పొన్నవోలు సుధాకరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌. ఈయన లండన్‌లో సీఎం జగన్‌కు ప్రమాదం పొంచి ఉందంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకు అలా చేశాడు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా(ఏఏజీ) ఉన్న పొన్నవోలు సుధాకరరెడ్డి టాపిక్‌ ఇప్పుడు అటు సోషల్‌ మీడియాలో.. ప్రభుత్వ యంత్రాంగంలో.. ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏమి జరిగింది? పొన్నవోలు సుధాకరరెడ్డి అమరావతి నుంచి లండన్‌ వెళ్లి అక్కడ జరిగిన ఎన్‌ఆర్‌ఐల సమావేశంలో ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చాడు? ముఖ్యమంత్రి జగన్‌ సన్నిహితులు ద్వారా కానీ లేదా వ్యతిరేకుల ద్వారా కానీ ఆయన ప్రాణాలకు ముప్పుందని, వ్యతిరేకుల కంటే సన్నిహితులే ఆయనను ఏ క్షణంలోనైనా చంపేయొచ్చంటూ వేదికపై ఏడవడంతో సమావేశానికి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు నిర్ఘాంత పోయారు. కొందరు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయన పక్కన ఉండే వాళ్లు వెటకారంగా నవ్వారు. ఇంతకు ఎందుకు పొన్నవోలు సుధాకరరెడ్డి ఏఏజీ స్థాయిలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యానించాడు?

జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ టూర్‌ వారం రోజుల ముందు ప్రకటించారు. ఆయన లండన్‌ వెళ్తే ఆయనతో పాటు వందలాది మంది అమరావతి నుంచి అనుసరిస్తూ వెళ్లారు. వీరందరికీ జగనే టిక్కెట్లు రిజర్వు చేయించారా? లేదా ఎవరికి వారు టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారా? ఏయే దేశాల్లో జగన్‌ పర్యటించేందుకు జగన్‌ వెళ్తున్నారో ముందుగానే జగన్‌ తన అనుచరులకు చెప్పారా? నాతో పాటు మీరు కూడా రండి అని వారికి ముందుగానే తెలియజేశారా? అధికార పార్టీలో ప్రభుత్వ పదవుల్లో ఉన్న ముఖ్యులందరికీ మీ సొంత ఖర్చులు పెట్టుకోవలసిన అవసరం లేదని, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుందని, ముందుగానే ఏదైనా వారికి హింటిచ్చారా? అనేది కూడా ఇంత వరకు వెళ్లడి కాలేదు.
లండన్‌లో స్థానికంగా ఉండే ఎన్‌ఆర్‌ఐలందరినీ పోగు చేశారు. లండన్‌ నగరంలో ఒక పెద్ద కారు ర్యాలీ నిర్వహించారు. ఆ కార్లకు వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు కట్టారు. అంటే ఒక విధంగా లండన్‌ నగరంలో వైఎస్‌ఆర్‌సీపీ చేసిన ప్రచార కార్యక్రమం అనుకోవచ్చు, హంగామా అనుకోవచ్చు. ఏదైనా ఆ దేశ ప్రధాన మంత్రిని తలదన్నేలా క్యార్యక్రమాలను నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఎవరు కూడా ఈ విధమైన కార్యక్రమాలను లండన్‌లో నిర్వహించ లేదు. జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలను పొగుడుతూ ప్రముఖ గాయని మంగ్లీ పాడిన పాటలు సభికులను ఉర్రూతలూగించాయి.
అందుకేనేమో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జగన్‌ లండన్‌ టూర్‌పై ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి గారు లండన్‌లో పొర్లు దండాలు పెట్టించుకోవడం కాదు, రాష్ట్రంలో అమాయకులైన బాలికలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఒక బాలిక కృష్ణా జిల్లా కైకలూరులో క్లాస్‌ రూమ్‌లోనే అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైంది.. అంటూ ఒక ఇంగ్లీషు పత్రికలో వచ్చిన పేపర్‌ కటింగ్‌ను కోట్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇది భారత దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
పొన్నవోలు సుధాకరరెడ్డి వైఎస్‌ జగన్‌కు నమ్మిన బంటు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తోందంటే జగన్‌మోహన్‌రెడ్డి ఒకప్పటి జగన్‌ కాదు. కక్షలు, కార్పణ్యాలకు చాలా దూరంగా ఉన్నారు. ఫాక్షనిజాన్ని అణచి వేశారు. అలాంటి వ్యక్తికి ప్రాణ భయం ఉంది.. ముఖ్యంగా దగ్గరి వాళ్ల నుంచే ఉంది.. అది మీ దగ్గర ఉండే వాళ్లు కావచ్చు.. నా దగ్గర ఉండే వాళ్లు కావచ్చు. ఇవన్నీ జగన్‌కు తెలుసు. అయినా చిరు నవ్వుతో వాటిని పక్కన పెట్టారే తప్ప ఏ నాడు ఎవ్వరినీ అనుమానించ లేదు. బాధించ లేదు. ఇది ఆయన ఔదార్యమంటే అంటూ ఏఏజీ సమావేశంలో స్నేహితుల మధ్య ప్రశ్నంసల ఝల్లు కురిపించారు. ఇంతకు జగన్‌ మోహన్‌రెడ్డికి ఎవరితో ప్రమాదం ఉంది? ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆయన చేసిన తప్పేంటి? అనేది పెద్ద చర్చగా మారింది. పొన్నవోలు సుధాకరరెడ్డి చెబుతున్న మాటల ప్రకారం ప్రతిపక్షాలతో జగన్‌కు ఎప్పుడు ముప్పు కనిపించ లేదు. కేవలం సన్నిహితులు, రక్త సంబంధీకులతోనే ఉందని మాట్లాడారు. ఎవరు వారు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ విషయాన్ని పొన్నవోలు సుధాకరరెడ్డి నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లారా? లేదా? తీసుకెళ్లకుండానే ఏఏజీ అయ్యుండి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? అనేది తీవ్రమైన చర్చగా మారింది.
కడప ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ షర్మిల మరొక విషయాన్ని కూడా ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఎవరు చేర్చారు? ఈ పొన్నవోలు సుధాకరరెడ్డి కాదా? జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు ఆయన కాదా వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందా? వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం వెనుక పొన్నవోలు హస్తం లేదా? ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టమని చెప్పింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాదా?
కాదాని చెప్పమనండి నేను అవును అని నిరూపిస్తా.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. తనతో సోనియా గాంధీ మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, ఇది ఎవరు చెబితే పోలీసులు చేర్చారని ఆలోచించాలని సోనియా గాంధీ తనను కోరిందని, వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం వెనుక పొన్నవోలు సుధాకరరెడ్డి, వైఎస్‌ జగన్‌ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. నిజానికి ఈ అంశాలను పరిశీలిస్తే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తేల్చుకోలేని పరిస్థితుల్లో పోలీసులు కూడా ఉన్నారనే సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు.
పరిస్థితులు ఇలా ఉంటే వైఎస్‌ జగన్‌ హత్యకు కుట్ర దారులు ఎవరు? మావోయిస్టులా? అది జరిగే పని కాదు. ఈ రాష్ట్రంలో మావోస్టుల ఏరివేత ఎప్పుడో పూర్తి అయింది. ఏఓబీలో మాత్రమే వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇటీవల కాలంలో పలు చోట్ల ఎన్‌కౌంటర్లు కూడా జరిగాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. చాలా మంది సరెండర్‌ అయ్యారు. వారు జగన్‌ హత్యకు కుట్రలు పన్నుతున్నారంటే ఎవరు నమ్మరు.
ఇక కుటుంబ సభ్యుల్లో తల్లి, చెల్లి ఉన్నారు. కన్న తల్లి ఎవరినైనా చంపాలని ఆలోచిస్తుందా? ఇది ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ. అన్నా చెల్లెళ్ల మధ్య పోటీ జరుగుతోంటే ఎటూ చెప్ప లేక ఆమె అమెరికాకు వెళ్లి పోయారు. అయితే ఆమె ఒక పిలుపునిచ్చారు. మా కొడుకు ఇప్పుడు రాజు.. నా కూతురును కూడా రాజును చేయమని కోరుకుంటున్నా.. కడప పార్లమెంట్‌లో గెలిపించాలని కోరుతున్నా. ఇది తన విన్నపంగా ప్రకటించారు.
ఒకే జనరేషన్‌ నుంచి ఇద్దరు పవర్‌ పాలిటిక్స్‌లో ఉండటం మంచిది కాదు. అందుకే నేను చెల్లిని నిరోధించా. ఆమెకు పార్లమెంట్‌ సభ్యురాలిగానో, రాజ్య సభ సభ్యురాలిగానో అవకాశం కల్పించొచ్చు. అయినా నేను వద్దనుకున్నా. అందుకే వారు నాకు నెగిటివ్‌ అయ్యారు. ఇక నేను ఏమని చెప్పాలి. అంటూ పలు చానల్స్‌కిచ్చిన ఇంటర్వ్యూల్లో పూర్తి సమాచారన్ని జగన్‌ దాట వేశారు.
సరే ఈ విషయంలో మనం ఒక విషయాన్ని ఆలోచిద్దాం. వైఎస్‌ విజయమ్మ, జగన్‌ కంటే ముందు తరానికి చెందిన మహిళ. ఆమె ఒక సారి ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. అయినా తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించ లేదు. మరి దీన్ని ఏమనాలి? ఒకే జనరేషన్‌లో ఇద్దరు ఎందుకు అని చెప్పిన జగన్‌ తల్లిని ఎందుకు అవాయిడ్‌ చేశారు? భార్య తరపున బందువు అయిన అవినాష్‌రెడ్డిని ఎందుకు ఎంకరేజ్‌ చేస్తున్నారు? అందుకు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేనే నమ్ముతున్నా. అందుకే వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్‌ ఇచ్చా. ప్రజలు అవినాష్‌ను గెలిపించాలని కోరుతున్నా. అని అంటున్నారు.
ఇంతకూ కుటుంబ సభ్యుల్లో ఎవరు జగన్‌ను హత్య చేస్తారు? ఎందుకు చేస్తారు? కారణాలు ఏమిటి? సన్నిహితులు కూడా హత్య చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అనే విషయాలను పొన్నవోలు సుధాకరరెడ్డి వెల్లడించ లేదు. లండన్‌లో ఎన్‌ఆర్‌ఐల సమావేశంలో ఎందుకు ఈ మాటలు మాట్లాడారు? ఎందుకు కన్నీటి పర్యంతమయ్యారు? ఆయనకు జగన్‌ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం ఏమిటి? కేవలం పదవి ఇచ్చాడనే ఇంతటి ఆవేదనకు లోనయ్యారా? లేక ఎవరు చంపుతారనే సమాచారం నిజంగానే పొన్నవోలుకు ఉందా? అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చగా మారింది.
Next Story