ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుల కోటాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకోనివ్వకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టాను సారంగా వ్యవహరించాయి. పోలవరానికి కష్టాలు తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదేళ్లు దాటింది. ఇప్పటికీ పునాదుల్లోనే ఉంది. ఇందుకు పాలక, ప్రతిపక్షాలే కారణం. ఒకరు ఒక సారి అధికారంలో ఉంటే, మరొక్కరు మరో సారి అధికారంలో ఉన్నారు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీలు ఎప్పుడో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును నేటికీ పునాదుల్లోనే ఉంచాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రగడ మొదలైంది. ఎత్తు తగ్గించి నిర్మిస్తున్నారని మాజీ సీఎం జగ¯Œ ట్వీటర్ వేదికగా ఓ భారీ విమర్శనాస్త్రాన్ని సంధించారు. దీనిపై స్పందించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వమే ఎత్తు తగ్గించిందని విమర్శించారు. ఇందులో ఎవరి వాదనలో నిజముంది? అనేది తేలాల్సిన అవసరం ఉంది.
ఎత్తు ఎందుకు తగ్గించారు?
పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే.. 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారంటూ జగన్ ప్రశ్నించారు. ఎత్తు తగ్గించడం వల్ల 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ 115 టీఎంసీలకు పడిపోతుందనే విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. ఈ కారణంగా వరదలు వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. గోదావరి డెల్టాలో పంటలకు స్థిరంగా నీటిని ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. శర వేగంగా విస్తరిస్తున్న విశాఖ నగరానికి తాగు నీరు అందించలేని పరిస్థితి వస్తుంది. పారిశ్రామిక అవసరాలకు అంతకంటే నీరందించలేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీరందించలేని పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుంది. మీ ప్రభుత్వ మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలకమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన తప్పులను సరిదిద్ది, ప్రతి ఏడాది వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే జరిగాయన్నారు. ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 12,127 కోట్లు కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిందని, సీఎం చంద్రబాబు ఎప్పటిలానే దుర్బుద్ధి చూపించి ఎన్డీఏతో పొత్తు ఖరారైన తర్వాత ఎన్నికలకు ముందు రావలసిన ఆ డబ్బును రానీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ డబ్బును కేంద్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు.
ఎత్తు విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదు
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా గతంలో తాము ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉంటే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రెండు ఫేజులంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని తప్పుబట్టారు. 2022 జనవరిలో ప్రాజెక్టు ఫేజ్1, ఫేజ్ 2 అంటూ 41.15మీటర్ల ఎత్తును ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సీఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు లేఖ రాస్తూ రూ. 10,911.15 కోట్ల మేర నిధులు కావాలంటూ అడిగారన్నారు. ఆ తర్వాత జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీఈలు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాస్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారని విమర్శించారు. ఇందులో తప్పు ఎవరిదనేది ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు.
వాదనలతో సరిపుచ్చుతారా?
ఎవరి వాదనను వారు వినిపించారు. తాము గతంలో ప్రతిపాదించిన ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిపాదిత ఎత్తును ఎందుకు తగ్గించారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. కేంద్రం వద్ద ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఎత్తు 41.15మీటర్లుగానే ఉంది. మొదట ప్రతిపాదించిన ప్రకారం 45.72మీటర్ల ఎత్తు అనేది లేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఎంతైతే ప్రాజెక్టు ఎత్తు నిర్మించాలని ఉందో ఆ మేరకే నిర్మాణం జరుగుతుంది. కేంద్రం వద్ద 45.72మీటర్ల ఎత్తు నిర్మాణం జరుగుతుందనే అంశాన్ని ఖరారు చేసుకోవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.