థాపించారు. పెరియార్ రామస్వామి 1973లో మరణించినా, ఇప్పటికీ తమిళ ద్రావిడ పార్టీలకు ఆయన ఆరాధ్యుడే. ఇలా చెబుతూ వెళితే.. పెరియార్ జీవితం ఆవిష్కరించడానికి అక్షరాలు చాలవు. పేజీలు కూడా సరిపోవు.

పెరియార్ పై తమిళ రచయిత మంజై వసంతన్ ఏమంటారంటే...

పెరియార్ జీవితం, ఆయన నాస్తికత్వానికి ముందే ఆలయాలను కూడా జీర్ణోద్ధరణ చేయించిన చరిత్ర ఉంది" qనేది తమిళ రచియిత మంజై వసంతన్ "వీరే పెరియార్" పేరిట రాసిన 200 పేజీల పుస్తకంలో ప్రస్తావించారు. పెరియార్ ద్రవిడ నాట నాస్తిక, ఆత్మగౌరవ, మహిళా హక్కుల కోసం సాగించిన వ్యక్తి అని కూడా ప్రస్తావించారు. "తమిళభాష ఒక ఆటవిక భాష" అని అనడమే కాదు. ఎందుకు అలా అనవలసి వచ్చిందో చెప్పిన ధైర్యశాలి పెరియార్ కు దక్కిందనేది ఆ పుస్తకంలో ప్రస్తావించారు.

ఈ తమిళ వెర్షన్ ను ఇంగ్లీషులోకి అనువాదం చేసిన బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ చదివి, హైదరాబాద్ లో ఉంటున్న దామోదర్ (70) 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, తాను ఇంగ్లీష్ లో రాసిన పుస్తకాన్ని నెల్లూరుకు చెందిన జనార్థనరావు తెలుగులో అనువదించారని చెప్పారు. ఇంకా ఆయన ఏమంటారంటే..

"దేవుడు ఉన్నాడా? లేడా అనేది పక్కకు ఉంచుదాం. రాజమండ్రికి చెందిన ఓ బృందం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వెళుతోంది. ఊరి దగ్గరకు చేరుకునే లోపే జరిగిన ప్రమాదంలో వారంతా మరణించారు. వారిని ఎందుకు రక్షించలేకపోయారు" అనే ధర్మసందేహాన్ని వ్యక్తం చేశారు.

"నాకు తెలిసిన ఓ స్నేహితుడు కోట్ల రూపాయలు సంపాదించారు. అందులో 40 కోట్లు తిరుమలకు కానుకగా విరాళం ఇచ్చారు. అదే సొమ్ముతో విద్యాలయాలు ఎందుకు స్థాపించకూడదు" అనేది ఆయన ప్రశ్న. హిందూత్వం, సనాతనం స్థానంలో మానవత్వం, ఆత్మగౌరవం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందనేది తన అభిప్రాయంగా దామోదర్ చెబుతూ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పెరియార్ కులాన్ని ప్రస్తావించడంపై అలా స్పందించారు.

పెరియార్ పై అపోహలకు సమాధానం...

మంజై వసంతన్ "వీరే పెరియార్" పేరిట రాసిన 200 పేజీల పుస్తకాన్ని ఉదయనిధి సమీక్షించారు. " ఇప్పటికీ చాలామందికి తెలియదు. పెరియార్ పూర్తిస్థాయి ఆలోచనలపై ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. అన్నింటికీ "వీరే పెరియార్" పుస్తకం సమాధానం చెబుతుందనేది ఉదయ అభిప్రాయం. పెరియార్ జీవితంలో ముఖ్యమైన సందర్భాలను స్పర్శిస్తూ, ఓ జీవిత చరిత్రగా తమిళంలో మంజై వసంతన్ రాసిన పుస్తకంలో వైకోమ్ పోరాటం, ఆత్మగౌరవ సంస్థ ఏర్పాటు, ఆత్మగౌరవ వివాహాలు, తమిళంలో అక్షరాలపై పరిశోధనలాంటి అంశాలు, మహిళల హక్కులు, సామాజిక న్యాయంపై పెరియార్ ఆలోచనలకు ఈ పుస్తకమే సమాధానం" అని ఉదయ్ విశ్లేషించారు.

కల్యాణ్ మాటల వెనుక మర్మం?

తనకు జరిగిన అవమానం పెరియార్ ను నాస్తికం వైపు అడుగులు వేయించింది. దళితులను ఆలయ ప్రవేశం చేయించాలనే ప్రతిపాదనను ఆక్షేపించిన బ్రాహ్మణవర్గంపై తిరుగుబాటుతో కాంగ్రెస్ ను వీడారు. ఆత్మగౌరవం కోసం తన పేరు వెనక ఉన్న కులాన్ని తొలగించుకున్న వ్యక్తి పెరియార్ కు మాత్రమే దక్కింది. అయితే..

చేగువేరా విప్లవ స్ఫూర్తితో పవన్ కల్యాణ్ అభ్యుదయం, ఆదర్శం అజెండాగా జనసేనకు ఊపిరి పోశారు. పదేళ్లపాటు అదే పంథాలో పార్టీ నడిపారు. మినహా నిర్మాణంలో కనిపించలేదనే విషయం తెలిసిందే. సినిమా గ్లామర్, ఆయన అన్న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి చరిష్మా, అంతకుముందు ఆయన సారధ్యంలోని ప్రజారాజ్యంతో రాజకీయ ఓ న మా లు నేర్చుకున్నారు.

పిఠాపురం జనసేన విజయకేతనం ప్లీనరీలో పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో తమిళనాడు ద్విభాషా సూత్రాన్ని సూటిగా ప్రశ్నించడమే కాదు. పెరియార్ పేరు, ఆయన కులాన్ని కూడా ప్రస్తావించడం కొందరిని ఆలోచనలో పడేసింది. కాపులకు కొత్త ఊపు ఇచ్చింది.

అబ్బో.. మన కల్యాణ్ పెరియార్ అంతటి వాడబ్బా అనుకోవడానికి మాట్లాడారా? అనే చర్చల్లో మునిగిపోయారు. కల్యాణ్ మాటలు ద్రావిడ పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. ద్రావిడ చరిత్రకారులు కూడా ఆక్షేపిస్తున్నారు. తాను పెరియార్ అంతటి వ్యక్తి అని భావిస్తే, అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అర్థం లేని పోలిక అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సనాతనం, కులం నుంచి దూరంగా జరిగిన పెరియార్ ఎక్కడ?

ఈ వ్యాఖ్యలు చేసిన మదనపల్లెకు చెందిన భారతీయ అంబేడ్కర్ సేన ( BHARATEEYA Ambedkar Sena - BOSS) వ్యవస్థాపక అధ్యక్షుడు, విడుదలై చిరుతైగల్ కట్చి ( VIdulai Chiruthaigal Katchi - VCK) ఏపీ ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఏమంటున్నారంటే..

"అభ్యుదయం, ఆదర్శం, విప్లవాల మాటల నుంచి హిందూత్వం, సనాతనం పేరిట బీజేపీ సంకలో చేరిన పవన్ కల్యాణ్ ఎక్కడ??" అని ప్రశ్నించారు. చరిత్రకారుల మాటలు స్పర్శించే సమయంలో ప్రజాజీవితంలో ఉన్న వారు జాగర్తలు తీసుకోవాలని శివప్రసాద్ వ్యాఖ్యానించారు. పెరియార్ ఆదర్శాలు తెలిసే పవన్ కల్యాణ్ మాట్లాడారా? అనే సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు ఎవరి అజెండా వారికి ఉంటుంది. తప్పులేదు. అందరినీ దారితప్పినట్లు అన్వయించుకోవడం అవివేకం" అని శివప్రసాద్ వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ పెరియార్ పేరు ప్రస్తావించడం. ఆయనకు కులం ఆపాదించడం. కోలీవుడ్ పై చేసిన వ్యాఖ్యానాలు దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాదిరే తనకు అభిమాన గణం తమిళనాడులో ఉందని కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. పిఠాపురం జయకేతనం సభ మంటలు ఎలా ఉండబోతాయి. తమిళనాట ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

Read More
Next Story